శౌచము అనగా శుద్దిచేయుట. బాహ్య శౌచమే కాక అంతర్ శౌచము ప్రధానమయినది. ఆదియే అంత:కరణ శౌచము. రాగద్వేషములు కానీ కామక్రోధాలు కానీ లేకసాత్వికమైన దైవీ గుణములు విరాజిల్లినపుడు అట్టిదానిని అంతశ్శౌచం అని చెప్పవచ్చును. దేహమును జలము వలననూ, మనస్సును సత్యము వలననూ జీవాత్మను విద్యాతపస్సుల వలననూ, బుద్ధిని జ్ఞానమువలననూ శుద్ధి చేసుకొనవలయును.
(గీ.పు. 208/209)
ప్రాచీన కాలమందు ఋషులు శౌచము నాచరించి నిత్యము స్నానమును చక్కగా చేసేవారు. దీనిని ఈనాటి విద్యావంతులు అనాగరికమని హేళన గావించుచున్నారు. ప్రాచీనులు తమనెవ్వరైనా ముట్టినప్పుడు యేదైనా తాకినప్పుడు, స్నానమాచరించి దేహ నైర్మల్యమును మనశ్శాంతిని సంపాదించేవారు! "మడి" అనే కర్మ కాని వేరు కాదు. వీరిని ఆధునికులు హేళన చేయు సమయమున, శౌచవాదులు ఎదిరించి, సమర్థించుటకు దురదృష్ట వశమున ఆసమర్థులై పోవుచున్నారు. వారు కూడ కేవలము బాహ్యమునందు మాత్రమే మడి ని ఆచరించుచున్నారే కాని, దాని ఉద్దేశమేమిటి, ఫలిత మేమిటి, సక్రమముగా దానిని పాలించు విధానమేమిటి అని నిర్ణయించుటకు వారు అసమర్థులు! అయితే, పూర్వీకుల ఆచారములందు అంతరార్థము లేకపోలేదు, పురుషాయుస్సు ఎంత కాలమో అంత కాలము జీవించి, తమ ఆశలు ఆశయములు అన్నింటిని పూర్తి గావించుకొనుటకు వీలుండవలెననునదే వారి వాంఛ! ఆహార విహారములలో చక్కని మార్గము ననుసరించితే, ఆయుస్సు వృద్ధియగును,శాంతి సంతోషములు చేకూరును, అని వారు నిశ్చయించుకొనిరి. పరాధీనములో పడక, ఆయుష్కాలమంతా సుఖ సంతోష సంతృప్తులలో గడిపి, అనాయాసముగా మరణమును పొందుటకు ఋషులు యుక్తాహార విహారములను, విధించిరి. ఆహార పదార్థములందున్న స్థూలభాగము మలముగా విసర్జింప బడును; వాటి యొక్క సూక్ష్మభాగము మాంసము కండరములు రక్తము మొదలగు పదార్థములుగా మారును. సూక్ష్మాతి సూక్ష్మమైన కారణ భాగము మనస్సునుతీర్చిదిద్ది, భావములలోని మంచి చెడ్డలను నిర్ణయించును. దీనివలననే, ఆహారము వలన ఆరోగ్యము, ఆరోగ్యము వలన ఆధ్యాత్మికాభిరుచి, అభిరుచివలన సాధన, సాధనవలన సంకల్పము, సంకల్పము వలన ఫలసిద్ది లభించునని ఘోషించిరి.
(స.సా.డి.74పు 299/300)