ప్రపంచసేవాదళ సదస్సు, ప్రశాంతి నిలయం,21.11.1984.
స్వార్థం ఒక పెనుభూతము. బ్రతికినంత కాలం ధన సాంపాదనచేత, తాను తనవారి సుఖముల చేత కాలమును వ్యర్థంగావించుకోవటం పశుత్వ మార్గానికి కొనిపోతుంది. సంఘ సేవ హృదయాన్ని విశాలం గావిస్తుంది. మంచివానిని మంచి గంధపు చెట్టుతో, చెరకు గడతో పోల్చారు. మంచి గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసనను అందిస్తుంది. చెరకు పీల్చి పిప్పి చేసినా మధుర రసాన్నే అందిస్తుంది. మంచి సాధకుడు అదే విధంగా ఎన్ని బాధలు వచ్చినా మంచినే అందిస్తాడు. ద్వేషంచేత లేదా విరోధం చేత సాధించడానికి ఎంత మాత్రం అంగీకరించడు. గాలికి ఎండుటాకు ఎనభై అడుగులు పరుగెత్తుతుంది. ఉక్కు గుండుకదలక మొదలక స్వస్థానమునందే ఉంటుంది. బూటకపు సాధకుడు దుఃఖములకు దుర్బోధలకు అదరిపోతాడు. స్థితప్రజ్ఞుడైన సాధకుడు దేనికీ చలించక స్థిరంగా ఉంటాడు. అట్టి స్థిర చిత్తం కలవారు చాలా తక్కువ మంది సేవాదళం కాన్ఫరెన్సు అనే సరికిజిల్లాల నుండి అనేక మంది పేర్లు పంపుతారు. కాని ఇందులో చిత్త శుద్ది దృఢవిశ్వాసంతో సేవ సలిపే వారంతమంది నిజంగాసేవాదళ సభ్యులుగా తయారు కావాలంటే చిత్తశుద్ధితో నిరంతరం సేవయందే మనస్సును లీనం గావించాలి. స్థిరత్వం గల సేవా దళ సభ్యులు కావాలిగాని చంచలత్వం గల సేవాదళ సభ్యులు కాదు. పార్ట్ టైం భక్తులుగా తయారు కారాదు. సత్యసాయి సంస్థల సర్వ శాసనాలను సరియైన రీతిలో అనుసరించాలి.
నేను విద్యార్థులకు చెప్పుతుంటాను స్టడీ ఫర్ స్టెడీ స్థిరత్వం కోసం విద్య అని. స్థిరంగా ఉండాలి కాని ఆటు ఇటు కదలిపోయే ఎండుటాకువలె తయారు కారాదు.కోమలహృదయం లేని వ్యక్తి ఎంత పాండిత్యం సంపాదించుకున్నా నిరుపయోగమై నటువంటి వాడే. వేదములు వాని అంగ ఉపాంగములు వల్లె వేసినప్పటికీ త్యాగ భావము, సేవాభావము లేకున్న ఆ విద్యలు అపర విద్యలే కాని, పర విద్యలు కావు. దురదృష్ట వశాత్తు ఈనాటి మానవుని యందు స్వీకరించే స్వభావమే తప్ప అందించే స్వభావం ఏమాత్రం లేదు. స్వీకరించే స్వభావంఅల్పత్వ లక్షణం. మన హృదయాలను త్యాగముతో, జీవితమును ప్రేమతో నింపుకొనుటకు కృషి చేయాలి. త్యాగంతో చేసిన సేవలే యోగంగా రూపొందుతాయి. వేరు ప్రతిష్ఠలకు ప్రాకులాడనక్కరలేదు. దైవానుగ్రహం పొందడానికికే సాధనలు సలుపాలి.
శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా! , నాయనా! నీవు అమృత | పుత్రుడవు, అనృత పుత్రుడవు కాదని హెచ్చరిస్తుంది ఉపనిషత్తు. బాహ్య జగత్తులో పడిపోయి జీవితాన్ని మరింత మాలిన్యం గావించుకొంటున్నాము. గడచిన దేదో గడిచిపోయింది. ఇకముందైనా సేవలను నూటికి నూరు భాగములు త్యాగభావంతో సలి పేవిగా రూపొందింప జేసుకోవాలి. మనం పల్లెలను దత్తత తీసుకొంటున్నాము. దత్తత అంటే ఏమిటి? బిడ్డలు లేని వారు దత్తత తీసుకుంటారు. ఆస్తిలో కొంత భాగము మాత్రమే కాదు దత్తత తీసుకున్న యజమాని సర్వస్వము దత్తపుత్రునికి చెందుతుంది. దత్తతలో అర్ధ భాగం దత్తత, కాలు భాగం దత్తత అని విభజించరాదు. అదేవిధంగా గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఆ గ్రామానికి అవసరమైన సర్వకార్యములందు మనం బాధ్యత వహించాలి. గ్రామములకు మార్గము అవసరం, త్రాగడానికి జలము అవసరం , వెల్తురు అవసరం, ఆరోగ్యం అవసరం. ఆరోగ్యసదుపాయములు చేకూర్చాలి. గ్రామాలను పరిశుద్ధం గావించే మార్గాలు చేపట్టాలి. గ్రామానికి అవసరకార్యాలేవో వారిని విచారించి కొరతలు తీర్చడానికి ప్రయత్నించాలి.
అట్లు కాకుండా ఒక దినం గ్రామానికి పోవటం, సగరసంకీర్తన చేసి రావడం, ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకున్నామనడం ఇది దత్తత క్రింద చేరదు. ఒకగ్రామం వెళ్ళటం, ఒక దేవాలయానికి ఒక మసీదుకు సున్నం కొట్టడం, దీనిని " దత్తత తీసుకున్నామనటం, లేక బజారు ఊడ్వటం దానిని దత్తత తీసుకున్నగ్రామమనుకోవటం. ఇవన్నీ దత్తత క్రింద చేరవు. గ్రామస్థులను విచారించిగ్రామావసరాలను తెలుసుకొని వారిని సంతృప్తి పరచడమే నిజమైన దత్తత లక్షణము. విద్య, వైద్య విషయాల యందు శ్రద్ధను అభివృద్ధిపరచుకోవాలి. గ్రామ సేవలో ఆ గ్రామస్థులను కూడా చేర్చుకుని నిరంతరం గ్రామ సేవ చేయించడానికివారితో చేరి ప్రయత్నిస్తూ ఉండాలి. గ్రామములోని జలములో నున్న దోషములను పోగొట్టి వారికి సరియైన జలమును అందించడానికి పూనుకోవాలి. ఆరోగ్యం లేక ఎన్ని సౌఖ్యములున్నా కూడా ప్రయోజనం లేదు. కనుక ఆరోగ్యమునకు సంబంధించిన సమస్యకు మొట్టమొదట మన సేవాదళ్ బాధ్యత వహించాలి.
సత్యసాయి సంస్థల యందు ఆధ్యాత్మిక మార్గమే కాకుండా సర్వమూ ఆధ్యాత్మికంగా మార్చడానికి ప్రయత్నించాలి. మానవత్వంలో ఏకత్వాన్ని అభివృద్ధిపరచుకోవడం నిజమైన అధ్యాత్మికం. ఏకత్వం ఎట్లా లభిస్తుంది? చేరిక అనేది మన పరిశుద్ధత ద్వారానే చేకూరుతుంది. పరిశుద్ధ హృదయం లేకపోతే ఈ చేరిక ఏర్పడదు. కనుకనే హృదయమును పరిశుద్ధంగా గావించే సేవయందే జీవితాన్ని అంకితం గావించాలి. సేవ యందు పరులకు గావించే ఉపకారం కంటే తానే ఎక్కువ ఉపకారం పొందుతున్నాడు. అజ్ఞాని తా నెవరికో ఉపకారం చేస్తున్నానని భావిస్తున్నాడు. కాదు, కాదు, ఇతరులకు చేసే ఉపకారం కంటే తనకే అధిక ఉపకారం జరుగుతున్నది. ఈ సత్యాన్ని సేవకులు గుర్తించడం లేదు. సేవాదళ సభ్యులు కేవలం పుచ్చుకోవటం కాకుండా ఇచ్చుకోవటం అభివృద్ధి పరచుకోవాలి. సేవను ఇచ్చుకోవాలి. ప్రేమను పుచ్చుకోవాలి.సేవ వన్ వే ట్రాఫిక్ కాదు. పుచ్చుకోవలసింది ప్రేమను మాత్రమే కాని పదార్థాన్ని కాదు. మనలో ఉన్న శక్తిని పరులకు అందిస్తూ కట్టకడపటికి సేవ యందే శ్వాసను వదలాలి. ఇదే సాయి ప్రధానాశయం .
నిన్న జగదీశ్ చెప్పాడు. సాత్విక సేవ, రాజసిక సేవ, తామసిక సేవ అని. కాని సేవ మూడు రకములుగా లేదు. రాజసిక తామసిక సేవలు సేవ కానేరవు. సాత్విక సేన ఒక్కటే సేవ అవుతుంది. పూర్ణ హృదయంతో గావించేదే సాత్విక సేవ. త్యాగ భావంతో చేసే సేవనే సేవ. హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఎవరీ వికార స్వరూపుని యోచించి అయ్యా నీవెవరని అతనినే అడిగారు. హనుమంతుడు బలవంతుడు, గుణవంతుడు, సకల శక్తి సామర్థ్యములు కలిగిన వాడు. అయినా
దాసోఽ హం కోసలేంద్రస్య’ శ్రీ రాముని దాసుడను అనిచెప్పుకున్నాడు. అత్యంత వినయంతో. సత్యసాయి సేవాదళము పేరును అనుభవించాలనుకుంటే సత్యసాయి గుణములకు తగినట్టు వర్తించాలి. దళము అంటే రేకు. కమలంలో దళములు వేర్వేరుగా కన్పించినప్పటికీ క్రింద అవి ఒక చోటనే చేరి ఉంటాయి. మీరంతా ఒక్కొక్క దళము వంటి వారు. ఈ రేకులన్నీ సత్యసాయితో చేరివుంటున్నాయి. ఒక్కొక్క దళమును వేరు చేస్తే అది కమలం కానేరదు. కనుక సేవా దళమనే ప్రతి వ్యక్తి కూడా సత్య సాయి గుణములకు ఆదర్శములకు అనుబంధం కావాలి.
స్వామికి ప్రేమనే ప్రధాన ప్రాణము. మీరందరూ మీ హృదయాలను ప్రేమతో నింపుకోవాలి. ఇచ్చుకోవటమే స్వామి లక్షణము. మీరు కూడా ఆ విధంగా ఇచ్చుకోవడానికే ప్రయత్నించాలి. దయలేని హృదయము దేవమందిరము కానేరదు. కనుక హృదయమును దయతో నింపుకోవాలి
దైవము సత్ చిత్ అనందములనే మూడు లక్షణములతో కూడిన వాడు. సత్ మన జీవితంలో నిరంతరం ఆత్మస్వరూపమె ఉండునది. దేహము లేకుండాపోయినప్పటికీ ఈ సత్ అనేది నిరంతంర ఉంటుంది. ఒక చిత్ (ఎరుక). అన్నిటినీ ఎరిగినవారమై తెలుసుకున్న వారమై ఉండాలి. ఏవో కొన్ని విషయాలు గుర్తించుకున్నంత మాత్రమున చిత్ పరిపూర్ణం కానేరదు. అన్ని విషయాలు గుర్తించాలి. భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకికములన్నింటి యందు కూడా సరైన విచారణ సలుపాలి. అన్నిటియందు సత్యాన్ని గుర్తించినపుడే చిత్ అనే శక్తి అభివృద్ధి కాగలదు. డాక్టర్లు, ఇంజనీర్లు మొదలైన వారికి అయా విషయాలలో మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క భాగమునందు మాత్రమే ఒకొక్క వ్యక్తి తన జీవిత శక్తిని అభివృద్ధి పరచుకుంటాడు. కాని, మన సత్యసాయి సేవాదళ్ సభ్యులు అనంతమైన శక్తిని అభివృద్ధి పరచుకోవాలి. అనంతమైన శక్తి ఎట్లా లభ్యమై పోతుంది. స్వీట్ల పేర్లు వేర్వేరైనా అన్నిట్లో ఉన్నది చక్కెర ఒక్కటే అని గుర్తించినట్లు వ్యక్తులు, దేశములు, భావములు, సిద్ధాంతములు వేర్వేరైనా అందరియందు ఉన్న దైవత్వం ఒక్కటే అని గుర్తించాలి. ఆ లక్ష్యాన్ని గుర్తించుకుంటే పరతత్వం కూడా మనకు అర్థమవుతుంది.
జీవితమంతా స్వార్థమునందు మునిగి కుళ్ళిపోరాదు. తనవారు, తన పనికాదు, కాదు. అంత మాత్రంలోనే జీవితం అంత్యం కారాదు. కర్మలు చేయడం మాత్రమే ప్రధానం కాదు. పశుపక్షి మృగాదులు సైతం చేస్తున్నాయి కర్మలు. అవి తమ బిడ్డలను తాము పోషించుకుంటున్నాయి. ఏదో విధంగా జీవితాలను గడుపుకొంటున్నాయి. మరి మానవత్వాని కున్న విశిష్టత ఏమిటి? నేను అనే సంకుచిత భావం నుండి మనము అనే సమిష్టిలోనికి ప్రవేశించాలి. కాని, ఈ చేరిక
భావం ఏమాత్రం కలుగుట లేదు. ఈ చేరిక భావం కలిగినప్పుడే అంతా విశాలమవుతుంది. భారతదేశంలో 70 కోట్ల మంది జనం ఉన్నారు. కాని ఒకరికొకరికి చేరిక లేదు. మన సంస్థల వారంతా నేను + నీవు అని చేర్చుకొంటూ పోతే అదే అనంతమవుతుంది. దీనిని పురస్కరించుకొనే వేదమునందు సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష స్సహప్రపాత్ అని చెప్పారు. భగవంతుడు సహస్త్ర శిరస్సులతో కూడినటు వంటి వాడు. కాబట్టి ప్రతి తలను భగవంతుని తలగా మనం భావించాలి. కాని, ఇలాంటి చేరికకు మనం విరుద్ధంగా జీవిస్తున్నాము. ప్లస్సులు తీసి మైనస్సులు పెడుతున్నాము. తండ్రి కొడుకు, భర్త - భార్య, గురువు - శిష్యుడు, ఈ విధంగా తీసివేస్తూ పోతే ఇంక మిగిలేదేముంది? మైనస్ మైనస్ మై పస్ అంటే మైండ్ లెస్ అయిపోతారు. కనుక కావలసింది చేరిక కాని తీసివేత కాదు.
సత్యసాయి సంస్థల వారు ఇలాంటి పవిత్ర చేరికను అభివృద్ధిపరుస్తారని నాకు పూర్ణ విశ్వాసం ఉంది. ఇంతటితో మనం తృప్తి పొందరాదు. గడచిన మూడు దినములలో సత్యసాయి సేవాసంస్థలతో కూడిన వ్యక్తులు గ్రామాలలో ప్రవేశించి అఖండ సేవ చేశారు. ఇలాంటి సేవ సంవత్సరమునకు మూడు దినములు మాత్రమే కాదు. జీవితమున్నంతవరకు ప్రతిదినము కొన్ని గంటలు ఇట్టి సేవలో పాల్గొనుటకు ప్రయత్నించాలి. వర్కర్లు, సేవకులు పూర్ణ హృదయంతో చేస్తూ నే ఉన్నారు. కాని, కొంతమంది లీడర్లు ముందు నిలిచి లీడ్ చేయాలి కాని వెనుక నుండి తోస్తున్నారు. లీడర్లని పేరు పెట్టుకొన్న కొంతమంది ముందు నిలువటం లేదు. కనుక సేవకులు చాలా నిరుత్సాహానికి గురి అవుతున్నారు. మున్ముందైనాఈ లీడర్లు ముందు నిలిచి వారికి ఉత్సాహ ప్రోత్సాహాల నందించాలని నేను ఆశిస్తున్నాను. మన సంస్థల యందు అలాంటి చిన్న చిన్న మెరికలు కూడా మనం చూడరాదు. నూటికి నూరు భాగములు అంతా సేవకులుగా తయారు కావాలి.
రెండవది . మన సేవా సభ్యులు సమితి యందు కాని సేవాదళము నందుకాని మహి ళల, బాలుర విద్యా కార్యక్రమములందు కాని స్టడీ సర్కిల్ నందు కాని ఇంకా ఏ రంగములందు కూడా రాజకీయములలో ప్రవేశించరాదు. కులమత వర్గ భేదములను పార్టీలను ఏ మాత్రము పాటించరాదు. మనలో ఏపార్టీకి చోటివ్వరాదు. సర్వ మతముల సారము ఒక సమన్వమ భావమేనని భావించాలి. ఒకరితో ఒకరు అన్నదమ్ములు, అక్క చెల్లెండ్ల వలె జీవించాలి. మన సంస్థ ఈనాడు సాధించవలసింది. రెండే రెండు. సర్వ మానవ సహో దరత్వం, పరమేశ్వర పితృత్వం. మన తండ్రి ఒక్కడే, దైవం ఒక్కడే అని విశ్వసించాలి. అందరము ఒక తల్లి బిడ్డలమనే ప్రేమను పెంచుకోవాలి. ఈ ప్రేమను పెంచుకున్నప్పుడు ద్వేషభావం, అసూయతత్వం అవరించడానికి వీలు లేదు. మనలో వ్యక్తిగత ద్వేషాని కెంత మాత్రం అవకాశమివ్వరాదు. సంస్థలో చేరి పని చేయడంలో అందరూ సోదరులే అని భావించాలి. పూర్వం మీలో మీకు ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ
భేదాలున్నప్పటికీ నేటి నుండి మాత్రం హలో హలో, సాయిరాం సాయిరాం అని పలకరించుకొంటూ మంచిగా జీవించడానికి ప్రయత్నించాలి. స్వామి చెప్పి నారు కదా అని ఊరికే సాయిరాం అంటే మాత్రం ప్రయోజనం లేదు. కృత్రిమమైన జీవితంగా ఉండరాదు. కొందరు ఇష్టమైనవారిని చూసినప్పుడు సాయిరాం అని మృదువుగా పలకరిస్తారు. అయిష్టమైన వారిని చూస్తే సైరాం అని కసురుకున్నట్లు కటువుగా అనేస్తారు. పలుకులో కూడా ఏ మాత్రం భేదం ఉండరాదు. మన పలుకు మధురంగా ఉండాలి. అదే నిజమైన భగవద్రసం. ఎవరినైనా ప్రేమతో పలుకరించాలి. మన మాటలు, మన నడతలు, మన పనులు మన హృదయం మాధుర్యంతో నింపుకోవాలి. ఈ విధమైన నూతన జీవితాన్ని ఈనాడు లోకానికి అందించవలసి ఉంది.
మనం క్రొత్త మతాన్ని స్థాపించనక్కర లేదు. కొత్త విద్యను- స్థాపించనక్కరలేదు. గుణమైన హృదయం కలవారుగా మనం జీవించాలి.ఈనాడు లోకమునకు కావలసినది గుణము కలిగిన స్త్రీ పురుషులు మాత్రమే. ఇటువంటి సద్గుణములతో కూడిన జీవులుగా అభివృద్ధి గాంచినప్పుడే దేశమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ప్రతి వ్యక్తి అందరి సుఖాన్ని ఆశించాలి. జగత్తంతా సుఖముగా ఉన్నప్పుడు మన సుఖం జగత్తు సుఖంలోనే చేరి ఉంటుంది. కనుక
ప్రేమ హృదయులై త్యాగ భావం చేత జీవితాన్ని సమాజంతో పాటు సార్థకం గావించుకోవడమే నిజమైన మోక్షంగా మీరు విశ్వసించాలి. ఏ సేవయందున్నా నామస్మరణ చేస్తూ సేవ చేయండి. అప్పుడు దుష్ట భావములు హృదయమందు చేరడానికి అవకాశముండదు. నూరు చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించండి. మాటలతో కాలమును వ్యర్థం చేయరాదు. పనులతో సార్థకం చేయండి. ప్రేమ భక్తి బినా ఉద్గార నహీ ; గ్రామ సేవ బినా నిర్వా ణ నహీ !
((శ్రీ సత్యసాయి వచనామృతము 1984 పు 250-261)