మానవుడు క్రిమి కీటకాదులుగా తయారయిపోతున్నాడు. మృగంగాను, క్రిమికీటకాదులుగాను తయారు కావటానికి ఏమి కారణము? మనయొక్క వాంఛలే దీనికి మూలాధారము. మృగతనాలు చేరడానికిగాని క్రిమి కీటకాదులవలె ఇతరులను హింసించడానికి గానీ, వచ్చేటువంటి గుణములన్నీ కూడను. ఈ వాంఛలద్వారా ఏర్పడినటువంటివి. ఈ ఘాతుక చర్యలకు, పరస్పర భేదములకు, అసూయా స్వభావములకు, ఈ అన్నింటికిని మూలాధారము దుర్వాంఛలే. దుర్వాసనలే మనము మృగములకు సమీపము కాకుండా, పరమాత్మకు సమీపము కావలెననే వాంఛను అభివృద్ది గావించు కోవడానికి తగినటువంటి ప్రయత్నము చెయ్యాలి.
అట్టి అధికారికే దక్షుడు అని కూడను మరొక పేరు. మనము సామాన్యంగా ఏదైనా కొన్ని లోక వ్యవహారములందు మాట్లాడినప్పుడు "అయ్యా! నేను దానిని సాధించడానికి దక్షుడు కావాలి. అనగా అధికారిని కావాలి" అని ఉచ్చరిస్తుంటాడు. మన భారతీయ చరిత్ర యందున్న యొక దక్షుడు, దక్ష మహాయజ్ఞమును చేశాడు. దక్షుడు అనేటటువంటివాడు ఎవరు అనగా, సర్వవిద్యలు నేర్చినవానికే దక్షుడు అని కూడము పేరు. అతనికి సతిదేవి అనే కుమార్తె. సతీదేవి అనగా జ్ఞానమూ, బ్రహ్మజ్ఞానముఅని ఆమెకు పేరు. కనుక ఈ దక్షునకు బ్రహ్మజ్ఞానమనే కుమార్తె కలగడంచేతనే ఈశ్వరుని యొక్క సన్నిహిత సంబంధము, బాంధవ్యము అతనికి ఏర్పడినవి. కనుక ఈనాడు మనము అధికారమనే దక్షుడు అయినప్పుడు సతీదేవి అనే, బ్రహ్మజ్ఞానమును పుత్రికగా పొందినామంటే అప్పుడే ఈశ్వరునితో మనకు సన్నిహిత సంబంధము ఏర్పడుతుంది. కానీ బ్రహ్మజ్ఞానమనే పుత్రికను మనము పొందక కేవలము ఈశ్వరునితో సంబంధాన్ని కలిగించుకోవాలనే వాంఛను మాత్రము పెంచుకుంటూ, అజ్ఞానమనే దుర్మార్గపు పుత్రుడిని పొందటంచేతనే భగవంతుడయిన ఈశ్వరునికి సన్నిహిత సంబంధముకాక విరోధులుగా తయారయి పోతున్నాము. నిజముగా ఆనాటి దక్షుడు బ్రహ్మజ్ఞానమనే పుత్రికను పొందటంచేతనే పరమార్మునితో సంబంధం ఏర్పడినది. ఈశ్వరుడతనికి చాలా ఆత్మసంబంధమైన అల్లుడుగ తయారయినాడు. కానీ ఈనాటి సన్ ఇన్ల లాలు (Sons-in-law) ఏరీతిగా ఉంటున్నారో తెలుసునా?
పిల్ల నిచ్చువరకు పిల్లిగా నటియించు,
పిల్ల నివ్వగానే పులిగ మారు
కనుక మనము నిజముగా భగవంతుని సన్నిహిత సంబంధము ఉండాలను కొన్నప్పుడు జ్ఞానమనే, బ్రహ్మజ్ఞాన తత్వాన్ని కొంత అనుభవించడానికి పెద్దల సన్నిధి చేరి, వారి ప్రబోధనలను ఆలకించి, వారి ఆచరణలంతా కూడను అనుష్టానములో పెట్టి, తద్వారా మనము సాధ్యమైనంతవరకును సాధనపూర్వకంగాను మనస్సును అరికట్టుకోవటానికి ప్రయత్నము చెయ్యాలి.
(మ. మ. పు 38/40)