మీరు భగవంతునికి అర్పించవలసినది ఏమిటి? ఏ హృదయం ఇచ్చాడో దానిని తిరిగి భగవంతునికే ఇవ్వాలి. భగవంతుడు కోరేది ప్రేమ ఒక్కటే. పరిశుద్ధమైన ప్రేమలో ఏది ఇచ్చినా చాలు. శ్రీకృష్ణతులాభార ఘట్టంలో రుక్మిణి "పత్రమో పుష్పమో ఫలమో తోయమో భక్తి కల్గినవారికి వశుడవగుట సత్యమేని కృష్ణా! నీవు ఈ తులసీ దళమునకు తూగుదువు గాక!" అని ప్రార్థించి త్రాసులో ఒక తులసీ దళమును వేసి కృష్ణుని తూచగల్గింది. దేహమే పత్రము, హృదయమే పుష్పము, మనస్సే ఫలము, ఆనందబాష్పాలే తోయము. ఇవి భగవంతునికి అర్పితం చేయకుండా మీరు ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎన్ని శ్లోకాలు కంఠస్థం చేసినప్పటికీ మీకు శోకనివారణ కాదు. శోక నివారణ కావాలంటే మీరు భగవంతునికి అర్పితం కావాలి.
(స.సా.నం.99 పు. 321)
(చూ ||క్షేత్రములు, పురాణములు, భక్తుని లక్షణము, యజ్ఞం)