జగత్తులో చాల మంది భక్తి గీతాలను రచించినవారున్నారు. భగవంతుని గురిగించి కదిలించిన రచనలు చేసిన వారున్నారు. భక్త్యానంద పారవశ్యంలో తన్మయులను గావించే భక్తి గీతాలు జగత్తులో ఉన్నాయి. అయితే, త్యాగయ్య కీర్తనలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి కీర్తన తన జీవితంలో ఒక సంఘటనకు సంబంధించినదే. ఉదాహరణకు, తంజావూరు రాజు ధన కనక వస్తు వాహనాదులను అతని గానపటిమకు బహుమతిగా పంపినప్పుడు వానిని తిరస్కరిస్తూ, "నిధి చాల సుఖమా, ఈశ్వర సన్నిధి చాల సుఖమా?" అనే కీర్తనను రచించి గానం చేశాడు. తన సోదరుడు రఘనాధుడు రామ విగ్రహాన్ని కావేరి నదిలో పారవేసినప్పుడు ఎంతో విలపిస్తూ, తీవ్ర ఆవేదనతో, పరితాపంతో సంధ్యావందనం గావించు చుండగా దోసిలికి అందిన ఆ విగ్రహాన్ని చూస్తూ, "రార మా ఇంటి దాక, రఘువీర సుకుమార.." అనే కీర్తనము గానం చేశాడు. రాజాస్థానంలో “ఎందరో మహామభావులు." అనే కీర్తనను ఆలపించాడు. ఈ ప్రకారం ప్రతి కీర్తన ఒకానొక సంఘటనకు సంబంధించినదే. ఆ కారణంచేత ఈ కీర్తనలు భక్తిని అనుభవ జ్ఞానాన్ని శరణాగతి తత్త్వాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి.
(స.సా.వా, 99 పు.166/167)