నీవు భీష్ముని వలె చావవలె. భీష్ముడు శరతల్పమున పరుండి, లోకము కొరకు సమస్త ధర్మములును (శాంతిపర్వము) తెలిపి,యనంతరము తన హృదయమున కృష్ణ భగవానుని సాక్షాత్కారించుకొని దేహము వదలెను. మృతి భయంకరమైనదిగాను, సుఖ సందర్భములలో నుచ్చరింప రానిదిగాను భావింప బడుచున్నది. కాని, మృతి మంచిదియు కాదు. చెడ్డదియు కాదు. మృతి విషయమున నీఇష్టానిష్టముల కవకాశములులేవు. నీవు మృతిని గౌరవించి త్వరలో రప్పించుకొనజాలపు నిందించి దానిని తొలగించుకొనను జాలవు. అది నీజీవితమున కనివార్యమైన సమాప్తి. దేహి పుట్టిన నిముషము నుండియే శ్మశాన ప్రయాణముప్రారంభమగును. ప్రయాణములో కొందరా ప్రదేశమును త్వరలో చేరుకొందురు. కొందరు కొంచెమాలస్యముగా చేరుకొందురు. ముందు వెనుకల భేదమేకాని తుద కందరును అక్కడ చేరవలసిన వారే.
(శ్రీ.స.సూ.పు.14)
ఈనాడు పంచాగమునుబట్టి భీష్ముడు పోయిన దినము ఏకాదశి అని అనుకుంటున్నాము. కాని, ఇది చాలా పొరపాటు. అది అష్టమి, రోహిణీ నక్షత్రము. కృష్ణుడు పుట్టినది అష్టమి, రోహిణీ నక్షత్రమే. కనుక, కృష్ణుడు పుట్టిన రోజునే భీష్ముడు మరణించాడు. అది మాఘమాసముకూడ. ఈ దినము మరణమునకు పవిత్రమైన దీనముగ భావించినారు. ఉత్తరాయణకాల నిమిత్తమై పవిత్రమైన కృష్ణ చింతనయందే కాలము గడిపినాడు. భీష్ముని దృష్టిలో జననముకంటే మరణము ప్రధానమైనది. మంది ఘడియలలో పుట్టినాడనేదానికంటే మంచిఘడియలలో మరణించినాడనేది ధానమైనది. పునర్జన్మకు అదే పునాది. (దివ్యఙ్ఞాన-దీపికలు ద్వితీయ భాగం పు 61)