జగత్తులో ఎన్ని కోట్లమంది మానవ రూపాలను ధరిస్తున్నారు. యావత్ ప్రపంచములో అయిదు వందల ఎనిమిది లక్షల కోట్లు ఉంటున్నారు. ఇంతమంది లోపల ఒకడుండినట్లు ఇంకొకడెవడైనా ఉండటానికి వీలవు తుందా? ఒక తల్లి గర్భములో ట్విన్స్ పుడున్నారు. వారిలో కూడా కొంత వ్యత్యాసము ఉంటుంది. కానీ సమానంగా ఎక్కడనూ కన్పించటం లేదు. ఇన్ని రూపములు, ఇన్ని రకములుగా ఎవరు చేయగలరు?
మానవుడు విసర్ణించిన బొగ్గుపులుసు వాయువును వృక్షములు తీసుకొంటున్నాయి. వృక్షములు వదిలిన ప్రాణవాయువును మానవుడు స్వీకరిస్తున్నాడు. ఈ విధమైన నియమమును ఎవరు ఏర్పరిచినారు? ఆక్సిజన్ తెచ్చి ముక్కులో పెట్టి ఎంతగా పంపుచేసినా యీ పనుల జరగటం లేదు. సృష్టిలోపల మానవుడు ఎక్కడ ఉండినప్పటికి అతని బొగ్గుపులుసు వాయువును వృక్షములు తీసుకుంటున్నాయి. ఆ వృక్షములు ప్రాణవాయువును మానవుడు స్వీకరిస్తున్నాడు. ఈ సంబంధమును ఏర్పరచినవారెవ్వరు?
నెమలి ఎన్నిరకములైన రంగులతో కూడియున్నది? ఎంత సుందరమైన రంగులు ఒకదానికొకటి మనముకల్పినప్పటికీ అది చేయటానికి వీలుకాదు. అంత సుందరమైన సృష్టిని ఎవరు చేస్తున్నారు?
చిలుక ఉంటున్నది. దాని రంగు చూస్తే పచ్చగ, ముక్కు చూస్తే ఎర్రగ ఈ కాంబినేషన్ ఎవరు చేసేరు? ఈ సృష్టి రహస్యాన్ని ఎందరు గ్రహిస్తున్నారు. ప్రకృతి నియమం అంటారు. నేచర్ నేచర్ అని వదలి పెట్టి పోతున్నారే గాని వీరు కని పెట్టినవన్నియు నేచర్ ఫలితములు కాదా? వీరు నేచర్ కతీతమైపోతున్నారా? పోవటం లేదే! హంస పాలు - నీరును వేరుచేస్తూ వచ్చింది. హంసవలె విభాగము చేయు గుణము కల్గిన మానవునకు పరమహంస అని పేరు వచ్చింది. హంస పాలలో ముక్కు పెట్టేటప్పటికి నీరు వేరు - పాలువేరు అవుతున్నది. అయ్యా! యీ శక్తి హంసకు ఎవరిచ్చారు? అని అడిగితే హంసకు ముక్కు దగ్గర ఒక ఆసిడ్ ఉంటుంది. అది పాలను తాకితే రెండూ విడి అవుతున్నాయి. అని సైంటిస్టులు చెప్పారు. నిజమే, హంస ముక్కు దగ్గర యీ ఆసిడ్ ఎవరు పెట్టారు? సైంటిస్ట్ తెచ్చి పెట్టాడా? కాదే! ఇది సృష్టి రహస్యం. కనుక భగవంతుని చర్యలు, సృష్టి ఎంతయో చిత్రవిచిత్రములుగా ఉంటుంటాయి. నాలుకలో 40 వేల టేస్టుబడ్సు ఉన్నాయి. అంతేగాక ఉష్ణం జనింపజేసే బడ్సు 25 వేలు ఉన్నాయి. కన్ను చూచుటకు ఒక ఇంచి మాత్రమే ప్రమాణంలో ఉంటున్నది. దీనియందు 13 కోట్ల కాంతికిరణాలు ఉంటున్నాయి. ఇది ఎంత విచిత్రమో చూడండి. మనదేహంలో కొన్ని కోట్ల సెల్సు ఉన్నాయి. ప్రతి సెల్ యందు మనరూపం సంపూర్ణంగా ఉన్నది.
దీనిని ఎవరైనా నమ్మగలరా! ఇది అంతయూ ఎవరి సృష్టి? అతీతమైన దైవ సృష్టియే.
ఎంచి చూసినట్లయితే ప్రతి ఇంచి భగవంతుని తత్వమే
ప్రతి అణువణువూ భగవంతుని తత్వమే.
దేహంలో ఎన్ని నారాలున్నాయి? 72 కోట్లు నరాలు ఉన్నాయి.
దైవత్వము పరిశోధనలచే లభ్యమయ్యేది కాదు. చెఱుకులోని తీపి,మిరపలోను కారము, నిమ్మలోని పులుపుఇవన్నీ భగవంతుని ఉనికిని ప్రబోధిస్తున్నాయి. తారలు వెలుగుతున్నాయి. గ్రహములు తిరుగుతున్నాయి. గాలి వీచుచున్నది. వర్షము కురియుచున్నది. సూర్యుడు మండుచున్నాడు. వీటికన్నింటికీ కారణం భగవతత్వమే. పర్వతములను, ప్రవాహములను, అడవులను చూస్తే ఆనందం ఉప్పొంగుతుంది. ఇవన్నీ భగవంతుని చిత్ర విచిత్రములే. ఈ ప్రకృతి సౌందర్యము భగవంతుని ఉనికిని నిరూపిస్తూ వస్తున్నది.
(దే.యు.పు. 103/104)