రెండవది విక్షేపము. అద్దముంవంటిదే మనసు. కాని అద్దమును కదిలిస్తూ ఉండినంతవరకు మన ప్రతిబింబము కూడా అందులో కదులుతూనే ఉంటుంది. ఈ మనస్సే నిరంతరము చంచలముగా అటూయిటూ కదలటంచేత ఇందులో ప్రతిబింబము కూడను చంచలము గానే రూపొందుతున్నది. “చంచలం హిమనః కృష్ణ ప్రమాధి బలద్ధృడమ్" అర్జునుడు చంచలమైన మనస్సుతో చాలా కలత చెంతున్నాననీ అదిచాలా బలవత్తరమైనదిగా వుంటున్నదని ప్రార్థించాడు. ఈ చంచలత్వమును స్థిరత్వముగావించటానికి ఏది ఉపాయము? ధ్యానమనిప్రార్థన అని చింతన అని నవవిధ మార్గముల దీనిని క్రమక్రమేణా స్థిరపరచుకోవచ్చును. "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, ఆర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం" ఈ నవవిధ మార్గములయందు మానవుడు పవిత్రమైన హృదయముతో ప్రార్థన సలిపినప్పుడే చంచలత్వము క్రమ క్రమేణ ఒక స్థితికి రాగలదు. ఈనాటి యువకులు మాలిన్యమైన మనస్సును మరింత మాలిన్యమైన వానితోనే అభివృద్ధి పరుస్తున్నారు. బురదతో కూడిన వస్తువును తిరిగి బురదలోనే కడిగితే బురద పోతుందా? పరిశుద్ధమైన జలముతో కడగాలి ఈనాటి యువకులందు అట్టి పరిజ్ఞానము శూన్యమైనది. ఈనాటి విద్యావిధానమునందు. వివేక విజ్ఞానములు లేకుండా పోతున్నాయి. స్వార్థ స్వప్రయోజనతత్వాలు అభివృద్ధియై పోతున్నాయి. లౌకిక భోగభాగ్యములనిమిత్తమై యీనాటి విద్యార్థి ప్రాకులాడుతున్నాడు. భావిభారతోద్ధారకులైన విద్యార్థులు హృదయములు మలినమైతే భారతదేశ పరిపాలన మలినముగానే రూపొందుతుంది.
(బ్బత.పు.82)
(చూ॥ ఆటంకములు)