ముఖ్యంగా మానవుని గుండె జబ్బులకు కారణమేమిటి? పొగ త్రాగడమే దీనికి కారణమని కొందరు, క్రొవ్వు పదార్థము (Fat)తో కూడిన ఆహారమే దీనికి కారణమని మరికొందరు - ఈ విధంగా అనేక మంది డాక్టర్లు అనేక విధాలుగా చెపుతుంటారు. కనుక, మన ఆహార విహారములు (Food and habits) సరియైన మార్గములో ఉండాలి. మన దేహతత్వము యొక్క పుష్టిని, మన మనోభావములను సమత్వముగా పోషిస్తూ రావాలి.
ఈనాడు మానవుని మనోవృత్తులు అతివేగంగా పరుగెడుతున్నాయి. ఈ విధమైన తొందరపాటు వలన కొని విధములైన రోగములు సంభవిస్తున్నాయి. అంతేగాకుండా, తాను తలపెట్టిన కార్యములు విఫలమైనప్పుడు మానవుడు మితిమీరిన యోచన చేస్తున్నాడు. ఈ కారణములను చక్కగా విచారణ చేసినప్పుడు, గుండె జబ్బులకు Hurry, Worry, Curry - ఈ మూడే ప్రధానమైన కారణాలని స్పష్టమౌతున్నది. Curry అనగా Fat (క్రొవ్వు పదార్థము ) ఈ Fat కి మూలకారణము ఆహారమే. మహా ప్రజ్ఞావంతులైన డాక్టర్లు అనేక విధాలుగా పరిశోధనలు చేశారు. పరిశీలన సలిపారు. కాని, ఆ పరిశోధనల ఫలితాలను ప్రజలకు సరియైన రీతిలో ప్రచారం చేయటం లేదు.
ఈనాడు మాంసాహారులకే గుండె జబ్బులు అధికంగా సంభవిస్తున్నాయి. శాఖాహారులలో ఈ జబ్బులు అంత అధికంగా లేవు. కారణమేమనగా – మాంసాహారంలోక్రొవ్వు పదార్థం అధికంగా ఉంటున్నది. దీని వలన దేహములో "కొలెస్ట్రాల్ అనేది పెరిగి పోతుంది. దీనికి తోడుగా Hurry, worry చేరినప్పుడు గుండె మరింత బలహీనమై పోతున్నది. Hurry, worry ఈ రెండూ చేరినప్పుడు Blood Pressure దానితోపాటుగా Blood sugar పెరిగిపోతాయి. ఈ Blood Pressure, blood sugar రెండూ twins వలె ఒక దాని నొకటి అనుసరిస్తుంటాయి. ఈ రెండూ గుండె పైననే పనిచేస్తున్నాయి. కనుక, మొటమొదట Diabetes, Blood Pressure ఈ రెండింటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. వీటికి మరొక కారణమే మనగా - కొంతమంది అధికారులు, శ్రీమంతులు తగినంత exercise చేయుటలేదు. ఇది మంచిది కాదు. అందరికీ తప్పనిసరిగా exercise ఉంటుండాలి. ఈనాడు అందరూ సుఖానికి మరిగి పోవటముచేత exercise లేకుండా పోతున్నది. అందుచే అనారోగ్యము పెరిగి పోతున్నది.
(స.పా. మా. 93 పు. 72)