విద్యార్థులారా! "హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్", ఎల్లప్పుడు సహయమే చేయండి. ఎవ్వరిని బాధించకండి. ఇదే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రము. మీరు గొప్ప డిగ్రీలు తీసుకోవచ్చు. విదేశాలకు పోవచ్చు. తప్పులేదు. కాని, భారతీయ సంస్కృతిని మాత్రం మర్చిపోకండి. ఎక్కడికి వెళ్ళినా మీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించండి. అందరితో స్నేహంగా ఉండండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. అదే నిజమైన మానవత్వం. మీరు గొప్పవారు కావడానికి ప్రాకులాడకండి, మంచివారు కావడానికి ప్రయత్నించండి. గొప్పవారు తప్పు పనులు చేయవచ్చు. కాని, మంచివారు ఏది చేసినా అది ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. రావణుడు, రాముడు ఇరువురూ విద్యలో సమానులే! కాని, రావణుడు గొప్పవాడు, రాముడు మంచివాడు. చూశారా! మంచితవానికి, గొప్పతనానికి ఇంత వ్యత్యాసం ఉంటుంది. రావణుడు కామాన్ని బలపర్చు కున్నాడు. ఈ ఒక్క దుర్గుణంచేత తనతో పాటు తన వంశాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. హిరణ్యకశిపుడు పంచ భూతములను హస్తగతం చేసుకొని వాటితోఆడుకున్నవాడు. అంతటి గొప్పవాడు క్రోధం వలన నాశనమైపోయాడు. ఇంక, దుర్యోధనునిలోఉన్న దుర్గుణం లోభత్వం.పాండవులు కనీసం ఐదు గ్రామాలైనా ఇవ్వమని అడిగితే, సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. కట్టకడపటికి అతనికి ఏ గతి పట్టిందో మీకు తెలుసు. రావణుడు కామమువలన, హిరణ్యకశిపుడు క్రోధంవలన, దుర్యోధనుడు లోభం వలన పూర్తిగా నాశనమై పోయారు. ఏదో ఒక్క దుర్గుణం ఉన్నవారే ఆవిధంగా నాశనమైపోతే, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనే ఆరు దుర్గుణాలున్న మానవునికి ఏ గతి పడుతుందో ఒక్క తూరి యోచన చేసుకోండి.
(స.సా.2.2000పు.20)
మంచివారు ఎక్కడున్నప్పటికీ, ఆ మంచితనాన్ని ఎంత మంది ఎన్ని విధాలుగా దాచుటకు ప్రయత్నించినప్పటికీ అది దాగేది కాదు.
పెద్ద వజ్రమొకటి పెంటలో దొరికిన
మంచి గుమ్మడి పండు కంచెలో కాచిన
రుచియు మారదు దాని చవియు పోదు.
గొప్ప నెమలి గ్రుడ్లు కోడి తా పొదిగిన
వన్నె మారదు దాని చిన్నె పోదు" |
అదే విధంగానే గొప్పవారి దివ్య తేజస్సులు, దివ్య ప్రభావములు, దివ్య తత్త్వములు ఏ విధమైన స్థానములో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులందున్నప్పటికీ వాటి విలువ ఏనాటికి మారదు.
(స.సా.జ.94.పు.3)
(చూ|| బెస్ట్ ఫ్రెండ్స్)