మంచి చెడ్డలు

లోకంలో మంచి చెడ్డలకు మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు? ఎవరి మధ్య జరుగుతుంది? మూర్ఖుల మధ్య జరుగు తుంటుంది. ఎవరైనా మంచి పేరు తెచ్చుకుంటుంటే, అభివృద్ధిలోనికి వస్తుంటే, వారిపైన లేని పోని అపోహలు కలిపిస్తుంటారు కొందరు స్వార్థపరులు. వాటిని మనం మాత్రం లెక్కచేయ కూడదు. నిందలు, స్తుతులు ఇవన్నీ మానవత్వంలో వచ్చే సహజములే. కీర్తికి. అపకీర్తికి మధ్య ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన భారతదేశంలో కూడా గొప్ప పేరుపొందిన మహనీయులు కూడా వీటన్నింటిని ఎదుర్కొనిన వారే. కాని వారు ఆత్మ విశ్వాసంతో విజయాన్ని సాధిస్తూ వచ్చారు. సత్యంతో జీవించే వారికి, ప్రేమతో బ్రతికే వారికి, ఏనాటికి ముప్పురాదు.

(శ్రీ.డి.2000 పు.4)

 

త్రేతా యుగంలో రాక్షసులు ఒక చోట, దేవతలు మరొక చోట ఉన్నారు. కనుకనే, రాక్షసులను చంపడానికి రాముడేస్వయంగా సంసిద్ధుడయ్యాడు. ద్వాపర యుగంలో రాక్షసులు, దేవతలంతా ఒకే గృహంలో ఉన్నారు. అందుచేత కృష్ణుడేమి చేశాడు? దేవతలకు సారధిగా మాత్రమే నిలిచాడు. తాను యుద్ధం చేయలేదు. ఇంక కలియుగం వచ్చే సరికి ఏమయింది? దేవతలు, రాక్షసులంతా ఒకే దేహంలో ఉంటున్నారు. ఒక నిమిషంలో దుర్గుణాలు, మరొక నిమిషంలో సద్గుణాలు! మానవుడు - ఎప్పుడు మంచిగా ప్రవర్తిస్తాడో, ఎప్పుడు చెడ్డగా ప్రవర్తిస్తాడో చెప్పడానికి వీలులేదు. అందువల్ల కలియుగంలో దేవుడేం చేసాడు? మంచిచెడ్డల భాధ్యత మానవునికే ఇచ్చేశాడు. "నిన్ను నీవు రక్షించుకొన్ననూ, శిక్షించుకున్ననూ నీదే బాధ్యత. నేను సాక్షీభూతునిగా, నీలో ఆత్మగా ఉంటున్నాను" అన్నాడు. కనుక, మానవుడు తన దోషాలను తాను గుర్తించి వాటిని తీసివేసుకొనుటకు తానే ప్రయత్నించాలి.

(శ్రీ. . .పు.188)

 

దివ్యత్వమునకు మంచి వారు చెడ్డవారు ఇద్దరు బాధించేవారే. ఆస్తికులు నాస్తికులు ఇద్దరు కూడను దూషించేవారే. దివ్యత్వమును మంచివారు చెడ్డవారు హింసించేవారే, ఏమిటి హింస యొక్క అంతరార్థము? దీనిని హింస అని రీతిగా మనం భావించవచ్చును? అని విచారం చేయగా మంచివారి వియోగమే దుఃఖమునకు మూలకారణము, చెడ్డవారి సంయోగమే దుఃఖమునకు మూలకారణము. ఏతావాతా సంయోగవియోగములు రెండును దుఃఖమునకు మూలకారణములే. కనుకనే దివ్యత్వము ఇద్దరిని ఆశీర్వదిస్తూ వచ్చింది. ఆశీర్వాదమునకు అంతరార్థమేమిటి? చెడ్డవారి యొక్క సంయోగము, మంచివారి యొక్క వియోగము ఉండకుండా ఉండాలి. అని ఆశీర్వదించాడు. మంచివారియొక్క సంయోగమును పెంచుకోవటము, చెడ్డవారి సంయోగమును తుంచుకోవటము మానవుని ప్రధానమైన సాధనము. సంయోగవియోగములు రెండును ఒకే హృదయము నుండి ఆవిర్భవిస్తాయి. ఒకే సముద్రమునందు అమృతము విషము రెండూ ఉద్భవించాయి. అమృతము ఆనందాన్ని అందించింది, విషము బాధను కలిగించింది. అమృతము కీర్తిని పొందింది, విషము అపకీర్తినందుకుంది. కనుకనే మానవత్వము మంచి కీర్తిని సంపాదించగలదో కీర్తి నిమిత్తమై మంచిని మనం పోషించుకోవాలి. ఈనాటి మానవుడు పుణ్యపదమును అమితంగా ఆశిస్తున్నాడు కాని, పుణ్యకార్యములకు ముందంజ వేయటం లేదు. పాపఫలమును అంగీకరించటం లేదు. కాని పాపకార్యములు చేయటానికి ముందంజ వేస్తున్నాడు. ఇచే మూలకారణం. "పుణ్యస్య ఫల మిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః పాపఫల మిచ్చంతి పాపం కుర్వంతి యత్నత:” అన్నారు. పాపఫలము వద్దని నీవు విసర్జించినపుడు పాపకార్యములో ప్రవేశించకు. పుణ్యఫలము నీవు ఆశించినప్పుడు పుణ్యకార్యములు చెయ్యటానికి పూనుకో. మానవత్వములోపల రెండు విధములైన తత్వములు ఉంటున్నాయి. కొందరు వ్యక్తులయందు మంచి చెడ్డలు సమ్మిళితమై ఉంటుంటాయి. కాకులు చేదునిమ్మను ఆరగిస్తాయి. ఆనందిస్తాయి. కోకిల తియ్యని మామిడి చిగుళ్ళను తిని సంతోషిస్తుంది. అదేవిధముగనే కొంతమంది మానవులు లోక విషయ వాసనలు ఆశించి అందులోనే ఆనందముందని విశ్వసించి దాని నిమిత్తమై ప్రాకులాడుతుంటారు. మంచివారు దివ్యత్వము యొక్క ప్రేమ తత్త్వము అనుభవించాలని అఱ్ఱుల చాస్తూ దాని నిమిత్తమై ప్రాకులాడుతుంటారు. రెండింటి తత్త్వమునందు మంచి చెడ్డలు ఇమిడి ఉంటున్నాయి. మంచిని ఎప్పుడు బాధలే వెంటాడుతుంటాయి. ప్రాకృతమైన దృష్టిలో అది ఒక హీనమైన స్థితిగా భావిస్తుంటారు. కోరిన ఫలములు అందించేది కల్పము వృక్షముగా ఉంటుంది. విలువైన రత్నమును అందించే సముద్రము ఉప్పునీరుగా తయారైంది. కనుక మంచిచెడ్డలయందు మానవత్వాన్ని విచారించినపుడు వాళ్ళ అభీష్టము పైన మంచి చెడ్డలు ఆధారపడినవే కాని నిజమైన పదార్థము పైన కాదు.

(శ్రీస.వి.వా.పు.2/3)

 

నిరత సత్యప్రౌఢి ధరణి నేలిన హరి

శ్చంద్రుడీ ధర బాసి చనగ లేదె

ఎల్ల లోకము లేలి యెసగు శ్రీ నలరాజు

తనవెంట భూమిని కొనుచు చనెన

కృతయుగంబున కలంకృతి చేయు మాంధాత

సిరి మూట గట్టుక నరుగ జనెన

జలధి సేతువు కట్టె అలనాటి శ్రీరాము

డుర్విపై నిప్పుడు నున్న వాడ

ఎందరెందరు రాజులు ఏగినారొ

ఒక్కరును వెంట కొనిపోరు ఉర్వితలము

మీరు మాత్రము మీ విద్య సిరులుగాని

తలను గట్టుక పోరు విద్యార్థులారః

ఏదీ మనవెంట రాదు. వచ్చేవి రెండే. అదే మంచి, చెడ్డ.

మనము ఏది చేస్తామో అది మాత్రం మనవెంట వస్తుంది. మంచిని చేసి మంచిని తీసుకోండి. ఏవిత్తును నాటుతామో అదేఫలము మనకు లభిస్తుంది.

(బ్బ.పు. 165)

సృష్టియందు మంచి, చెడ్డ అనే తారతమ్యములుండ వచ్చును. భగవంతుని దృష్టిలో మంచి చెడ్డలు అనేవిలేవు.

 

ఒకటి చెడ్డయనుచు ఒకటి మంచి యనుచు

సృష్టియందు నిర్ణయింపనగునే

అదియు నిదియు ఒక్క ఈశ్వరుండు చేసే

భేధమెందుకలదు భక్తులారా.

నీవు ప్రకృతి వాతావరణమునకు బానిసవుగనక కొన్ని పరిమితులు పెట్టుకొని ఉండటంచేత ఇది మంచి, ఇది చెడ్డ అని నీ వూహ మాత్రమే. విభజన జరుపుచున్నది పరిమితులు మాత్రమే. మంచి చెడ్డలుకు మూలకారణము మీ భావములు. లీలలు, గుణములు అన్నియును సంకల్ప, వికల్పముల స్వభావములు.

(సా.పు. 69)

(చూ॥ అగ్ని, కర్మలు, తత్త్వజ్ఞానము, దైవసంకల్పము, పొత్తు, విరోధులు, వివేకానందుడు, సర్వమూ భగవంతుడే!, సర్వవ్యాపకుడు)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage