ఋతుధ్వజుని భార్య మదాలస మహాసాధ్వీమణి. త్యాగ, జ్ఞాన, వైరాగ్యములలో ఈమెకు సాటి మరొకరు లేరు. ఈమెకు దివ్యత్వమనేది పుట్టిన ఇల్లు. పెట్టిన పేరు. వీరిరువురికి మొదట ఒక పుత్రుడు పుట్టాడు. పుట్టిన బిడ్డకే ఏమీ లేనప్పుడు పెట్టిన పేరుకు ఏముంటుంది? కాని ఈ ఋతుధ్వజుడు పేరు పెట్టడం కోసం చాలా తాపత్రయపడ్డాడు. కట్టకడపటికి ‘విక్రాంతుడు అని పేరు పెట్టాడు. మదాలస ఫక్కున నవ్వింది. పేరు కోసం ఈ మహారాజు ఇంత ప్రాకులాడుతున్నాడేమిటని లోపల అనుకుంది. మదాలస. ప్రాకృతమైన శరీరమునకు ఒక భౌతికమైన శరీరమునకు ఒక భౌతికమైన పేరు కావాలి గాని, ఈ మలమూత్ర దుర్గంధ మాంస రక్తములలో కూడినటువంటి ఈ దేహమునకు పేరుకోసం అంతగా ప్రాకులాడటం వ్యర్థమని భావించింది. కొంతకాలానికి రెండవ కుమారుడు పుట్టాడు. సుభాహుడు అని పేరు పెట్టారు. అనగా మంచి హస్తములు కలవాడని అర్థము. అప్పుడు కూడా మదాలస ఫక్కున నవ్వింది. రాజు అవమానంగా భావించాడు. తాను పెట్టిన పేర్లకు ఏమాత్రం విలువలేనట్లుగా మదాలస హాస్యం చేస్తున్నదని భావించాడు రాజు.
మరి కొంత కాలానికి మూడవ పుత్రుడు పుట్టాడు. అప్పుడు ఆ రాజు "మదాలస! నేను పెడుతున్న పేర్లు నీకు అంత ఇష్టముగా వున్నట్లులేదు. ఈ తడవ ఈ పిల్లవానికి నీవే పేరు పెట్టు అని ఆమెకు వదలి పెట్టాడు. అప్పుడు ఆ పిల్లవానికి అలర్కుడు అని పేరు పెట్టింది. రాజుకు కోపం వచ్చింది. మేము క్షత్రియులం, రాజపుత్రులం, ధీరులం. నా కుమారునికి ‘అలర్కుడు అని పేరు పెట్టడం అవమానకరమన్నాడు. అలర్కుడు అనగా పిచ్చికుక్క, అప్పుడు మదాలస "మహారాజా! తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటివాడు, తన దివ్యత్వాన్ని తాను అర్థం చేసుకోలేనటువంటివాడు. ఏకత్వాన్ని భావించలేనటువంటివాడు, కుక్క కంటే హీనమే" అన్నది. - కనుక తన స్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవులకు పేర్లవలన ప్రయోజనమేమిటి? ఏకత్వాన్ని భావించలేనటువంటి మానవులకు ఈ పేర్లు ఎందుకు? దివ్యత్వాన్ని చింతించలేనటువంటి మూర్ఖులకు ఈ పేర్లు ఎందుకు? ఇది మానవదేహము. కాని వీరు మానవులు కాదు. ఆత్మ స్వరూపులే, ధర్మ స్వరూపులే, నిర్గుణ నిరాకార త త్త్యములే. నిర్మల స్వరూపులే. నిష్కళంక స్వరూపులే. ఇలాంటి ఆత్మకు పేర్లు పెట్టడం ఎంత ఆజ్ఞానం ?
(శ్రీ.గీ.పు.359/361)