మీరు మొట్టమొదట, మేము ఆనంద స్వరూపులం అనే విశ్వాసాన్ని పెట్టుకోండి. అప్పుడు ఎన్ని కష్టనష్టములు ఎదురైనప్పటికీ మీరు చలించరు, ఆనందాన్ని అనుభవిస్తారు. "బ్రహ్మానందం పరమసుఖదం...." ఏది మనకు సుఖము? డన్లప్ బెడ్స్ పై నిద్రించడమా సుఖము? ఎయిర్ కండిషన్డ్ గదిలో నివసించడమా సుఖము? మంచి భోజనమా సుఖము? కాదు, కాదు. బ్రహ్మానందమే మనకు సుఖము. "బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్వాది లక్ష్యం ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణ రహితం....."
ఈ శ్లోకము ఒక్క బ్రహ్మతత్వాన్నే ప్రబోధిస్తున్నది. బ్రహ్మానందమంటే ఏమిటి? మానవుడు సర్వ సుఖములతో, సకల సౌభాగ్యములతో తులతూగు తున్నప్పుడు అనుభవించే ఆనందాన్ని మానవానందము అన్నారు. దీనికంటే వేయిరెట్లు అధికమైనది గంధర్వానందము. గంధర్వానందము కంటే వేయిరెట్లు అధికమైనది బృహస్పతి ఆనందము. ఈ ఆనందము కంటే వేయిరెట్లు అధికమైనది ప్రజాపతి ఆనందము. దీనికంటే వేయిరెట్లు అధికమైనది హిరణ్య గర్భానందము. దీనినే బ్రహ్మానందము అన్నారు. హిరణ్యమనగా బంగారము. ఇది ఎప్పటికీ చెడిపోదు. అనగా మార్పు చెందే ఆనందము మిధ్యానందము. బ్రహ్మానందమే సత్యమైన ఆనందము. అయితే ఈ ఆనందము ఎక్కడున్నది? ఎక్కడెక్కడో లేదు, హృదయము నందే ఉంటున్నది. ఆ హిరణ్యగర్భానందము, ఆ ప్రజాపతి ఆనందము, ఆ బృహస్పతి ఆనందము, ఆ గంధర్వానందము, ఆ మానవానందము అంతా మానవ హృదయమునందే ఉంటున్నవి.
(స.సా.మే96పు.115)
ఆనందము 7 విధములు 1. లౌకికమైన భోగ భాగ్యములలో తులతూగులూ, ఆరోగ్యమైన దేహముకలిగి అన్నివిధములైన అనుకూలములు కలిగి యున్న ఆనందం. మనుష్యానందము2 దానికంటే నూరురెట్లు అధికమైన ఆనందము పితృదేవతానందము 3. దానికంటే నూరు రెట్లు ఆనందము గంధర్వానందము.4. దాని కంటే నూరురెట్లు అధికమైన ఆనందము దేవానందము.5. దాని కంటే నూరురెట్లు అధిక ఆనందము విరాట్ పురుష ఆనందము.6. దానికంటే నూరురెట్లు ఆనందము ప్రజాపతి ఆనందము.7. దానికంటె నూరురెట్లు అధిక ఆనందము హిరణ్య గర్బానందము.
దానికంటె నూరురెట్లు ఆనందము బ్రహ్మానందము. బ్రహ్మానందము ఎంతటిలో కూడినదో మీరూహించు కొనవచ్చును. ఈనాడు కొడుకు పుట్టినా బ్రహ్మానందంగా వుందంటారు. క్లాసులో ఫస్టుక్లాసు మార్కులు వచ్చినా బ్రహ్మానందంగా వున్నదంటారు. ఈ ఆనందముకునూ బ్రహ్మానందముకునూ ఎన్ని కోట్ల మైళ్ల దూరము. బ్రహ్మ భావముతో ఆనందిచడమే బ్రహ్మనందం. ఆ బ్రహ్మానంద తత్త్వమేమోక్ష ప్రా ప్తి.
(సా.పు.533/534)
(చూ॥ పేరాస)