భగవంతునికి సంబంధించిన ప్రతి అక్షరము బీజాక్షరమే. అందువల్ల నేను మీ చెవిలో ఎటువంటి మంత్రమును చెప్పటం లేదు. నేను మాట్లాడే ప్రతి మాటలో ఆ విషయం చెప్తూనే ఉన్నాను. మీరు జాగ్రత్తగా వినండి. మీరు నిద్రలేవగానే మీకు భగవంతుడిచ్చిన పాత్రనే పోషించడానికి రంగస్థలంపై ప్రవేశిస్తున్నామని భావించండి. మీరు బాగా నటించాలని, ఆయన అభిమానం పొందాలని ఆయనను ప్రార్థించండి. రాత్రిపూట నిద్రపోయే ముందు నటించిన దృశ్యం పూర్తి అయిన కారణంగా గ్రీన్ రూమ్ లోకి ప్రవేశిస్తున్నామని భావించండి. మీ పాత్ర పోషించటం పూర్తి అయితేనే తప్ప డ్రస్ మార్చుకొనటానికి భగవంతుడు అనుమతించడు. మీరు మరునాటి ఉదయం తరువాత దృశ్యంలో ప్రవేశిస్తాడు. దానిని గురించి ఇప్పుడు దిగులు పడవద్దు. మీరు పూర్తిగా ఆయన ఆధీనంలో ఉండండి. ఆయనకు తెలుసు. ఈ నాటకం రచించింది ఆయనే. ఇది ఎలా ఉంటుందో, ఎలా సమాప్తమవుతుందో ఆయనకు తెలుసు. నటించటము, విశ్రాంతి తీసికొనటము, అదే మీరు చేయవలసినది.
(వ161-62పు.165/166)