నేను పాపిననిగాని, బలహీనుడనిగాని, ద్రోహిననిగాని ఇటువంటి తుచ్చ పదములను ఏమాత్రము ఉపయోగించకూడదు. ఇవన్నీ బలహీనుల యొక్క లక్షణాలు. నేను ఇంత పని చేయగలనా? ఈ పనిని నేను చేయగలనా? నాకు ఆశక్తి ఉన్నదా? అని ఏమాత్రము సందేహించరాదు. నీలో విశ్వాసమే దృఢంగా ఉంటే ఏమైనా చేయగలవు. నీవు ఆత్మ బలహీనుడవు కారాదు. నీవు ఆత్మబలుడవు కావాలి. నాకు లేదు లేదు అనుకొంటే సైకాలజికల్ గా లేకుండానే పోతుంది. నేను చేయగలను, నేను పొందగలను అనే ధైర్యసాహసములతో ఇందులో ప్రవేశించాలి. ఈ విధమైన ఉత్సాహ ప్రోత్సాహములను మనము దినదినాభివృద్ధి - గావించుకోవాలి. అల్ప సుఖములకోసము ఆరాటపడుతున్నాము. ఆ అల్పసుఖము ఎంత కాలము? ఇది కేవలము అతికించుకొన్న ముక్కువంటిదే. ఇది ఎప్పుడు రాలిపోతుందో? ఎప్పుడు కూలిపోతుందో? ఎప్పుడు కాలిపోతుందో? నిత్యసత్యమైన ఆత్మ తత్వమునకు ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు.
ఆ ప్రయత్నము చేసినవాడే నిజమైన సాధకుడు - అతనే ధన్యుడు - అతనే సర్వస్వము అందుకో గలిగిన అర్హుడు. (శ్రీవాణి – పు 8 జులై 2022)