చెట్లను, రాళ్ళను పూజించే అనాగరికులు ఇచ్చటివారు అనే విచక్షణ లేని మాటలను మీరు ఎంత మాత్రమూ విశ్వసించవద్దు. విగ్రహారాధన అనాగరికతకు గుర్తుకానే కాదు. పెళ్ళికూతురికి నుదుట కుంకుమ బొట్టు ఎంత ముఖ్యమో ఆధ్యాత్మికతలో ఈ విగ్రహారాధన కూడ అంత ముఖ్యము, అంత అర్థవంతము. విగ్రహమంటే భగవంతుని స్వరూపము. అంతటా అన్నిటా వ్యాపించి యున్న భగవంతుడు విగ్రహంలో దర్శన మిస్తుంటే స్వచ్ఛమైన మనస్సుగలవారు ఆయనను ఆరాధిస్తూ అదివిగ్రహమనే భావనము మరచిపోయి నిత్య సత్య తత్త్వంలో లీనమవుతారు.దీనినే ప్రపత్తి లేక శరణాగతి అంటారు. ఈ తత్త్వ లేకపోతే మీరు చేసే ఆరాధన వృథా అవుతుంది. మీరు విశ్వాసము, ధైర్యములను అలవరచుకోండి. అలా అలవరచుకుందామని, దానిని వెంటనే ఆచరణలో పెడదామని ఇప్పుడే నిర్ణయించుకోండి. భక్తిని కన్నీళ్ళను బట్టి, ఉత్సాహాన్ని బట్టి అంచనా వేయకూడదు. అది అన్ని విషయములలోను ఒక అంతర్గతమైన పరివర్తనము!
(వ.61-62 పు.174)