ఈ సాయి మహాత్మ్యం దినదిన ప్రవర్థమానమౌతూ వచ్చింది. ప్రతి దినము వందలాది భక్తులు వచ్చేవారు. వారికి తగిన సదుపాయాలు చేయటం ఇంట్లోనివారికి సాధ్యం కాలేదు. అప్పుడు పెద్దవెంకమరాజు భక్తులతో, ఒక్క బేస్తవారం (గురువారం) మాత్రమే రండి అని చెప్పాడు. వారు చాలా ఆందోళన చెంది "మేము బేస్తవారం వరకు ఎట్లా కాచుకొని ఉండేది? మా రోగాలు ఎక్కువైపోతాయి" అన్నారు. అప్పుడు సుబ్బమ్మ, "వెంకప్పా! నీ ఇంటిలో ఈ అబ్బాయిని పెట్టుకొని ఉండలేవు; మా ఇంటికి పంపించు. నేను అన్ని విధాలుగా చూచుకుంటాను. వచ్చిపోయే భక్తులకు భోజనం కూడా నేనే ఏర్పాటు చేస్తాను" అన్నది. సుబ్బమ్మది బ్రాహ్మణ కులము, ఈ సాయిబాబాది క్షత్రియ కులము. ఫలితంగా గ్రామంలోని బ్రాహ్మణులందరూ “ఈమె సాయిబాబాను ఇంట్లో పెట్టుకున్నది. కనుక, ఈమె ఇంటికి మనం పోకూడదు అని నిర్ణయించుకున్నారు. నాకు ఎవ్వరూ అవసరం లేదు. నేను ఎవ్వరి దగ్గరికీ పోనక్కరలేదు. మీరు ఏమైనా చేసుకోండి, ఈ అబ్బాయిని మాత్రం నేను వదలను అని ఆమె ఖండితంగా వారికి బదులు చెప్పింది. పల్లెలో ఉన్న హరిజనులకు స్వామి అంటే చాలా ప్రీతి. వాళ్ళు అప్పుడప్పుడు స్వామిని తమ ఇంటికి తీసుకొనిపోతూ వచ్చారు. సుబ్బమ్మ కూడా నాతోపాటు ఆ హరిజనుల ఇళ్ళకు వచ్చేది. స్వామిని విడిచి ఒక్క క్షణమైనా ఉండడానికి ఆమె ఇష్టపడేది కాదు. స్వామిని తన స్వంత బిడ్డ మాదిరి చూచుకుంటూ వచ్చింది. దానితో బ్రాహ్మణులందరూ ఆమెపై ద్వేషం పెంచుకున్నారు. కట్టకడపటికి తల్లి, తమ్ముడు కూడా ఆమెపై ద్వేషం పూనారు. కానీ, సుబ్బమ్మ ఏమాత్రమూ చలించలేదు. దైవసంబంధమైన విషయాల్లో ఇలాంటి ఆటంకములను ఎదుర్కొనక తప్పదని ఆమెకు తెలుసు.
ఈ సుబ్బమ్మ బ్రాహ్మణకులాన్ని నాశనం చేసి పెడుతున్నది అని కొందరికి కోపం వచ్చింది. నాకు విషం పెట్టాలని ఒకనాడు వారు నన్ను భోజనానికి పిలిచారు. సుబ్బమ్మ వారింటికి పోవద్దని చెప్పింది. కానీ, నేను వెళ్ళాను. వడలంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి, వడలు చేసి కొన్నింటిలో విషం కలిపి నాకు పెట్టారు. నేను విషం కలిపిన వడలను మాత్రమే తిని విషంలేని వడలను వదలిపెట్టాను. నాకు ఏవిధమైన ప్రమాదమూ జరగలేదు. ఈ సంగతి ఊర్లో అందరికీ తెలిసిపోయింది.
అచిరకాలంలోనే కరణం సుబ్బమ్మ ఇల్లుకూడా పట్టనంతగా జనం వచ్చారు. అది చూచి వెంకమరాజు, అమ్మా! మావలన మీకు ఈ అసౌకర్యమెందుకు? ఇక మీదట సత్యంను వేరుగా ఒక ఇంటిలో ఉంచుదాం అన్నాడు. అప్పుడు సుబ్బమ్మ వేణుగోపాలస్వామి గుడి ప్రక్కన కొంత భూమి ఇచ్చింది. అక్కడ నాకోసం ఒక చిన్న గది కట్టించారు. అందుకు సుబ్బమ్మ సహాయం చేసింది. నన్ను ఆ గదిలో ఉంచి తలుపులకు తాళం వేసేవారు. అయినా నేను ఎట్లాగో తప్పించుకొని కొండపైకి వెళ్ళి కూర్చొనేవాడిని. “తాళం చూస్తే వేసినది వేసినట్లుగానే -ఉంటున్నది. మరి ఈ పిల్లవాడు బయటకు ఎట్లా వచ్చాడు?" అని అందరూ ఆశ్చర్యపోయేవారు. ఈ విధమైన అద్భుతాలు దినదినానికీ అనేకం జరుగుతూ వచ్చాయి.
ఒకనాటి రాత్రి కొందరు నేనుండి గదికి బిగం వేసి నిప్పు పెట్టారు. ఆ గది వరిగడ్డితో కప్పబడడంచేత పెద్దమంటలు రగుల్కొన్నాయి. లోపల ఉన్న సాయిబాబా ఏమైనాడోనని చాలామంది భయపడుతూ పరుగెత్తి వచ్చారు. వెంకమ్మ, సుబ్బమ్మ, ఈశ్వరమ్మ అందరూ ఏడ్చుకుంటూ వచ్చారు. కొంతసేపటికి పెద్ద వర్షం కురిసింది. అయితే, ఆశ్చర్యంగా ఆ ఇంటిపైన మాత్రమే కురిసింది. మంటలు ఆరిపోయాయి. స్వామి క్షేమంగా ఉండడం చూసి వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏ దుర్మార్గులో, ఏ దుష్టులో ఈ విధంగా చేయరాని పనులు చేస్తున్నారు బాధపడ్డారు. అప్పుడు సుబ్బమ్మ ఆ గదికి వేసి బీగమును పగలగొట్టి నన్ను తన ఇంటికి తీసుకుపోయింది. (శ్రీవాణి అక్టోబర్ 2022 పు 8-9)