భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అందించిన అనువాదము
1 భజగోవిందం, భజగోవిందం భజమూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహినహి రక్షితి డుకృణ్ కరణే ||
హరిగోవిందా హరి గోవిందా
హరిగోవిందా అనరామందా
మృత్యువు దాపున మసలేటప్పుడు
వ్యాకరణము కాపాడదురా||
2 నళినీదళగత జలమతి తరళం, తద్వత్ జీవిత మతిశయ చపలమ్
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తమ్ ||
తామరాకు పై తళతళలాడే
నీటి బొట్టువలె నిలకడ లేనిది
బ్రతుకభిమానపు తెగులు పుట్టురా
దిగులు దు:ఖముల తెరరా లోకము
3. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్త:
వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణీ కో పినసక్త:
ఆటలపాటల బాల్యంబాయెను
ప్రాయములో ప్రేమాయణమాయెను
ముదిమిని చింతలు ముదిరేపోయెను
పరబ్రహ్మ కాబట్టక పోయెను
4 కాతే కాంతా కస్తే పుత్ర:, సంసారో యమతీవ విచిత్ర:!
కస్యత్వం కకుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాత:
ఎవతెభార్య; ఇంకెవరో బిడ్డడు?
ఎంత విచిత్రమో యీ సంసారము
ఎవరివాడ? వెవ్వెర ? వేటు వచ్చి ఆ
తత్త్వమిక్కడే తమ్ముడ తెలియర
5. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
సత్సంగముచే సహజ విరక్తీ
ఆ విరక్తి చే విగతభ్రాంతీ
భ్రాంతి తీరితే శాంతీ స్తిమితము
స్తిమిత శాంతిచే జీవన్ముక్తి
6. దిన యామిన్యౌ సాయంప్రాత: శిశిర వసంతౌ పునరా యాత:
కాల క్రీడతి గచ్ఛత్యాయు:, తదపి న ముచంత్యా శావాయు: ||
ఈ రేయి పవళ్ళు సాయం ప్రొద్దులు
చలి వేసవులూ సారెకు మారును
కాలక్రీడల గడచే నాయువు
ఐనావదలదు ఆశావాయువు
7. యోగరతోవా, భోగ రతోవా, సంగరతో వా సంగవిహీన:
యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నందతి నందతి నందత్యే వ॥
యోగియైన మరిభోగియైన
సంసారియైన సన్యాసియైననూ
స్వాంతము సత్యము ననుభవించితే
ఆనందమే ఆనందము నందము
8. భగవద్గీతా కించి దధీతా, గంగా జల లవ కణికా పీతా
సకృదపి యేన మురారి సమర్చా, తస్యయమః కిం కురుతే చర్చామ్
కించిద్భగవద్గీతా పఠనము
కొంచెము గంగా తీర్థము పానము –
హరిపూజన మొకపరి కావించిన
అతనిని యముడేమని తర్కించును.
9. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం
ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహిమురారే ||
మళ్ళీ పుట్టుట మళ్ళీ గిట్టుట
అమ్మ కడుపులో అణగి యుండుట
అంతులేని సంసారము దయతో
దాటింపుము నన్ను దబ్బున దేవా
10. త్వయి మయి సర్వ త్త్రె కో విష్ణు: వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు:
భవ సమచిత్త స్సర్వత్రత్వం, వాంఛస్యది రాద్య ది విష్ణుత్వమ్ ||
నీలో నాలో నిజమొక విష్ణువే
ఓపిక లేని నీ కోపము వ్యర్థము
ఎల్లెడ సమమై ఉల్లంబుంటే
అపుడే అనుభవమగు విష్ణుత్వము
11. శత్రా మిత్రే పుత్రే బంధౌ, మా కురు యత్నం విగ్రహ సంధౌ
సర్వస్మిన్నపి పశ్యాత్మానం, సర్వ త్రోత్సృ జ భేదాజ్ఞానమ్ |}
శత్రుడు మిత్రుడు పుత్రుడు బంధువు
అనుచు ఉపేక్షా పేక్షలు మానుము
అన్నటిలోను ఆత్మని చూడుము
భేదమనే అజ్ఞానము వీడుము
12 గేయం గీతానామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్
నేయం సజ్జన సంగే చిత్తం ధేయం దీనజనాయ చ విత్తమ్||
పాడుము గీతలు నామ సహస్రము
భగవంతుని రూపము భావింపుము
సలుపు మెపుడు సజ్జన సాంగత్యము
దీన జనులకై దానము చేయుము
13. అర్థమనర్థం భావయనిత్యం, నాస్తి తతస్సుఖలేశ: సత్యం
పుత్రా దపి ధన భాజాం భీతి: సర్వత్రైషా విహితా రీతి: ||
ధనమే కీడనుకొనురా నిత్యము
దానలేదు సుఖ లేశము సత్యము
కొడుకుకైనా భయపడురా ధనికుడు
నడచేదిదే యెల్లెడల నెప్పుడు
14. ప్రాణాయామం ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారమ్
జాప్యసమేత సమాధి విధానం, కుర్వవ ధానం మహదవ ధానమ్ ||
ప్రాణాయామము ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారము
మంత్రముతోడ సమాధివిధానము
జాగ్రత్తగా నిశ్చలముగా చేయుము
15. కామం క్రోధం లోభం మోహం, త్యక్త్యా త్మానం భావయకో హమ్
ఆత్మజ్ఞాన విహీనా మూఢా, స్తే పచ్యంతే నరకనిరూఢా: ||
కామము క్రోధము లోభము మోహము
విడువుము, నేనెవ్వడనని యనుకో!
తము తామెఱుగని దద్దమ్మల కగు
నరకము లోపల నానా బాధలు
16. గురుచరణాంబుజ నిర్భర భక్తః, సంసారాచిరాధ్భం ముక్త:
సేంద్రియమానస నియమాదేవం, ద్రక్ష్యసినిజ హృదయస్థం దేవమ్
సద్గురు చరణాబ్దము పై భక్తి
రగా ముక్తికి తరలే మార్గము
ఇంద్రియ మానస సాంద్ర నియమమే
హృదయస్థుని చూపించును దేవుని
(మూఢమతి ---ముక్త మతి—107-110)