భారతీయులు

రాళ్ళయందూ దేవుని చూడవలెనుగాని దేవుళ్ళను రాళ్ళగా చేయరాదు, చూడరాదు. అదే మన భారతీయులకు భగవంతుడందించిన మహాభాగ్యము. సముద్రమున పైపై అలలలో వెతికిన ముత్యములు చిక్కవు. సముద్ర మధ్యభాగములో స్వాతివాన పడిన సమయములో సముద్ర గర్భమునచేరి వెతికిన చిక్కును. ఇట్టి భగవదన్వేషణ సలుపువారే మన భారతీయులు.

ధర్మాచరణే దేహముగాను, దైవదర్శనమే హృదయము గాను తలంచి, చరించి తరించువారు మన భారతీయులు, పైపై పూతలకు బాహ్యాడంబరములకు భౌతిక అభివృద్ధులకు బానిసలు కారు. అంతర్ దృష్టిలో ఆత్మాన్వేషణ సలుపునట్టి నిస్స్వార్థ హృదయులు. ఇట్టి పవిత్ర స్థితిగతులు కలిగిన భారతీయులు.

(స.వాపు. 177/02)

 

భారతీయులలో సమత్వము మెండు. హిందూ మతమో, బౌద్ధ మతమో, మహమ్మదీయ మతమో, జోరాష్ట్ర మతమో, క్రీస్తు మతమో, ఏదిగా నున్ననూ, దైవరాధనను ఎవరునూ పరహసించ కూడదనియుమా, యే రూపనామమును పరహసించిననూ కే దైవమును పరిహసించినట్లగు ననియూ భారతీయ పరమార్థము ప్రచారము చేసెను. ఈ సత్యాన్ని నేర్చిన వారే నిజమైన భారతీయులు.

(స.వా.పు.17)

 

చారిత్రక యుగము మంచి పరిశీలించిన, హిందువులలో ఎట్టి మహాపురుషులు ఏఏ తెగలందు జన్మ మోందినది విశదముగా తెలియును. అవతారములు, దైవాంశ సంభూతులు, జీవన్ముక్తులు అయిన రామ, కృష్ణ, బలరామ, జనక, పరీక్షిత్తుడు, విశ్వామిత్రాది రాజయోగులు కూడా క్షత్రియ తెగయందుద్భవించిరి, బ్రహ్మఋషులు, పండితోత్తములు, శాస్త్రవేత్తలు. వేదఋషులు బ్రహ్మణ తెగయం దుద్భువించిరి. భారత భాగవతాది గ్రంధము లందు శూద్రు లధికులు కలరు. భక్తి శేఖరులు నిమ్నజాతియందే ఆధికులు కలరు. ఈ సారమును పట్టిచూడ పవిత్రతను పొందుటకు, పరమాత్మను చేరుటకు వారివారి సాధనా ప్రాప్తి ప్రధానము కాని వేరే తెగలు అడ్డురావు. అయితే అందుకు తగిన అనుగ్రహమునకు అర్హుడు కావలెను. అనుష్టానమున క్రమబద్ధుడు కావలెను. ఇంతటి పవిత్రులైన భారతీయులు పై మహాపురుషుల జీవిత తత్త్యములను గమనించక, తలంచక, వారి ఆజ్ఞశిరసావహించక, కాలకర్మముచే పట్టుపడి, వినాశకాలే విపరీత బుద్ధి" అన్నట్లు స్వార్థము కొఱకు తమ పుత్రకళత్రాదులను అభివృద్ధి పరచుటకొరకు వీలు కలుగుదేమో అను సందియమున పేరు ప్రఖ్యాతులకు దాసులై, అధికారత్వమునకు ఆశపడి, హిందూమతమునకు తీరని లోట్లు కలిగించుచున్నారు. అయితే సర్వజన సమాన ప్రియులై, స్వార్థరహితులై, ప్రజాక్షేమపరాయణులై, లోక సేవార్పితులై, సర్వమును ధారపోయువారు లేకపోలేదు. అట్టి మహానీయులను లోకాధికారులుగా వదలిన ఈ దుర్మార్గపు వ్యక్తులకు, అనాచారవ్యక్తులకు, అధర్మప్రియులకు స్థానముండదని వారిని చేర్చనీయక అణగద్రోక్కుచున్నారు. ఎట్టి అగాధమైన సముద్రమైనను. ఒడ్డున భూకంపమురాగానే జలము తమంతట తామే దూరముపోవును. ఆ అశాంతి తగ్గినతోడనే తిరిగి యధాస్థానము నాక్రమించును. అట్లే ఇట్టి అన్యాయ, అక్రమ, అహంకారపు ఆడంబర భూకంపమునకు చిక్కుకొనక, సత్పురుషులు, లోకోద్ధారకులు దూరముగా నుండి వీరి ప్రతాప ప్రదర్శనము చల్లబడగనే వారు తిరిగి లోకమున ప్రవేశింతురు. ఇట్టి క్షణభంగురమైన అధికారత్వములు. అహంకారములు స్థిరముకావు. –పెరుగుట విరుగుట కొరకే" అన్నట్లు ఇప్పటి అశాంతి వాతావరణము విరుగుటకే కాని పెరుగుటకు కాదు. లేకున్న ఆదినుంచి ఎంతో పవిత్రమైన పద్ధతులలో, భావములలో, సహనముతో, పేరు ప్రఖ్యాతితో, వేద, శాస్త్ర, ఉపనిషత్ ఉగ్గుపాలతో పెరిగి, దేశభ్రష్టులైన మానవులను ఆదరించి, అట్టివారికి అండ నొసగి సమంజస ప్రేమను పంచి పెట్టిన భారతీయులు నేడు చూడుడు, భారత సోదరులైన హిందువులే ఒకరి పై ఒకరు అధికారులు కాగోరి తమ తమ సోదరులనే తాము తూలనాడు కొంటూ, ఒకరి క్షేమమును ఒకరు ఓర్వలేక అసూయాపరులై, పదవి ప్రతిష్టలకు పాల్పడి, అహంకార అవేశులై తమతమ భారత సోదరులనే వంచించుచు అభివృద్ధి కోరువారిని అణగదొక్కుచు, వారికి వారు స్వార్థమును పొందగోరి, హిందువులలో ఎన్నడు కనివిని ఎరుగని దుర్గణములను అభివృద్ధిపరచుకొని, అనాచార మాచరించుచు పాపభీతి, దైవభీతి, వినయ, భయ, విశ్వాసములు లేక ఇంతటి ఆశాంతికి గురియగుట, శాంతికి దూరమగుటభారతీయులకు తలవని తలంపులు కదా!

 

హిందూ సోదురులారా, భారత పుత్రులారా, సనాతన సాంప్రదాయులారా, పురాణకాలపు పురుషలక్షణము లెందునోయెను? సత్య, సహన, నీతి, నీమములు ఎందుదాచితిరి? లెండి. తిరిగి సత్య, ధర్మ, శాంతి భవనములైన రామరాజ్యమును స్థాపించండి. భారత సోదరులను ప్రేమించండి. సనాతన ధర్మములను అనుష్టించండి. ఇప్పుడు దహించుచున్న అజ్ఞాన, అశాంతి, అక్రమ అసూయాదులగు అగ్నిజ్వాలలను ప్రేమ, సహన, సత్యమను నీటితో ఆర్పుడు. అన్యోన్యతను అభివృద్ధి చేయుడు. ఈర్ష్య క్రోధములు ఈడ్చి వేయుడు. పవిత్రపురుషుల పాలనను, ఉత్తమ పురుషుల లక్షణము లను, దైవ రాజ్యములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడు.తమతమ తప్పులను తాము గ్రహింపుడు, పరుల తప్పులను వెతుకుటలో వచ్చే సుఖమేమియు లేదని దృఢము చేసుకొనుడు. అట్టివి వృథా కాలహరణము, కలహకారణములగును. అట్టి గుణములు వదలుడు. ఈ తరుణము తప్పిన చేయునది. మరేమి? ఆలసింపకుడు. నిరుత్సాహమున చోటివ్వక, గడచిన అవనీతులకు స్వస్తి చెప్పి, నిజపశ్చాత్తాపరులై దేవ ప్రార్థనలు, సత్కార్యములు, సోదర ప్రేమలు ప్రవేశపెట్టుడు. సనాతనపు రామరాజ్యమును స్థాపింపుడు. ఇట్టి రాజ్యమును జయింపగోరే ఈ సనాతన సారధి బయలుదేరి తన సైన్యసహాయమున చేదోడు వాదోడుగా నిలువగలదు.

 

ఈ రథమును లాగుటకు. నడుము కట్టి నారాయణ స్మరణకు బయలుదేరుడు. భారతీయులందరును ఒకతల్లి బిడ్డలే. ఆ తల్లియే సనాతవ ధర్మము. ఆ మాతృ ఋణమును భారత పుత్రులు తీర్చవలెను. తల్లిని మరచిన పుత్రుడు పుత్రుడు కాడు. తల్లిని చెడ్డ అన్న తాను మంచికాడు. ఆ తల్లి పాలపోషణే నేటి ప్రాణము. ఈ ప్రాణదాతయైన సర్వుల తండ్రి ఒక్క పరమాత్ముడే. అందరు ఒక్క తల్లిదండ్రుల బిడ్డలు, అట్టి సోదరులలో తమను తాము నిందించు కొనక, తమవారలకు తాము చెడ్డకోరక, మీప్రీతి వస్తువు పైన మీకెంత ఇష్టమో, అట్లే ఇతర సోదరులకు వారి ప్రీతి వస్తువు పై వారికంత ఇష్టమనిభావింపుడు. ఒకరి ఇష్టమును ఒకరు దూషించక, పరిహసించక ప్రేమించవలెను. ఇవి భారతీయుల ప్రేమ సత్యలక్షణములు.

(ప్రే.వా.పు.38/40)

 

విచిత్ర స్వేచ్చయను విచ్చుకత్తి ఔరా

ఏమందు భారత పాలనంబు

ఏనుగెట్టుల తన బలమెరుంగ లేదో!

అట్టులయినారు మన భారతీయులు నేడు!

(సా.పు,507)

 

“పూర్ణచంద్రాసభా మండపం పర్తిలో శివరాత్రినాడు (1960) “పూర్ణచంద్ర ఆడిటోరియం ప్రారంభోత్సవం జరిపి, వేలాది భక్తులకు కంటినిండా దర్శించే భాగ్యాన్ని బహూకరించారు. ఆనాడు………….. సంభాషిస్తు,

 “భగవత్ రతిగలవాడే భారతీయుడు, ఈరోజంతా తైలధారవలె భగవత్ నామాన్ని జపిస్తుంటే, యేక్షణమైన మనమనస్సు లయమయ్యే అవకాశం వున్నది. దేవున్ని రాళ్ళుగా మారుస్తు న్నాం అని కొందరనుకొంటున్నారు. కాదు కాదు. రాళ్ళను దేవుళ్ళుగా మారుస్తున్నాం. మనసుకు మించిన గురువులేదు. భగవత్ లీలలు వర్ణించాలంటే, ఆకాశమే పేపరుగా, సముద్రమే యింకుగా, అరణ్యములోని పుల్లలే కలములుగా మారాలి. నీటితో నిండిన కుండను నీటిలోనే వుంచిన ట్టుగా, మీ హృదయమనే కుండను, ఆనందరసంతో నిండిన కుండను ఆనందంలోనే ముంచి, వూర్లకు వెళ్ళిన తరువాత ఒక్కొక్క బొట్టే చప్పరించి ఆనందించండి (అని దీవించారు. రాత్రి భజన జరుగుచుండగా 9.30 గం || శ్రీవారి వదనారవిందమునుండి  9 లింగములు వుద్భవించి,  సర్వులను మహాదానందధామంలో ముంచెత్తింది.) (అ.శ.నా.207) 

 

పరమ పావనమైన భారతావని యందు
సహన మన్నదె మనకు చక్కదనము.
వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన యట్టి
ఘన సత్య శీలమే కఠిన తపము,
మధుర భావం బేది మన దేశమందన్న
మాతృభావము కన్న మాన్యమెద్ది !
ప్రాణంబు కంటెను మానంబే ఘనమను
మన దేశ నీతిని మంటగలిపి
నేటి కిచ్చిరి – పరదేశ నీతులరసి
వేస స్వేచ్చయసు - విచ్చు కత్తులౌరా !
ఏ మందు భారత పాలనంబు ?
ఏనుగెట్టుల తన బలము నెరుగ లేదో
అట్టులయినారు మన భారతీయులు నేడు ||
(శ్రీ సత్యసాయి దివ్యబోధ 1978 పు 154)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage