లక్ష్యం గుర్తించి సేవలు చెయ్యండి
ప్రపంచంలోని సమస్త పదార్థములు భగవత్ ప్రసాదములే. అవి పంచభూత సమ్మిళితములే, మానవుని మనుగడకు ఆధారములే... వాటిని ఆరాధన భావంతో సద్వినియోగం చేసుకున్నప్పుడు అవి మానవజాతికి, జీవకోటికి క్షేమాన్ని అందిస్తాయి. ఈనాడు మానవుడు వాటి యెడల నిర్లక్ష్యం చూపటంవల్లనే కలుషితములై ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు వలసపోవడమే, మరణించడమో జరుగుతోంది. సముద్ర, నదీ జలాల కాలుష్యం వల్ల జలచరాలు అంతరిస్తున్నాయి. మీరు సేవాదళంవారు, ఎన్నో గ్రామాల్లోనూ, మురికివాడల్లోనూ పర్యటిస్తూ సేవలు చేసినప్పుడు ఆ ప్రజలకు వాతావరణ కాలుష్యాన్ని గురించి హెచ్చరించండి. పరిసరాల పారి-శుద్ధ్యం, నీటి వనరుల నిర్మలత్వాన్నికాపాడుకోవడం, అగ్నిని, విద్యుత్తును ఉపయోగించే కార్యకలాపాలలో చూపవలసిన శ్రద్ధను బోధించండి.
మొక్కలను నాటండి. వైద్యులద్వారా, అనుభవజ్ఞులద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యాలను కాపాడుకొనే విధి విధానాలను నేర్పండి.
అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడడం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిందించడం ప్రజలకు పరిపాటయింది. మీరు నడుములు కట్టి వాళ్ళకు మార్గదర్శకులు కావాలి. ఒక దుర్గంధ భూయిష్ఠమైన మురికి కాలువ కనబడితే, అవసరమైన పనిముట్లు సేకరించి, ఆ కాలవను లోతుచేసి, త్రోవ చేసి, పరిశుద్ధం చేసి చూపండి. ప్రజలూ చైతన్యవంతులై స్వయంశక్తిమీద ఆధారపడటం నేర్చుకుంటారు. ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగి కార్యరంగంలో ప్రవేశిస్తుంది. ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నాను. ఎట్టి పరిస్థితులలోనూ ఆయా ప్రాంతీయ రాజకీయాలలో జోక్యం చేసుకోకండి. విమర్శలు, ప్రశంసల జోలికి పోకండి. .
మీరందరూ ప్రశాంతి నిలయం వచ్చి ఎన్నో విధములైన సేవలలో, ఆస్పత్రులలో, కేంటీలో, పరిసర పారిశుద్ధ్యంలో శ్రద్ధతో పనిచేస్తున్నారు. ఆశ్రమ కార్యనిర్వాహక సంఘం కూలి పనివాళ్ళకి డబ్బు ఇచ్చి చేయించుకోలేక కాదు. మీలో సేవాసక్తిని పెంచి, సమాజ సేవా మహోద్యమంలో యోధులుగా తయారు చేయడానికి ప్రశాంతి నిలయం ఒక శిక్షణా కేంద్రం కావాలన్నదే స్వామి సదాశయం. ఈనాడు మీరిక్కడ ప్రత్యక్షంగా స్వామి ప్రసాదం, ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ అనుభవం, శిక్షణ, శ్రద్ధాసక్తులతో మీమీగ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి అక్కడ సేవాకార్యక్రమాలు ఆదర్శప్రాయంగా నిర్వహించినప్పుడు, స్వామియొక్క ఆశీస్సులు పరోక్షంగా పదిరెట్లు లభిస్తాయని గుర్తించండి. ఈ వింటున్న మాటలకు మహోద్వేగంతో తప్పట్లు కొట్టడం కాదు, ఈ మాటలను మీ హృదయాలలో భద్రపరచుకుని కార్యరూపంలో చూపించగలరని ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాను." (సనాతన సారథి, ఏప్రిల్ 2013 పు14)