ఆంధ్రదేశములో ముగ్గురు రాజాలుండేవారు. ఒకడు త్యాగరాజు, రెండవవాడు పోతరాజు, మూడోవాడు గోపరాజు, గోపరాజు, త్యాగరాజు, పోతరాజు వీరుఆధ్యాత్మిక రాజులు, పోతరాజే పోతన, మహాభాగవతాన్ని రచించిన మహాగుణవంతుడు, త్యాగి. బావ ఐన శ్రీనాథుడు పోతరాజు యొక్క కష్టములను గుర్తించి అతనిని ఏదో ఒక విధముగా సుఖ పెట్టాలనే ఉద్దేశములో వచ్చి "బావా! నీయింటి పరిస్థితి నాకు తెలియనిది కాదు. తినడానికి తిండిగాని కట్టడానికి బట్టకాని ఉండటానికి కొంపగాని లేకుండా అవస్థల పాలౌతున్నావు. నీ కవిత్వమునంతా కేవలము శ్రీరామచంద్రునికి అర్పితము గావిస్తున్నావు. దీనివల్ల లభించే ఫలితం ప్రత్యక్షంగా మనకు ఏమాత్రము గోచరించటం లేదు. ప్రాకృతమైన జీవితానికి ప్రత్యక్షమే అవసరము. నీ కవిత్వమును రాజాలకు అర్పితము గావించుకుంటే నీకు రత్నాల అభిషేకము జరుగుతుంది" అన్నాడు. పోతనకు మనస్సు చాలా కష్టమైపోయింది. "ఇక్కూలకిచ్చి పడుపుకూడు భుజించుటకంటె హాలికుడైన నేమి?" అహంకార స్వరూపులైన రాజులకు నా కావ్యాన్ని అంకితమిచ్చి వారు పడవేసిన అన్నమును భుజించి నేను జీవించే దానికంటే భూమిని ఆశ్రయించి దానిని దున్ని నేను బ్రతకటం చాలా పవిత్రమైనది"అన్నాడు. పోతన తన సర్వస్వమునుభగవంతునకు అర్పించటంచేతనే భాగవతము జగద్వ్యాప్తి గాంచినది. అసలు భాగవతము వ్రాయుటకు పూర్వమే
"పలికెడిది భాగవతమట
పలికించెడివాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండుగాధ పలుకగనేలా"
అన్నాడు వ్రాసేవాడు తానే, పలికించేవాడు తానే, పోందేవాడు తానే, ఆనందించేవాడు తానే అని తన పైన ఏ బాధ్యతను పెట్టుకోకుండా అంతా భగవంతునికే అర్పితం గావించాడు. ఈ జగత్తునకు సృష్టి స్థితి లయకారుడు భగవంతుడే. సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడు ఐన భగవంతునికి అర్పితం గావించకుండా పామరులైన వారు, అహంకార ఆడంబరములతో తులతూగే వారికి ఇది అర్పితం గావించటం నాకిష్టం లేదన్నాడు. ఇంకత్యాగరాజు ఇతడు అవస్థల పాలౌతున్నది చూచి తంజావూరు రాజా అనేకవస్తు వాహనాలు, కనకరాసులతో పల్లకీ పంపించాడు. చూచాడు త్యాగరాజు, నవ్వినాడు "నిధి చాలా సుఖమా? ఈశ్వర సన్నిధి చాలా సుఖమా? నిజముగ దెల్పుము మనసా" అన్నాడు.నాకు కావలసింది రామసన్నిదే. అదే నా పెన్నిధి. నాకీ సామాను అక్కర లేదనివెనుకకు పంపించాడు. తన పేరుకు తగినట్టి త్యాగం గావించినవాడు త్యాగరాజు. సర్వము భగవంతుడే, అన్యపదార్థములు కాని అన్యుల యొక్క సహాయముకాని నాకక్కర లేదని వెనుకకు నెట్టినవాడు త్యాగరాజు. ఇక గోపరాజు భద్రాచల రాముని ఆశ్రయించినవాడు. తన జీతమును, తాను సంపాదించే సమస్త ద్రవ్యమును భగవంతునికి అర్పితము గావిస్తూ వచ్చాడు. తాను తాసిల్దారుగా పనిచేస్తూ చెల్లించిన కప్పమును కూడను భగవంతుని మందిరము నిర్మించడానికి, భగవన్మందిరం కాంపౌండు (Compound) నిర్మించడానికి, భగవంతునికి అలంకారము చేయటానికి వినియోగ పెడుతూ వచ్చాడు. తానిషా ఇతణ్ణి బాధించినప్పుడు నేను రామార్పితమైన వాడినే కాని కామార్పితుణ్ణి కాదు.
నేను సంపూర్ణంగా రామార్పితమైనటువంటి వాడిని అన్నాడు. ఈ మువ్వురు కూడను సర్వవ్యాపకమైన దివ్యత్వాన్ని గుర్తించినవారు. ఇంతేకాదు సర్వ రక్షకుడు కూడను భగవంతుడే అని విశ్వసించినవారు. వీరే నిజమైన భాగవతులు.
(శ్రీస.వి.వా.పు.18/20)