నమస్కారము చేసింది. అప్పటినుండి ఆమెకు బాబాపై భక్తి. ఎవరికీ చెప్పేది కాదు. తన ఇంటిలో ఏమైనా చేస్తే బాబాను పిలిచి తాను తినిపించేది. భర్తకు తెలియకుండా, ఎందుకంటే ఏమనుకుంటాడో యేమో! అప్పుడు మహమ్మదీయులకు హిందువులకు ద్వేషము. అప్పటి నుండి బాబా చేసే పని ఏమిటి? మతముల ఏకత్వము చాటే నిమిత్తము ఈ తీసుకున్న సాల గ్రామమును మసీదుకు పోయి పూజ చేసేవాడు. తాను మహమ్మదీయుడు. పోయేది హిందూ దేవాలయమునకు, చదివేది ఖురాన్. ఈ రెండు పరస్పర విరుద్దాలు ప్రతి దినము హిందువులు, మహమ్మదీయులువచ్చి ఫకీరుకు కంప్లైంట్లు చేయటం జరిగేది.
ఒకనాడు ఫకీరుకు స్వప్నము వచ్చింది. "ఫకీర్, నీవు ఇంక ఎంతకాలమో ఉండవు. నీవు పెంచిన ఈ పిల్లవానిని యింక ఎవరూ పెంచలేరు. ఫలానా చోట వెంకూసా అని ఉంటాడు. ఈ పిల్లవానిని అతని దగ్గర వదలి పెట్టు అని. ఫకీరు ఆ పిల్లవానిని తీసుకొని వెంకూసా దగ్గరకు వెళ్ళాడు. వెంకూసా మంచి గురువు. పిల్లలకు ఆధ్యాత్మిక తత్త్యము ప్రబోధించేవాడు. ఈ పిల్లవాడు వస్తుండగనే అతని కోసమే ఆంతకాలము కాచుకొని ఉన్నట్లు ఆవోజీ ఆవోజీ" అని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకున్నాడు. భుజాలు నిమిరాడు. ఇంతకాలం నీకోసం కాచుకున్నాను అని అనేక విధములుగా ముచ్చటలాడి లోపల భోజనం చేసిరా అన్నాడు. ఆ ఆశ్రమం హిందువులకు మాత్రమే సంబంధించినది. బాబా హిందువుల బిడ్డయా? మహమ్మదీయ పిల్లలను చేర్చుకొంటే అతని ఆశ్రమముపై మహమ్మదీయులంతా వచ్చి పడతారు. హిందువులకు మరొకవైపున వారిని ఎందుకు చేర్చుకున్నారని ద్వేషము ఏర్పడుతుంది. ఈ విధంగా కొంచెము యోచిస్తూ ఉండేటప్పటికి వెంకూసాకు రాత్రి స్వప్నము వచ్చింది. వచ్చిన పిల్లవాడు సామాన్యుడు కాడు. అతనికి మతములతో ఎట్టిసంబంధములేదు. సర్వసమన్వయ మతమే అతని అభిమతము. కనుక నీవు ఏమాత్రము వెనుకంజ వేయవద్దు. ఇది నీ అదృష్టము అని చెప్పేటప్పటికి అప్పటి నుండి వెంకూసాకు బాబాపై ప్రేమ అధికమవుతూ వచ్చింది. అతనిని చాలా ఆదరించి తనతోనే ఉండమని “నాయనా! ఇదంతా నీదే" అని ఆశ్రమములో అన్ని అధికారాలు యిస్తూ వచ్చాడు. ఆ పిల్లవానిని చాలాప్రేమించేవాడు. ఏవిషయములోనైనా అతనికే ప్రథమ స్థానము ఇచ్చేవాడు.
దైనం కొందరిపై అనుగ్రహము అధికంగా చూపు తుంటాడు. కొందరిపై చూపీ చూపనట్టుంటాడు. కొందరి పై అసలు చూపనట్టే ఉంటాడు. అది విభ్రాంతియే గానీ మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే. అద్దమునకు ఒకవైపున రసాయనము పూసి ఉండటం చేర నీ ప్రతిబింబము అందులో కనిపిస్తుంది. కాబట్టి ఎవరి హృదయమునకు ప్రేమ అనే రసాయనము పూసి ఉంటారో వారి దగ్గర మాత్రమే యిది కనిపిస్తుంది. కనిపించక పోవటం దైవము యొక్క దోషముకాదు. నీ హృదయానికి ఆ రసాయనం పూయలేదు. అందుచేత మరొక రోగము ప్రారంభమవుతుంది. ఏమిటా రోగము? అసూయ.
ఈ ప్రేమను చూచి అక్కడున్న విద్యార్థులలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. "ఇదేమి మేము ఇన్ని సంవత్సరముల నుండి ఇక్కడ ఉంటున్నాము. మా వైపున చూడటం లేదే. ఇప్పుడే వచ్చిన ఈ పిల్లవానితో ఏమిటీ విధంగా మాట్లాడుతున్నాడు?" అని వీరిలో వీరికి కలతలు బయలుదేరినాయి. కొంతమంది మంచిగా అభిప్రాయ పడ్డారు. మరి కొంతమంది ఆ ఫకీరు ధనవంతుడు. అతని దగ్గర ఎక్కువ ధనము వస్తుందని ఆశిస్తున్నాడేమోన ని అనుకున్నారు. ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్నారు. తలలు వేరైనప్పుడు తలంపులు వేరుగా వస్తుంటాయి. భావములకొద్దీ ఊహలు బయలు చేరుతాయి.
దినదినమునకు వెంకూసాకు, బాబాకు సన్నిహిత సంబంధము ఎక్కువ అవుతూ వచ్చింది. ఒకనాడు ‘వికారా అనే అడవికి ఈ ఇద్దరు వెడుతున్నారు. వెంకూసా ఆశ్రమములోని హిందువులందరు మహమ్మదీయ పిల్లవాడు ఆశ్రమములో ఉండకూడదు. ఈ ఆశ్రమము క్రమక్రమేణా మహమ్మదీయులతో నిండిపోతుంది. ఈ తరువాత వారే ఆక్రమించుకుంటారనే ఉద్దేశ్యములో కుట్రపన్ని బాబాను ఆశ్రమము నుండి తరిమి కొట్టాలని ప్రయత్నించారు. ఐదారు మంది పిల్లలు ఒక ప్లాను వేశారు. ఇప్పుడు సరైన సమయము. ఆ పిల్లవానిని చంపితే వెంకూసా అప్పుడు మనపై ప్రేమ చూపగలడు ఆనుకున్నారు. అక్కడకు నడిచిపోయారు. ఒక గుడిసె దగ్గర కూర్చున్నారు. ఒక బలమైన విద్యార్థి ఒక యిటుకతీసుకొని సూటిగా బాబా తలకు తగిలేటట్టు విసిరాడు. బాబా అంటే వెంకూసాకు ప్రేమ. తక్షణమే వచ్చి బాబా ముందు నిల్చున్నాడు. బాబాకు తగలవలసింది వెంకూసాకు తగిలింది. తక్షణమే రక్తం కారింది. అప్పుడు బాబా కట్టుకున్న బట్ట చించి తలకు కట్టాడు. స్వామీ! మీకెట్లా తగిలిందే" అని బాబా మాట్లాడుతుండగనే ఆ పిల్లలు పరుగెత్తి వచ్చారు ఒక పిల్లవాని శవము తీసుకొని, ఎవరిది ఈ శవము? బాబాను కొట్టటానికి ఎవరైతే యిటుక వేశారో వాడు చనిపోయాడు తక్షణమే. "గురూజీ! మా పాపము క్షమించండి అని పాదములపై పడ్డారు. అప్పుడు వెంకూసా చెప్పాడు. నాయనా! నేను వృద్ధుడనయ్యాను. నా సర్వస్వము ఈ పిల్లవాడే. నిర్మలప్రేమగలవాడే మనలను రక్షించగలడుగాని ఇతరులు రక్షించలేరు ఈ మాటలు విని బాబా పాదములపై పడవేశారు పోయిన పిల్లవానిని. బాబా ఫక్కున నవ్వాడు. ఎందుకు నవ్వాడు? తనను చంపటానికి ప్లాను వేసినవాడు చచ్చాడనే ఆనందముతో కాదు. ఇదంతా దేహలక్షణమని నవ్వాడు. చిన్న వయస్సునందే యిట్టి పరమసత్యమును గుర్తించాడు. బాబాకు వయస్సు అక్కరలేదు. తనకుమొదటి నుండి తెలుసు. ఎందుకంటే సమస్త సృష్టి తన హస్తమునందుంచుకున్నాడు. తక్షణమే ఏమి కావాలని వచ్చారు? ఇది శవము. ఈ దినము ఇతను. రేపటి దినముమీరు. ఎవరూ శాశ్వతము కాదు అన్నాడు. అప్పుడా పిల్లలు అడిగారు. మేము తల్లిదండ్రులకేమని చెప్పాలి? అప్పుడు బాబా చెప్పాడు జరిగింది చెప్పండి" అని. జరిగింది చెబితే అవమానము. వారగనిది చెబితే అసత్యము. మీకు కావలసింది ఏమిటి? ఈ పిల్లవానిని బ్రతికించటమే కదా! అంటూ తక్షణమే కూర్చొని ఆ పిల్లవాని తలను తొడపై పెట్టుకున్నాడు. తల నిమురుతున్నాడు. సాయినాధునికి శరణుకండి. మీ అభీష్టము నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడందరు బాబా పాదములు పట్టుకున్నారు. తక్షణమే పిల్లవాడు లేచాడు. అప్పటినుండి బాబా ప్రభావము లోకములో ప్రచారమవుతూ వచ్చింది.వెంకూసా మరణానంతరము అనగా 1854లో ఒకనాటి రాత్రి ఆశ్రమము వదలి ప్రయాణమై షిరిడీ చేరాడు.
షిరిడి చాల చిన్న గ్రామం. షిరిడీలో ఇండోబా దేవాలయంలో ప్రవేశించబోయిన బాబాను మహల్సాపతి అనే పూజారి చూసి ఎవరో మహమ్మదీయ ఫకీరని భావించి లోపలకు రానివ్వలేదు. బాబా అక్కడ నుండి ఊరి బయటనున్న ఒక వేపచెట్టు క్రిందకు పోయి కూర్చున్నాడు. అప్పటికి బాబా వయస్సు పదహారు సంవత్సరాలు. అతని పేరేమిటో ఊరేమిటో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఎవరైనా వచ్చి "మీ పేరేమిటి? మీరే ఊరు నుండి వచ్చారు?" అని ప్రశ్నిస్తే నా ఊరుతో నీ కేమి పని? నా పేరు నీకెందుకు? అని ఎదురు ప్రశ్నలు వేసేవాడు బాబా. అందుచేత బాబా పేరుగాని, ఊరుగాని ఎవరూ తెలసుకోలేక పోయారు.
బాబా అక్కడే కొద్ది కాలంపాటు ఉన్నాడు. ఆ రోజులలోగ్రామ ప్రజలందరు ఆవేపచెట్టు క్రింద బాబా వద్దకు వచ్చి తమ బాధలను నివేదించుకొని నివారించుకునేవారు. ఎవరైనా శారీరక బాధలతో వస్తే బాబా ఏదో ఒక ఆకు తీసుకొని నలిపి వారికిస్తూ దీనిని తిను నీ నొప్పి తగ్గిపోతుంది. అనేవాడు. ఈ విధంగా అనేకమంది రోగాలను నివారణ గావించేవాడు. ఈ విషయం చుట్టు ప్రక్కల పల్లెలంతా ప్రాకి పోయింది. అందరు బాబా వద్దకు రాసాగారు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు ఉన్నట్లుండి బాబా ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఎంత వెతికినప్పటికి బాబా కనిపించక పోవటంతో ఆ గ్రామ ప్రజలు నిరాశ చెందారు.
(షి.పు.6/16)
బాబా తిరిగి మూడు సంవత్సరముల తరువాత 1857వ సంవత్సరములో షిరిడీ వచ్చారు. ఎవరి తో వచ్చారు? "ఔరంగాబాద్ దగ్గర ధూప్ గ్రామం ఉంది. ఆగ్రామములో చాంద్ భా భాయిపాటిల్ అనే ఓ మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. ఒకనాడు ఏదో ఒక అత్యవసరమైన పనితటస్థించటంతో చాంద్ భాయి పటేల్ తన గుఱ్ఱమునెక్కి ఔరంగాబాద్ చేరుకున్నాడు. అక్కడ రెండు మూడు రోజులు తన పనులను చక్క పెట్టుకొంటున్న సమయంలో అతని గుఱ్ఱము తప్పించుకొని పోయింది. దానిని వెతకటానికి ఎంతో ధనము ఖర్చు పెట్టి సకల ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం లేకపోయింది.చాంద్ భాయిపాటిల్ కి ఆ గుఱ్ఱమంటే చాలా ఇష్టం. గుఱ్ఱము పోయేటప్పటికి ఆహారము కూడా తీసుకోలేదు. దేని పైన అయినా అభిమానము కలిగితే ఈ విధంగా బాధలు కూడా వెంటాడుతూ ఉంటాయి. చివరకు నిరాశ చెంది దాని జీను మోసుకొని వస్తున్నాడు ధూప్ గ్రామానికి.
ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామానికి వచ్చేదారిలో దట్టమైన అరణ్యం ఉండేది. ఆదట్టమైన అడివిలో ప్రవేశించాడు. ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న ఒక ఫకీరును చూచాడు. గుఱ్ఱము పోగొట్టుకున్న విచారముతో నడుస్తూ వస్తున్న చాంద్భాయిపాటిల్ను ఆ ఫకీరు చూచి ఏయ్! పాటిల్ ఆవోజీ అన్నాడు. అప్పటికే అలసిపోయిన పాటిల్ ఆ చెట్టు క్రిందకు వచ్చి విశ్రమించాడు. బాబా దగ్గర చిలుమున్నది. ఈ లోపల బాబా హుక్కా తయారు చేయటం ప్రారంభించాడు. హుక్కా పీల్చాలంటే నీరు, అగ్ని రెండూ కావాలి. పాటిల్ నీ దగ్గర అగ్గి పెట్టి ఉందా? అని ప్రశ్నించాడు. పాటిల్ లేదన్నాడు. అప్పుడు బాబా తన చేతిలోని కట్టను భూమిపై కొట్టాడు. వెంటనే అక్కడ ఆగ్ని ఆవిర్భవించింది. తిరిగి అదే కట్టను మరల కొట్టాడు. అక్కడే నీరు వచ్చింది. ఈ విధంగా సృష్టించిన అగ్నిని నీటిని ఉపయోగించి బాబా హుక్కా వెలిగించాడు. తాను పీల్చి దానిని పాటిలకు అందిస్తూ పాటిల్ ! ఎందుకు విచారంగా ఉన్నావు? ఎక్కడకు వచ్చావు? ఎందుకు పోతున్నావు? జీను మాత్రమే వేసుకున్నావు. గుఱ్ఱము ఏది? అని అడిగాడు. నా పేరు పాటిల్ అని మీకెట్లా తెలుసు?" అని పాటిల్ తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు? ఇతడు మహనీయుడని గుర్తించి, ఈ జీను నాయొక్క తప్పిపోయిన గుఱ్ఱం జ్ఞాపకార్థముగాతీసుకుపోతున్నాను. అని చెప్పాడు. అప్పుడు బాబా నాకన్నీ తెలుసు. ఏ గుఱ్ఱం కోసం నీవు చాలా విచారిస్తున్నావు. తలమీద కళ్ళు పెట్టుకొని వెతకటం వలన అది ఇంతకాలం నీకు కనిపించలేదు. నీ గుఱ్ఱము ఆ చెట్టుక్రిందనే మేస్తున్నది పోయి చూసుకో అన్నాడు. వెంటనే చాందభాయిపాటిల్ వెళ్ళి చూడగా గుఱ్ఱము అక్కడే ఉంది.
ఇతనిని చూచి అది అరచుకుంటూ వస్తున్నది. ఇంతకు పూర్వం ఆదే ప్రదేశంలో ఎంతో మంది కూలీలచేత వెతికించినప్పటికి దొరకని గుఱ్ఱము అదే ప్రదేశంలో కనిపించటం చేత ఆశ్చర్యం కలిగింది. ఆ గుఱ్ఱము తీసుకొని దానిపై జీను వేసుకున్నాడు. బాబా ఆగ్నిని, నీటిని సృష్టించటాన్ని కొద్ది నిముషముల ముందుగా చూచిన పాటిలకు తన గుఱ్ఱము కూడా దొరకటంలో బాబా శక్తిసామర్థ్యాలు అర్థమైనవి. స్వామీజీ మీరు నాకెంతో ఉపకారం చేశారు. కనుక మీరు నావెంబడి మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి. అని పాటిల్ ప్రార్థించాడు. బాబా అంగీకరించి ఆతనివెంట బయలుదేరాడు. బాబాను వెనుక కూర్చోబెట్టుకొని ధూప్ గ్రామం చేరాడు. ఈ ధూ గ్రామంలోనే బాబా మూడు సంవత్సరాలున్నాడు. ఈ విషయము ఎవరికీ తెలియదు.
చాందభాయి పాటిల్ మేనల్లుని వివాహము నిశ్చయమైంది. పెండ్లి కుమార్తె షిరిడీకి చెందింది. కావున వారందరూ షిరిడీ బయలు దేరవలసి వచ్చింది. బాబాను కూడా తన వెంట రావలసిందిగా చాంబాయిపాటిల్ కోరాడు. వారందరు బయలుదేరి షిరిడీ చేరుకున్నారు. అక్కడ బాబా బండి దిగుచుండగా మహల్సాపతి చూచాడు. వెంటనే అతడు అయియే బాబా సాయీ అంటూ బాబాను సాదరంగా ఆహ్వానించాడు. సాయి అనే పేరు మహల్సాపతి పెట్టినదే. ఆంతవరకు ఎవరూ పేరు పెట్టలేదు. షిరడీ చేరిన తర్వాత యిక కావలసినవన్ని జరగు తూ వచ్చాయి. షిరడీ వచ్చి చేరేంతవరకు ఎవరికీ బాబా యొక్క చరిత్ర యిట్టిది. అట్టిది అని స్పష్టముగాతెలిసినట్లు లేదు. అక్కడ ఒక విష్ణుదేవాలయం ఉంటున్నది. ఆ దేవాలయములో మహల్సాపతి పూజ చేసేవాడు. మహల్సాపతి గొప్ప భక్తుడు. ఈ పెండ్లి వారిలో వచ్చి దేవాలయము వద్ద కూర్చున్నాడు. బాబా. మహల్సాపతి పోతూ పోతూ దేవుని ప్రసాదము కొంతయిచ్చాడు. నాకుఈ ప్రసాదం వద్దు అన్నాడు బాబా. ఎందుకు నాయనా! ఎందుకు తీసుకోవు దేవుని ప్రసాదం?" అని అడిగాడు. నేను యిప్పుడే తిన్నాను. అన్నాడు. ఎక్కడకు వెళ్లావు? ఎక్కడికీ వెళ్లలేదే. ఎలా తిన్నావు? అడిగాడు. ఇప్పుడు నాకు అక్కడ నైవేద్యముగా పెట్టావే. అదే తిన్నాను. " అన్నాడు బాబా. అదేమిటి? చిన్న దేవాలయము. నేను అక్కడే ఉన్నాను. నీవు ఆవైపునే రాలేదు. ఎట్లా తిన్నావు? అని అడిగాడు మహల్సాపతి నీవు చూడలేదు నన్ను అన్నాడు. బాబా. ఈ విధముగా మాట్లాడేటప్పటికి మహల్సాపతి మొదట ఇతనెవరో చిన్న పిల్లవాడనుకొన్నాడు. మరికొంత దూరము పోయిన తర్వాత, భక్తుడు మహల్సాపతి, మరల వెనుకకు వచ్చాడు కనుక్కునే టందుకు. ఈ పిల్లవాడు ఈ విధముగా చెప్పటములో ఏదో అంతరార్థముందని ఊహించి, ఆ పిల్లవాని యొక్క తేజస్సు చూచి దైవముగా విశ్వసించాడు. ఆ దేవాలయము ప్రక్కనే సామానులు, ఉత్సవ విగ్రహాలు పెట్టుకోవటానికి చిన్నగది ఉండేది. ఆ గదిలో ఉండమని చెప్పి నిత్యమునైవేద్యం పెట్టేదంతా బాబాకు పెట్టడం ఈ రకంగా చేస్తూ రావటం చేత క్రమక్రమేణా కొన్ని ఆధ్యాత్మిక ప్రబోధాలు అర్థము కానివన్నీ సులభంగా చెప్పటానికి ప్రారంభించాడు బాబా. అప్పుడు కొంతమంది. ఈ దేవాలయానికి వచ్చిపోతూ ఈ అబ్బాయి ఏమి చదివాడు? ఏ విధముగా పనిచేస్తున్నాడని ప్రశ్నించేవారు. ఈ పిల్లవాడు నేను చదువుకోలేదు కానీ అన్ని చదువులు నాకు తెలుసు. నేను దేహరీతిగా దేనినీ చూడలేదు. అన్నీ నాలోనే ఉన్నాయి. నేను ఎట్టి గురువు నూ సేవించలేదు. నేనే అందరికీ గురువును. నాకు గురువు లేడు అని ఈ విధంగా చెబుతూ రావటం చేత మహల్సాపతి మరింత శ్రద్ధనుఅభివృద్ధి పరచుకొని ఆంతరిక రూపాన్ని కొంతవరకు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు.
ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఈ గ్రామములో జానకీదాసు అనే ఓ పహిల్వాన్ ఉండేవాడు. ముష్టి యుద్ధము చేస్తాడు. ఈ పిల్లవానితో అతడు నాకు అన్ని తెలుసునంటున్నావే. నాతో యుద్ధము చేయగలవా? అన్నాడు. తప్పక చేస్తానన్నాడు బాబా, రెండు దినములు ఒక గుంట త్రవ్వి దానిలో యిసుకేసి జానకీదాసు, బాబా యిద్దరు కుస్తీ చేశారు. ప్రతి పర్యాయము జానకీదాసు క్రిందపడిపోయేవాడు పాపం. ఓడి పోవటంచేత కోపం ఎక్కువైపోయింది. గొప్ప పహిల్సాన్ కనుక, ఆ గ్రామంలో ఉండే పెద్దలందరికి ఆయనంటే గౌరవం. జానకీదాసు చిన్నపిల్లవానిచేత ఓడి పోతున్నాడట అని అపహాస్యం చేస్తూ వచ్చారు. అప్పుడు మహల్సాపతి బాబాకు చెప్పాడు. నాయనా! నీవు గొప్పవాడివని తెలుసు నాకు. కానీ జనులు అర్థం చేసుకోలేరు. లోకులు పలు విధములుగా ఉంటారు. నీపై ద్వేషంగా కూడా ఉంటారు. నిన్ను ఏమిచేస్తారో ఏమో, నాకు దేహాభిమానం ఉంది కనుక నీ పైన ప్రేమతో చెబుతున్నాను. ఏదో ఒకసారి అతనితో నీవు ఓడిపోయినట్లు నటన చేస్తే మంచిది కదా" అన్నాడు. అప్పుడు బాబా మహల్సాపతీ! నీకోసం తప్పక ఓడిపోతాను అన్నాడు. పందెం ఏమంటే జానకీదాసు ఓడిపోతే అతడు సన్యాసము స్వీకరించాలి. నేను ఓడిపోతే ఈ నాటినుండిఈ కుస్తీ జీవితములో చేయను.ఓడిపోయినందుకు గుర్తుగా నేను ఒక కాషాయ వస్త్రాన్ని నాతలకు బిగించుకుంటాను." అన్నాడు. మహల్సాపతి ప్రార్థన ననుసరించి జానకీదాసు వచ్చి పట్టుకొన్న తక్షణమే బాబాక్రిందపడిపోయినట్లుగా నటించాడు. జానకీదాసు తృప్తి కలిగించాలి. విరోధము పెంచుకో కూడదు. ద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు. శాంతిని చేకూర్చాలనే ఉద్దేశ్యములో తాను పడ్డాడు. అప్పటికప్పుడే జానకీదాసు ఇచ్చిన కాషాయ వస్త్రము తలకు కట్టుకొన్నాడు. బాబా. ఈ చరిత్రనే అనేక విధాలుగా తెలుపుతూ వచ్చారు. గ్రంథాలలో, బాబాగురువు తన ఆశ్రమములో ఉంటున్నప్పుడు ఈ గురువును కొట్టటానికి ఎవరో దొంగలు వచ్చారని, ఆ గురువువెంట తానుకూడా అడవికి పోతే ఒక ఇటుక రాయితో అతనిని కొట్టారని దానివల్ల ఆయనకు దెబ్బ తగిలిందని, ఆనాడు వెంకూసా తనకు వస్త్రము కట్టాడని ఇవన్నీ కేవలము కల్పితమైన కథలు. బాబాకు ఎప్పుడూ, ఎక్కడా ఏ దెబ్బా తగలలేదు. ఎవ్వరూ తలకు కట్టుకట్టలేదు. ఒకవేళ దెబ్బతగిలి కట్టుకడితే దెబ్బ మానిన తర్వాత కట్టుతీయ వచ్చు కదా! జీవితమంతా ఎందుకు కట్టు కట్టాలి? ఈవిధంగా కొన్ని కథలు కల్పించారు.
మహల్సాపతి ద్వారా క్రమక్రమేణా నా నా, తా త్య, అబ్దుల్ బాబా. దాన్ గణు వీరందరు బాబా దగ్గర చేరుతూ వచ్చారు. అప్పటినుండి బాబాకీర్తి దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ వచ్చింది.
ఒకనాడు పైల్ గాన్ లోకొంతమంది దొంగలు ఒక శ్రీమంతుని యింటిలో దొంగతనము చేసి పారి పోతుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. వారు భయంతో వణికి పోయి అక్కడే ఉన్న బాబాను చూపిస్తూ అదిగో ఆ ఫకీరే ఈ వస్తువులను మాకిచ్చాడు. అని అబద్ధం చెప్పారు. అప్పుడా పోలీసులు బాబావద్దకు వచ్చి బాబా! ఈ వస్తువులను వారికి యిచ్చినది మీరేనా? అని అడిగారు. అవును అన్నాడు బాబా. అయితే మీకీ వస్తువులు ఎక్కడి నుండి వచ్చాయి? అని ప్రశ్నించారు. అన్ని ఎక్కడ నుండి వచ్చాయో ఇవి కూడా అక్కడినుండే వచ్చాయి. అని బాబా జవాబిచ్చాడు. ఈ విధమైన సమాధానములు పోలీసులు అర్థము చేసుకోలేక పోయారు. పోలీసులది ప్రాకృత దృష్టి అందుచేత బాబా నుండి ఎట్టి సమాచారమూ సేకరించ వీలుకాదని గుర్తించి పోలీసులు మేజిస్ట్రేటుకు ఒక రిపోర్టు వ్రాసుకున్నారు. అప్పుడు మేజిస్ట్రేటునుండి బాబాకు సాక్ష్యం చెప్పటానికి రావలసిందిగా పిలుపు వచ్చింది. కానీ ఎవరికీ బాబాను మెజిస్ట్రేటు వద్దకు పంపటం ఏ మాత్రం యిష్టం లేదు. వారు మేజిస్ట్రేటు తో ను, ఉన్నతాధికారులతోను మాట్లాడి దర్యాప్తు బృందం షిరిడీకివచ్చి బాబాను కలుసుకోనేలా ఏర్పాట్లు చేశారు. ఒకనాడు ఆ బృందంవారు బాబా వద్దకు వచ్చారు. మొట్టమొదట "మీ తండ్రి పేరేమిటి?" అని బాబాను ప్రశ్నించారు. బాబా అని జవాబిచ్చాడు. బాబా ఆనగా తండ్రి అని అర్థము. ఇంక బాబాపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రశ్న: మీదేమతము?
బాబా: దైవ మతము
ప్రశ్న: మీ కులమేమిటి?
బాబా: దివ్యమైన కులం
మీరెక్కడి నుండి వచ్చారు?
బాబా: ఆత్మనుండియే వచ్చాను.
ఈ విధంగా వారి ప్రశ్నలన్నింటికి సమాధానము చెబుతూ వచ్చాడు.
అనేకమంది బాబా దైవత్వమును సందేహిస్తూ వచ్చారు. ఒక మార్గశిర శుద్ధ పంచమినాడు దత్తాత్రేయ జయంతి నాడు అనేకమంది బాబా దగ్గరకు చేరుకున్నారు. వారిలో మంచి పండితుడు, ధనవంతుడు అయిన ఖై జాక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పూర్తి పేరు బల్వంత్ ఖైజాక్,ఆతను వచ్చేసరికి బాబా ఒక కట్ట తీసుకొని తన చుట్టూ చేరిన వారినందరిని జావో జావో సైతాన్ అంటూ కొట్టనారంభించాడు. బాబా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. నాకు ప్రసవ వేదనగా ఉంది. మీరందరు వెళ్లిపోండి అని బాబా గట్టిగా అంటున్నాడు. ఆప్పుడు బాబా కేకలు వేయటమే కాదు. వీలు పడితే
కఱ్ఱతో కొట్టేవాడు. బాబా కేకలు విని అందరూ భయంలో పరుగెత్తి పోయారు. కొంత సేపయ్యాక అందరూ రండి" అని బాబా పిలిచాడు. అంతేకాదు ఆ బల్వంత్ ఖెజాక్ చూచి బల్వంత్ ఖైజెక్! ఆవోజీ ఆవోజీ" అని పిలుస్తూ బాబా లోపలికి వెళ్లాడు. లోపలకు బల్వంత్ ఖైజాక్ కూడా వెళ్లాడుగానీ అక్కడ బాబా కనిపించలేదు. ఆ స్థానములో మూడు తలలు గల్గిన శిశువు కనిపించింది. ఆ శిశువు దత్తాత్రేయుని మాదిరిగా కనిపించాడు. ఆ చిన్న శిశువుకు అనేక హస్తములున్నాయి. ఆ దత్తాత్రేయ స్వరూపాన్నిచూచిన బల్వంత్ ఖైజాక మిగిలిన వారి సందరిని పిలిచాడు. అందరు లోపలకు వెళ్లి చూచి భక్తి పూర్వకముగా కళ్ళు మూసుకున్నారు. తక్షణమే బాబా ప్రత్యక్షమయ్యాడు. ఆనాటి నుండి బాబా దత్తాత్రేయ అవతారమని భగవంతుడని చాల మంది విశ్వసించారు.
బాబా ఒకనాడు కేల్కరును పిలిచి ఈనాడు గురుపూర్ణిమ. గురుపూజ చేయమన్నాడు. సాఠే మేనమామతో గురుపూజమొట్టమొదట ప్రారంభింపచేశారు. కేల్కరు గురుపూజ అంటే ఏమిటని ప్రశ్నించాడు. బాబా చెప్పాడు: గురువంటే ఎవరనుకున్నావు. కేవలం మఠాధిపతులు, సన్యాసులు కాదు గురువులు. భగవంతుడే గురువు. బ్రహ్మానందం పరమసుఖదం లోకములోమన్న అన్ని ఆనందములలో ఉన్నతస్థాయిలో నున్నది బ్రహ్మానందం. అది ఒక్క బ్రహ్మకు తప్ప వేరొకరికి ఉండదు. లోకములో వస్తు సంబంధమైన ధన, కనక, వస్తు, వాహనాది సుఖములు తాత్కాలిక సుఖములే. పరమ సుఖదం అనగా పరమాత్ముడే. కేవలం జ్ఞానమూర్తిం ఏది జ్ఞానం? వస్తు జ్ఞానమా? కాదు, కాదు. అద్వైత జ్ఞానం. రెండు కాని వస్తువే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నదనే విషయమే జ్ఞానము. అట్టి జ్ఞాన స్వరూపుడు భగవంతుడు. అహంబ్రాహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, త్వమేవాహం ఈ నాలుగు వాక్యములకు అతతీమైన తత్త్వమే ఈ బ్రహ్మజ్ఞానం. గురువు కేవలం భగవంతుడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే నిజమైన గురువులు సృష్టిస్థితిలయకారకుడైన వాడే గురువు. నేను విష్ణుపూజ చేయాలా? లేక బ్రహ్మపూజ చేయాలా? లేక రుద్రపూజ చేయాలా? సెలవివ్వమని కోరాడు కేల్కరు. ఈ విధంగా అడిగేటప్పటికి ఆరె సైతాన్! నేను ఇక్కడున్నాను కదా! నాకే పూజ చేయి అన్నాడు బాబా. అనగా తానే బ్రహ్మ విష్ణు, మహేశ్వర స్వరూపుడవని, ఇలాంటి నేను గానున్న తత్త్వాన్ని పూజించుమని అన్నాడు. దీనితో షిరడీలో చేరిన వ్యక్తులందరు సాక్షాత్ పరమేశ్వరుడు షిరిడీ సాయిబాబా అని విశ్వసిస్తూ వచ్చారు.
బాబావద్ద ఉపదేశం పొందాలని ఆరాటపడుతూరాధాబాయి అనే భక్తురాలు వచ్చింది. అది వ్యాసపూర్ణిమా కాలం. మంత్రోపదేశం చేసేదాకా ఆహారం తీసుకోననిపట్టుపట్టింది. మూడు దినాలు నిరాహార దీక్ష సాగించింది. కానీ బాబా అంగీకరించలేదు. అప్పుడు శ్యామ్ రాధాబాయి పక్షాన ప్రార్థించాడు. ఉపవాసములతో ఆమె ప్రాణం కూడా పోయేటట్లున్నదని చెప్పాడు. ఆమె చనిపోతే దయా హృదయుడైన బాబా ప్రతిష్ఠకు దెబ్బతగులుతుందని చెప్పాడు. నీరస పడిపోయిన రాధాబాయిని బాబాదగ్గరకు తీసుకు వెళ్లాడు. ఎవరైనా గురువు దగ్గరకు పోయి ఉపదేశం పుచ్చుకొమ్మన్నాడు. బాబా! నేను ఇంకే గురువునూ ఎరుగను" అందామె.
గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురాస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
అనే శ్లోకానికి అర్థమేమిటని అడిగాడు బాబా. అయితే గురునామం ఎందుకు స్వీకరించరాదు? గురుముఖాన యింకొక నామం కోరటం ఎందుకు? గురువే దైవమైతే ఆయన చెప్పిన మాట తప్పకుండా, చూపించిన బాటలో నడిస్తే నామజపం చేసినంత ఫలితం సంపాదించవచ్చు. గురువును సంపాదించుకున్న తరువాత సర్వమూ ఆయనకే వదలాలి. మోక్షప్రాప్తికోసం కూడా ఆయన పైనే ఆధారపడాలి. మీకంటె మిమ్మల్ని గురించి గురువుకే ఎక్కువ తెలుసు. మీకు ఏది అత్యంత శ్రేయోదాయకమో ఆమార్గం వెంట మిమ్మల్ని నడిపించగలడు. ఆయనకు దూరంగా తీసుకుపోయే వైఖరులు నిర్మూలించి ఆయనను అనుసరించటయే మీ కర్తవ్యము. ఈ విధంగా గురువును అనుసరిస్తే మీకు భోజనం ఎట్లా వస్తుందని మీరనుకోవచ్చు. భగవంతుడు మిమ్మల్ని తిండి లేకుండా చేయడని గట్టిగా మీరు విశ్వసించండి. ప్రభువు మీకు అన్నమే కాక అమృతం కూడా అందించగలడు.
ఒక్కొక్కసారి బాబా అల్లామాలిక్! అల్లామాలిక్!" అని కేకలు వేసేవాడు. కానీ మరుక్షణంలో కృష్ణమాలిక్! రామమాలిక్! దత్తాత్రేయ మాలిక్" అని అరిచేవాడు. ఆందుచేత బాబా హిందూ మతస్థుడా లేక ఇస్లాం మతస్థుడాఅనే సందేహం బయలుదేరింది. బాబా అల్లామాలిక్ అని అరిచినప్పుడు అనేకమంది ముస్లింలు వచ్చి బాబా చుట్టూ చేరేవారు. అదేవిధంగా హిందువులు కూడా వచ్చి బాబాను ధూపదీపనైవేద్యములలో అర్చించేవారు. కనుక హిందువులు చేస్తున్న పని ముస్లింలకు, ముస్లింలు చేస్తున్న పని హిందువులకు నచ్చలేదు.
మహల్సాపతి ఖండోబా దేవాలయంలో పూజారి. అయితే ఇతనెప్పుడూ బాబావెంటనే ఉండేవాడు. ఇది మహమ్మదీయులకు నచ్చలేదు. ఒక హిందూ పూజారివచ్చి బాబాదగ్గర కూర్చున్నాడనే ద్వేషంలో ఒకనాడు మహమ్మదీయులు మహల్సాపతిని పట్టుకొని కొట్టారు. ఆ మహల్సాపతి తనను కొట్టిన ప్రతి దెబ్బకు బాబా! బాబా! అని అరుస్తూ వచ్చాడు. ఈ విధంగా అతను అరుస్తున్నప్పుడు ఆ దెబ్బలన్నీ బాబాకే తగిలాయి. బాబా బయటకు వచ్చారు. మహమ్మదీయులకు కూడా బాబాపై అమితమైన విశ్వాసముండేది. బాబా బయటకు వచ్చి ఒక్కసారిగా గర్జించాడు. సైతాన్. ఒక వైపున ప్రార్థించడం. మరొకవైపున దెబ్బలు కొట్టటం. ఇదేనా భక్తి? అన్నాడు. బాబా శరీరమునుండి రక్తము కారుతున్నది. ఈ దృశ్యము చూచిన మహమ్మదీయులు బాబావద్దకు పరుగెత్తికొని వచ్చి బాబా మిమ్మల్ని ఎవరు కొట్టారు? అని అడిగారు. ఇంతసేపు మీరేకదా నన్ను కొట్టింది. అన్నాడు బాబా. బాబా మేము మీ దగ్గరకు కూడా రాలేదే. మహల్సాపతిని మాత్రమే కొట్టాము అన్నారు. మహమ్మదీయులు. మహల్సాపతిలో ఎవరున్నారు? నేనే. అతని బాధలన్నీ నావే , అని బాబా పలుకగా మహమ్మదీయులందరూ బాబా. కాళ్ళు పట్టుకొని క్షమించమని ప్రార్థించారు. అప్పుడు బాబా మహమ్మదీయులను హిందువులను చేర్చి, నాయనలారా! మీరందరు ఒక తల్లి బిడ్డలే. ఇటువంటి కులమత భేదములను పెట్టుకోకూడదు. మతములో వెతికేవానికి మాధవుడు కనిపించడు. కులమతములన్నీ దేహమునకు సంంధించినవే. మీ హృదయములో భగవంతుని వెతకాలి అని బోధించాడు.
ఒకానొక సమయంలో షిరిడీ బాబా ద్వారకామాయియందు కూర్చున్నప్పుడు దామా, నానా అనే ఇరువురు భక్తులు పాదసేవ చేస్తున్న సమయంలో బాబా కొన్ని రాగినాణెములను అచేతి నుండి ఈ చేతికి, ఈ చేతినుండి ఆ చేతికి మార్చుకుంటూ పరీక్షగా చూస్తున్నాడు. ఏదో కనిపించి కనిపించకుండా ఉన్న దానికోసం వెతుకు తులున్నట్లుగా ఆ నాణెములను త్రిప్పి చూస్తున్నాడే గాని ఆ యిరువురితో ఎట్టి సంభాషణ జరపటం లేదు. ఒక గంట సేపు బాబా ఈ పని చేస్తూ వచ్చాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటే దామా బాబా! మీకోసం ఎంతో మంది కాచుకొని ఉంటే మీరు మాత్రం రాగిణిములతో ఆడుకుంటున్నారేమిటి? చూచిన నాణిములనే తిరిగి చూస్తున్నారు. పరీక్షించిన నాణెములనే తిరిగి పరీక్షిస్తున్నారు. ఎందుకోసం వీటినంత పరీక్షగా చూస్తున్నారు? అని ప్రశ్నించాడు.
అప్పుడు బాబా "అరె బేటా! నేను చేసిందే చేస్తున్నాను. చూసిందే చూస్తున్నాను. చెప్పినదే చెప్తున్నాను. ఆ ఎదురుగా నున్న మామిడి చెట్టును చూడు. చెట్టంతా పూసింది పూత. ఆకులే కనిపించటం లేదు. నిజంగా ఆ పూతంతా కాయలైతే చెట్టు ఉండగలదా? అట్లైతే దాని కొమ్మలన్నీ వంగి విరిగిపోగలవు. కానీ అట్లు కావటం లేదు. ఏమవుతున్నది? ఆ పూతలో కొంత గాలికి, మంచుకిపోతుంది. ఇంక మిగిలినవి కాయలుగా తయారయ్యే సరికి పక్షులు, ఉడుతలు, కోతులు మొదలైనవి వాటిని కొరికి వేస్తున్నాయి. ఈ విధంగా సుమారు తొంభై శాతము వృథా అయిన తరువాత ఏ పది శాతమో చెట్టుకు కాయలు కాస్తున్నాయి. అదే విధంగా, నా దగ్గరకు ఇన్ని వేల మంది వస్తున్నారు. కాని వీరందరు ఫలములుగా తయారౌతున్నారా! ఎంతమంది మధ్యలో రాలిపోతున్నారో, కొంతమంది ధనం కోసం, కొంతమంది విద్యకోసం, కొంతమంది వివాహములకోసం, కొంతమంది పిల్లల కోసం, మరి కొంతమంది ఉద్యోగాల కోసం. ఈ విధంగా అనేకరకములైన కోరికలతో వస్తున్నారు. వీరందరిలోదోషాలే ఉన్నాయి. వీరిలో నన్ను కోరేవారెవరూ లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క లౌకికమైన కోరికతో వస్తున్నారుగానీ, ఆత్మజ్ఞానము కోరివచ్చేవారు ఒక్కరైనా నాకు కనిపించటం లేదు. ఎంతో విలువైన నా ఖజానాకు నేను తాళం వేయకుండా పెట్టాను. కానీ దీనిని తీసుకునే వారెవ్వరు ఇంకా రాలేదు. నేను చూస్తున్న నాణెములలో చాలా అరిగిపోయినవి ఉన్నాయి. వీటిలో గుంటపడినవి, సొట్టపోయినవి, రంధ్రము పడినవి కూడా ఉన్నాయి. ఈ నాణెములలో ఏవిధముగా దోషములున్నవో అదేవిధముగా వ్యక్తులందు కూడా దోషాలున్నాయి. ఆ వ్యక్తుల దోషాలనే నేను చూస్తున్నాను. ఈ నాణెములలో ఎన్నో గుంటలు, రంద్రములు ఉన్నట్లుగా వ్యక్తులలో ఎన్నో దుర్గుణాలు, దురాలోచనలు ఉన్నాయి. ఇట్టి వారందరు నా ఫలములు భుజించగలరా? నేను కావాలని కోరుతున్నారేగాని తను మనస్సంతా ప్రకృతి పైన పెడుతున్నారు. నాకోసం తగిన ప్రయత్నం చేయటం లేదు. ఇంక నేనెట్లు లభ్యమవుతాను? ఇక్కడకు వచ్చే ప్రజలలో కోటికి ఏ ఒక్కరో నేను కావాలని ఆశిస్తున్నారు.ఇక్కడకు వచ్చే వారంతా భక్తులు కాదు. అందరిలోను అన్ని దోషాలు ఉంటున్నాయి. వారి బుద్ధులన్నీ బెండుబారి పోతున్నాయి. అంతేకాదు. పరమభక్తులమని భావించేవారు. ఇంకా కొంతమంది కాళ్ళనుండి తలవరకు అనుమానాలతో దైవత్వమును తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వీరందరు పాపులే గానీ పుణ్యులుకారు, భక్తులు కారు. ఇట్టి వారందరు నన్ను చేరగలరా?" అన్నాడు.
అదే సమయానికి అక్కడకు ఒక ఠాకూరు వచ్చాడు. అతడు వస్తూనే బాబాను ఉద్దేశించి బాబా! నాకు కావలసినంత ధనము, సిరిసంపదలున్నాయి. కుమారులు కూడా ఉన్నారు. నాకు ఏవిధమైన అసంతృప్తి లేదు. కానీబ్రహ్మజ్ఞానం కావాలనే కోరికతో ఇక్కడకు వచ్చాను. అన్నాడు. ఆ! మంచిదే. అయితే నీవు ఇక్కడ ఎంతవరకు ఉంటావు? అని బాబా ప్రశ్నించాడు. అప్పుడు ఠాకూరు నా తిరుగు ప్రయాణమునకు అయ్యే ఖర్చు కూడాబండివానికిచ్చి బండి పట్టుకొని వచ్చాను. మీరు ఇప్పుడు బ్రహ్మ జ్ఞానము నిస్తే తక్షణమే వెళ్ళిపోవాలను కుంటున్నాను. అన్నాడు. బాబా అతనిని కొంత సేపు ఉండమన్నాడు. ఇంతలో దామాను పిలిచి దామా! నాకు ఐదురూపాయలు కావాలి. వెంటనే ఊరిలోకి పోయి పటేలును అడిగి తీసుకురా! అన్నాడు. కొద్ది సేపటికి దామా తిరిగి వచ్చి పటేలు ఇంటి దగ్గర లేడు అన్నాడు. సరే అయితే షాపుయజమానిని అడిగి తీసుకోనిరా అని తిరిగి పంపించాడు. కొంత సేపటికి దామా వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. బాబా అతనిని కిళ్ళీకొట్టువాని దగ్గరకు పోయి అడగమన్నాడు. ఈ విధంగా ఐదు రూపాయల కోసం దామాను ఐదు పర్యాయములు పంపించాడు. అక్కడే నిలబడిన ఠాకూరు తనకు ఆత్మజ్ఞానం బోధించమని పలుమార్లు అడగుతున్నాడేగాని తన జేబునుండి ఒక ఐదురూపాయలనోటు కూడా తీసి యివ్వటానికి అతనికి మనసొప్పలేదు. చిట్టచివరకు బాబా ఈ ఠాకూరను చూసి, అరే ఠాకూర్ ఎదురుగానే నేను ఐదురూపాయల కోసం దామాను ఐదుసార్లు పంపించాను. నీ జేబులో నున్న ఐదురూపాయల నోట్లు బాగా కనిపిస్తున్నాయి. ఒక్కటైనా తిసి యివ్వలేక పోయావు. ఓరి పిచ్చివాడా! ధనం పైన ఇంత ఆశ ఉన్నవానికి దైవం పైన ఇష్టం కలుగుతుందా? ధనం పైన ఆశ ఉంటే ధనం వెంబడే వెళ్లు, వెంటనే టాంగా ఎక్కి వెళ్ళిపో! అన్నాడు. కానీ రాకూరు అక్కడ నుండి కదలలేదు. వెంటనే బాబా కట్ట తీసుకున్నాడు. జావో సైతాన్. ఇటువంటివాడవు ఇక్కడకెందుకు రావాలి? ఆశించేది బ్రహ్మజ్ఞానం, కాని నీ మనస్సు నిండా ధనధాన్యం. తక్షణమే ఇక్కడ నుండి నీవు వెళ్ళిపో. త్యాగేనైకే అమృతత్వ మానశుః త్యాగము చేయని వానికి ఆత్మజ్ఞానము ఎన్నోవేల మైళ్ల దూరంలో ఉంటుంది. ఈనాడు నీవు కేవలం ఐదు రూపాయలివ్వటానికి బాధపడుతున్నావు. కానీ, ఇవన్నీ ఏదో ఒకప్పుడు నీవు వదిలి పెట్టి పోవలసిందే. ఆనాడు ఏమి చేయగలవు? ఈ సత్యాన్ని గుర్తించు. ఇదే నిజమైనఆత్మజ్ఞానము అన్నాడు. ఈ విధమైన ప్రబోధములచేత భక్తుల మనస్సులలో మార్పులు కలుగుతూ వచ్చాయి.
(షిపు.17/29)
షిరిడీకి బాబా వెళ్ళినప్పుడు ఏమీ లేదు. పాడుబడిన మసీదు మాత్రమే ఉండేది. అక్కడ చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది. దానికి ఒకవైపు మాత్రమే నీడ ఉండేది. కొమ్మ ఆలా పెరిగింది. ఈ వేపచెట్టు నీడలో కూర్చొని సేద తీర్చుకొనే వాడు బాబా. ఎంతో శ్రమపడి భిక్షకు వెళ్ళివచ్చి అదే నీడలో కూర్చొనేవాడు. తరువాత లక్ష్మీబాయి అల్లుడు చిన్న మండపం కట్టించాడు. ఇన్ని సంవత్సరములు నాకు చల్లని నీడ నందించి ఎంతో ఉపకారం చేసిన ఓ వృక్షమా! నాకు హాయిని ఆనందమును అందించిన ఆ కొమ్మ ఎప్పుడూ మధురముగానే ఉండుగాక" అన్నాడు. అందువల్లనే ఆ ఒక్క కొమ్మ ఆకులు తీయగా ఉంటాయిగానీ మిగతా కొమ్మల ఆకులు తీయగా ఉండవు. అనగా ఉపకారము చేసే వారికి ఫలితం ఎప్పుడూ ఉపకారముగానే ఉంటుంది. మనము చేసిన ఉపకారము ఎప్పటికీ వృథా కాదు. తక్షణమే ఫలితం రాదని విచారమునకు గురికాకూడదు. కొంతకాలమైతే తప్పక ఫలితము వస్తుంది.
షిరిడీలో మహల్సాపతి ప్రతి దినము బాబాతోఅదే రూములో నిద్రించేవాడు. ఒక చావడి ఉండేది. ఆ చావడిలో ఒక చిన్న పలక కట్టుకొని ఆ పలకపై పవళించేవాడు బాబా. ఆ పలక వెడల్పు ఐదు ఇంచిలు మాత్రమే. ఆజానుబాహుడైన, మంచి ఎత్తైన మనిషి బాబా. దానిపై పవళించేవాడు. వేరే స్థలము లేదు. దాని క్రింద మహల్సాపతి పడుకునేవాడు. ప్రథమంలో మహల్సాపతికి భయం. ఆ పలకను బాబా పాతపంచలతో వ్రేలాడ కట్టేవాడు. ఎప్పుడు తెగుతాయో ఏమిటో! మహల్సాపతి సన్నంగా ఉండేవాడు. క్రింద పడుకుంటే అంత పెద్ద మనిషి నా పై పడితే నేను బ్రతగ గలనా? అని భయపడిపోయేవాడు. రాత్రంతా నిద్రపోయేవాడు కాదు. ఎక్కడ కొంచెము శబ్దమైనా పరుగెత్తిపోయేవాడు. తన దైవత్వమును మహల్సాపతికిమాత్రమే నిరూపిస్తూ వచ్చాడు బాబా. ఒకనాటి రాత్రి బాబా చోటాభాయ్! లే అన్నాడు. మహల్సాపతిని చోటాభాయ్" అని పిల్చేవాడు. మహల్సాపతి లేచి చూడగా పాతపంచలా మోసేది? కాదు, కాదు. నాశక్తియే అన్నాడు. అప్పుడు మరల చెప్పాడు. మహల్సాపతీ! ఎవరికి నీవు చెప్పవద్దు, ఆందరు నేను బ్రాహ్మణుడననీ, మహమ్మదీయుడనని మరికొంతమంది పటేలునని ఈ విధముగా భావిస్తున్నారు. పత్రి గ్రామములో దేవగిరమ్మ, గంగాభవారియా అనేబ్రాహ్మణ దంపతులకు పుట్టిన వాడను నేను. ఈ మర్మము ఎవ్వరికీ చెప్పవద్దు. ఎందుకనగా ఆనాడు మహారాష్ట్రంలో హిందూ మహమ్మదీయులకు ద్వేషము ఏర్పడి ఒకరినొకరు చంపుకోటం జరిగేది. ఇది మంచిది కాదు. మహమ్మదీయులలో మహమ్మదీయుడను. హిందువులలో హిందువుడను. నన్ను హిందువని చెప్పవద్దు. మహమ్మదీయుడని చెప్పవద్దు అని మహల్సాపతితో మాట తీసుకున్నాడు. ఈ విధమైన కొన్ని రహస్యాలు ఎవరో ఒకరిద్దరికి మాత్రమే చెబుతూ వచ్చాడు. ఏ అవతారమందు అందరికీ తెలిసేది కాదు. రామావతారమందు లక్ష్మణునికి తప్ప మరెవరికీ చెప్పలేదు తనతత్వము, కృష్ణావతారమందు బలరాముడు ఎప్పుడూ ఉండేవాడే. కానీ కృష్ణునకు పరమమిత్రుడు ఉద్దవుడు నీడవలె ఉండేవాడు. తానెప్పుడు దేహాన్ని వదిలేది ఉద్దవునికే చెప్పాడు. అందరికీ చెప్పటానికి వీలుకాదు. దైవతత్త్వము అందరికి అర్థము కాదు.
(షిపు 30/31)
శ్యామ్ తల్లిదండ్రులు రిటైరైన తరువార శ్యామ్ ను షిరిడీ తీసుకు వచ్చారు. తల్లిదండ్రులు రిటైరైనందువల్ల షిరిడీలోనే నివసించేవారు. శ్యామ్ అక్కడే ఒక స్కూలులో టీచరుగా నియమింప బడ్డాడు. సాఠే పోయిన తరువాత క్రమక్రమేణా శ్యామ్ ను దగ్గరకు తీశాడు బాబా. శ్యామ్ పగలంతా పాఠములు చెప్పటం క్లాసులైన తరువాత క్లాసురూంలోనే పడుకోవటం. ప్రక్కరూంలోనికి చూస్తూ ఉండేవాడు శ్యామ్. బాబా తనలో తాను మాట్లాడుకోటం, తనలో తానునవ్వుకోవటం. తనలో తాను అనేక చర్యలు చేయటం చేస్తూ ఉండేవాడు. బాబాతాను పండుకునే పలకను పైన రెండు తాళ్ళతో కట్టాడు. అది సన్నటి చెక్క. ఆ చెక్క పైన పడుకొని ఊగుతూ ఉండేవాడు. అందుకే శ్యామ్ కు భయము. నిద్రలో క్రింద పడిపోతారో యేమో! చిన్న పలక కదా! అని దినమూ చింతిస్తూ ఉండేవాడు. ఒకనాడు బాబా పాదములు వత్తుతూ ఉండగా స్వామీ! రాత్రంతామీరు నిద్రపోవటం లేదే. ఏదో నవ్వుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నారు. దీని అంతరార్థము చెప్పాలని ప్రార్థించాడు. పిచ్చివాడా! నీవు ఒక్కడివేనా ఉండేది లోకములో? ఎంతమందోనా కోసం ప్రార్థిస్తున్నారు. వారందరితో మాట్లాడుతున్నాను అన్నాడు. నా వ్రేలు త్రిప్పటమంటే మనస్సు త్రిప్పటమే. వారితో మాట్లాడటమే నా పెదవులు చేసేపు. వారి యొక్క పిచ్చితనాన్ని చూచి నవ్వటమే నా సరదా. ఇవన్నీ భక్తులకోసం చేసే చర్యలే నాయనా" అని సమాధానం చెప్పాడు.
బాబాకు కోపం లేదుకాని ప్రదర్శించేవాడు. కోపంవస్తే పదడుగుల దూరంలో ఉండినా కఱ్ఱ తీసుకొని వారిపై విసిరేవాడు. ఒకరోజా తిరిగి శ్యామ్ ప్రశ్నించాడు. స్వామీ ఇంత కోపంగా వారిని కొడుతున్నారే. వారికి ఏమైనా ప్రమాదం కలిగి ప్రాణం పోతే మీకు అపకీర్తి వస్తుంది కదా! అని. అరె సైతాన్! భైఠో. ప్రాణం నా చేతిలో ఉంటున్నది. నేను పంపిస్తే కదా వాడు పోయేది. కాబట్టి నేను పోకుండా చూచుకుంటాను. నీవు నీపని చేయి. అన్నాడు. నీకెందుకీ విషయంలో విచారము? ఈ రకమైన నటన నేను చేసినప్పుడే వాడు సరైన స్థితికి వస్తాడు. మంచిగా పోతే నాతలపై కూర్చుంటాడు. కనుకనే కఠిన పదములచేతను, కఠిన వాక్యముల చేతను, కొంతవరకు వారిని బెదిరించి అదలించి పనిచేయించాలి. కార్య నిమిత్తమై నేను కోపము నటిస్తామగాని నాకు కోపం లేదు అని ఒక శ్యామ్ కే లోపలున్న రహస్యం చెప్పాడు. అతనితో సేవలు చేయించుకుంటూ కాలము గడుపుతూ వచ్చాడు.
(షిపు.33/34)
బాబా ఎవరు వచ్చినా ముందు దక్షిణ తీసుకొనేవాడు.మరీ అధికంగా కాదు. సాధారణంగా రెండు రూపాయలు దక్షిణ అడిగేవాడు. ఎందుకోసమంటే, ఒకటి భక్తి రెండవది శ్రద్ధ. ఈ రెండూ నాకు ఇవ్వండి అనేవాడు. ఈ రెండూ విత్తనములలో రెండు బద్దల వంటివి. రెండు బద్దలూ చేరినప్పుడే మొక్క వస్తుంది. బద్దలు వేరువేరైనప్పుడుమొక్కరాదు. భక్తి, శ్రద్ధ రెండు బద్దలవలె చేరిపోవాలి. అప్పుడే ఆనందమనే మొక్క ఆవిర్భవిస్తుంది.
అక్కడ తీసుకున్న దక్షిణ అక్కడే వారి ఎదురుగానే యిచ్చేవాడు బాబా, ఒక్కటీ తన దగ్గర ఉంచుకునే వాడు కాదు ఒకనాడు ప్రధాన్ అనే వ్యక్తి వచ్చాడు. అతను బాబాకు ఇరవై రూపాయలివ్వాలనుకున్నాడు. ఆనాడు అన్నీ నాణెములే. వెండి రూపాయలుండేవి. ఇంత చిల్లర ఎలా యిచ్చేదని ఒక బంగారు నాణెము (సవర) తీసుకొని యిచ్చాడు. దానిని బాబా అటు యిటు తిప్పిచూచాడు. ప్రక్కనున్నవాడు ఇది బంగారు నాణెం అన్నాడు. దీనికి ఎన్ని రూపాయలు? అడిగాడు బాబా, సవరకు పదిహేను రూపాయలని చెప్పాడు.అప్పుడు బాబా ప్రధాన్! ఇంకా ఐదు రూపాయలు రావాలి అన్నాడు. అతను జడ్జి ఏమిటి? సవరకు పదిహేను రూపాయలు. సరిగానే యిచ్చానే. ఎందుకిలా డగుతున్నారు? అని అనుమానం బయలు చేరింది. మొదట ఐదురూపాయలిచ్చి తరువాత యోచన చేయి అన్నాడు బాబా. నీవు ఇంటి దగ్గర ఏమనుకొని వచ్చావు? ఇరవైరూపాయలు యివ్వాలనుకున్నావు. ఇప్పుడు పదిహేను రూపాయలే యిచ్చావు. ఇంకా ఐదు రూపాయలు రావాలి కదా! ఇవ్వు అన్నాడు. దానితో ఆ
జడ్జి నిర్ఘాంతపోయాడు. సరైన జడ్జి బాబాయే అనుకున్నాడు. ఈ విధంగా వచ్చినవారి దగ్గర డబ్బు తీసుకోవటం అప్పటికప్పుడే బీదవారికి ఇచ్చివేయటం బాబాకుఅలవాటు.
షిరిడీలో బాబా కేవలం ఉపన్యాసాలతో జ్ఞానబోధ చేయలేదు. ఎందుచేతనంటే ఆనాటి వాతావరణము ఆవిధంగా ఉండేది. సాయి ప్రేమమయుడు. ఆయనలో కోపముగానీ ద్వేషముకానీ లేవు. దీని కెన్నియో ఉదాహరణలున్నాయి. ఒకానొక సమయంలో దాదాసాహెబ్ భార్య తన బిడ్డను తీసుకొని షిరిడీలో కొన్నిరోజులుండాలని వచ్చింది. ఆ సమయంలో అక్కడ ప్లేగు వ్యాధి అధికంగా ఉండేది. షిరిడీలో ఆ బిడ్డకు జ్వరం వచ్చింది. ఒళ్ళంతా పెద్ద పెద్ద బొబ్బలు వచ్చాయి. ఆ బిడ్డను అక్కడ వదలి ఆమె మసీదుకు వెళ్ళి బాబా!బాబా! అని దీనంగా ప్రార్థించింది. ఏమి వచ్చావు? నీ బిడ్డకు జ్వరం వచ్చి బొబ్బలు పుట్టాయా? నీబిడ్డకే కాదు, నాకు కూడా ఉన్నాయి. అని తన చొక్కా తీసి చూపించగా అక్కడ పెద్ద పెద్ద బొబ్బలు కనిపించాయి. అప్పుడు మహల్సాపతి కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు బాబాకు 105/106 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు జ్వరం వచ్చింది. అయ్యో పాపం! నా కుమారునికే కాక మీకు కూడా వచ్చిందా! తమను రక్షించే వారెవరు? అని చింతించి, వెంటనే సర్వజీవరక్షకుడవైన నిన్ను రక్షించేవారు ఇంకొకరున్నారా స్వామీ! నా అపరాధము క్షమించు అని లెంపలు వేసుకొంది. మరి కొంత సేపటికి జ్వరం తగ్గిపోయింది. ఆమె ఆనందముతో ఇంటికి వచ్చి చేసేసరికి తన బిడ్డకు జ్వరం లేదు. బొబ్బలు లేవు. బాబా! నాబిడ్డ బాధను నీవు స్వీకరించి రక్షించావా అంటూ ఆమె కృతజ్ఞతలు తెలుపుకొంది.
పిళ్ళెయని ఒక డాక్టరు. ఆతడు బాబాయెడ సద్భావము కలవాడు కాదు. వారి మహిమలను గూర్చి ఛలోక్తులతో విపరీత ప్రసంగములను అప్పుడప్పుడు చేస్తుండేవాడు. కొంతకాలానికి అతనికి పరిణామ శూల ఏర్పడి చాల బాధింపజొచ్చింది. తనకు తెలిసిన మందులన్నీ వాడి చూశాడు. పెద్ద పెద్ద డాక్టర్ల వద్ద చికిత్స చేయించుకున్నాడు. బాధ తగ్గలేదు. అది అంతకంతకు అధికమైంది. ఆ బాధ భేరింపలేక ఆత్మహత్య తప్ప దీనికి మందే లేదనే నిశ్చయానికి వచ్చాడు. అట్టి స్థితిలో అతని ఆప్తమిత్రుడు, బాబా భక్తుడు అయిన కాకాసాహెబ్ అయ్యా! నీ అహంకారం తగ్గించుకొని బాబా పాదములపై పడు. నీ బాధ తొలగిస్తారిని బోధించాడు. బాధ కోర్వలేక బ్రతుకు మీద ఆశచేత అతడు బాబాను దర్శించి పాదాలపై బడిమ్రొక్కి లేచి వినమ్రుడై నిల్చున్నాడు. బాబా ఒక్క నిముష మాతని జూచి చిరునవ్వుతో ఏమోయీ! పరిణామశూలతో బాధపడుతున్నావా? భయపడకు భగవంతుని నమ్మి ధ్యానించుకో. ఆ బాధ నీజోలికి రాదు అని ఉపదేశించి ప్రసాదమిచ్చి పంపివేశాడు. ఆనాటితో ఆ బాధ అతణ్ణి వదలిపోయింది. ఎక్కడికి పోయింది? దానిని బాబా తీసుకున్నాడు. అది వారి ఆజ్ఞమేరకు కొన్ని దినములుండిన తరువాత తన దారిని తాను పోయినది.
ఈ విధంగా బాబా ప్రతివిషయానికి ఎప్పటికప్పుడే ఫలితాలను చూపించాడు. దీనికి కారణం ఆనాటి పరిపూర్ణ విశ్వాసమే. వారు బాబా మాటలను తు.చ. తప్పకుండా పాలించేవారు. కానీ ఈనాడు అదిలేదు. ఏదైనా చెబితే దానికి పది ప్రశ్నలు వేస్తారు. ఇది ఈనాటి విద్య యొక్క ప్రభావమే. ఈనాటి మానవుడు ఏ ఉపకారము పొందినప్పటికి మహా క్రూరుడుగా, కృతఘ్నుడుగా మారిపోతున్నాడు. మంచిని మరచిపోయి చెడును మాత్రం హృదయంలో పెంచుకుంటున్నాడు. కనుక మానవునియందు అసురత్వం పెరిగిపోయింది. ఏది కోరినా స్వార్థమే. తన కోరిక తీరిన బాబా బాబా!! యని నవ్వుతూ వస్తారు. లేనిచో పూర్తిగా మారిపోతున్నారు. ఇంతటిక్రూర మృగాలుగా మారితే మానవత్వంలో బాబా భక్తి ఏవిధంగా అభివృద్ధి కాగలదు? ఈనాడు ఆకారము మానవునిగా ఉన్నదిగా ప్రవర్తన మాత్రం మృగమువలె ఉన్నది.
షిరిడీలో ఒకానొక సమయంలో (1916) పెద్ద తుపానువచ్చింది. భరించుకోలేకపోయారు షిరిడీ ప్రజలు, వడగళ్ళు రాళ్లవలె కొట్టేస్తున్నాయి. పనిచేసేవారు, పల్లె ప్రజలు అందరు ద్వారకామాయికి పరుగెత్తి వచ్చారు. ద్వారకామాయి చిన్నదిగా ఉంటున్నది. ఎక్కడ స్థలం చిక్కితే అక్కడంతా ప్రవేశించారు. అందరూ బాబా! రక్షించండి. రక్షించండి అన్నారు. ద్వాపరయుగంలో ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపించినప్పుడు ఆ గోపికలు గోపాలురు వెళ్ళి ఓ కృష్ణా! కాపాడు, కాపాడు అని ప్రార్థించినట్లుగా షిరిడీ ప్రజలందరు బాబాను ప్రార్థించారు. అప్పుడు బాబా అచ్ఛా దేఖేగాదేఖేగా అని ముందుకు పోయాడు. స్తంభాన్ని పట్టుకు కొట్టాడు. అయ్యా! చాలు ఇంక రౌద్రము శాంతించు, ఎక్కువ క్రోధము ఉపయోగ పెట్టావు. అందరూ నీకు భయపడి పోయారు. నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు. నీవు అధిక ప్రతాపాన్ని ప్రదర్శించకు. చల్లబడు అన్నాడు. క్షణంలో తుపాను ఆగిపోయింది.
ద్వారకామాయిలో అగ్నిగుండము (ధుని) ఉంటున్నది. ధునిలో కట్టెలు వెయటం సాంప్రదాయం. భక్తులు ధునిలో కట్టెలు వేస్తే మంచిదని, అందులోను ఆడవారికి పిచ్చిభక్తి, కాబట్టి కట్టెలు కొని మరీ వేసేవారు. ధునిలో కట్టెలు వేశామని తృప్తి పడేవారేకాని దానివల్ల ఆ మసీదు ఆ మంటలను భరించగలదా! అని ఆలోచించేవారు కాదు. అందులో కట్టెలు వేయటం వారికి తృప్తినిచ్చేది. ఒకరోజు కొంత సేపయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైంది. శ్యామ్ వచ్చాడు. దాదా, దాదా అని పిల్చాడు. క్యా హోగయా? అన్నాడు బాబా, దేఖో! అగ్ని
హోత్రుడు ప్రత్యక్ష మయ్యాడు. చూచేవారెవరున్నారు. ఇక్కడ ఎవరూ లేరు. ఎవరూ లేనప్పుడు నీ ప్రతాపము ఎందుకు చూపుతావు? నీకు బుద్ది చెప్పేవారు లేక పోతున్నారు. అనవసరమైన దగ్గర ని ప్రతాపమెందుకు? అని స్తంభాన్ని పట్టుకొని కొట్టాడు బాబా, క్షణములో అగ్ని చల్లారిపోయింది.
(షిపు 35/38)
షిరిడీ బాబాను కొంతమంది పిచ్చివాడని భావించేవారు. మరికొంత మంది ఇతడొక
ఫకీరని విశ్వసించేవారు. భగవంతుడు పిచ్చివాడను కొన్నవారికి పిచ్చివాడుగనే కనిపిస్తాడు. ఫకీరనుకొన్నవారికి ఫకీరుగానే కనిపిస్తాడు. ఒకానొక సమయంలో బాబా ఆప్పా కులకర్ణి అనే వానిని పిలిచి తన జేబులో నుండి రెండు కాసులు తీసి యిచ్చి నీవు వెళ్ళి నానాను తీసుకొని రా! అన్నాడు. అప్పుడు నానా తహసీల్దారు పనిచేసేవాడు. ఆకాలములో తహసీల్దారు అంటే అందరికీ అమిత గౌరవం. అంతేకాక నానా గొప్ప విద్యావంతుడు. మంచి పర్సనాలిటీ గలవాడు. అందుచేత అతనికి ఆహంకారం కూడా అధికంగా ఉండేది. ఈకులకర్ణి నానాను కలుసుకొని బాబా మిమ్మల్ని తీసుకు రమ్మన్నారు. అన్నాడు.
ఛీ! ఎక్కడో ఎవరో ఒక ఫకీరు నన్ను రమ్మంటే నేను రావాలా! నీకు బుద్ధి లేదా? వెళ్ళిపో అన్నాడు. కులకర్ణి తిరిగి వచ్చి ఈ మాటలు బాబాకు చెప్పాడు. కానీ బాబా నేను నానాను చూడాలి. నేను నానాను చూడాలి అని అనేక పర్యాయములు పిచ్చివానివలె పలవరిస్తున్నాడు. అప్పుడు కులకర్ణి ఏమిటిది? ఈ నానా నన్ను కూడా అవమానపరుస్తున్నాడే ఇంత అహంకారియైన నానాను చూడవలసిన అవసరం ఏమిటి? అతనిపై బాబాకు ఎందుకింత ఆప్యాయత? అని యోచించాడు. కానీ అర్థం చేసుకోలేక పోయాడు. కడపటికి నానా కాళ్ళు పట్టుకొని బాబా నిన్ను చూడాలని ఆశిస్తున్నారు. మీరు తప్పక రావలసిందే అని ఏడ్చాడు. అప్పుడు నానా నీవు బాధపడుతున్నావని వస్తున్నానుగాని బాబాను చూడటానికి కాదు. అతణ్ణ చూడవలసిన అవసరం నాకు లేదు అని పలికి షిరిడీ వచ్చాడు. కాని బాబాకు నమస్కారం చేయలేదు. కనీసం చేతులైనా కట్టుకోలేదు. నేను అధికారిని, నీవు బికారివి. నాతో నీకేమి పని. ఎందుకు నన్ను రమ్మన్నావు? అని ప్రశ్నించాడు.
నానా ఎన్నిసార్లు కబురు చేసినా ఎందుకు రాలేదు? నాకు నీకు యిప్పుడు కాదు సంబంధము. నీవు మరచి పోయావు. నాకు ఎరుక ఉంది. దగ్గరకు రా అన్నాడు బాబా. నన్ను క్రింద కూర్చోమంటున్నాడే అని చాలా యిబ్బందిగా ఉన్నాడు లోపల. ఇంతమందిలో బాబా మాట వినకపోతే అవమానమవుతుందని దగ్గరకు వచ్చాడు. ఆయన చేసే తప్పులన్నీ చెప్పాడు బాబా. తహసీల్దారుగా ఉన్నావు. గవర్నమెంటు భూములు స్వంతం కోసం ఉపయోగపెడుతున్నావు. ఇది మంచిది కాదు. ప్రజలను సరైన స్థితిలో పెట్టేందుకు ఈ ఉద్యోగం వచ్చింది. నీవు చేస్తున్నది చాలా తప్పు అన్నాడు బాబా. ఇలా చెప్పటంతో నానా అనుకున్నాడు. ఈయన బికారి కాదు. చాలా గొప్పవాడు! అని "పైవారం రా అన్నాడు బాబా.
తరువాత వారం వచ్చాడు నానా. బాబా వేదాంత విషయాలుమాట్లాడుతున్నాడు. అక్కడున్న వారిలో, నానా మంచి వయస్సులో ఉన్నాడు. ఈ లోపల ఒక ముస్లిం దంపతులు వచ్చారు. వారు చిన్న వయస్సు వారే. ఆమె ముసుగు వేసుకు వచ్చింది. ముస్లింలకు అది సహజం. ముఖం కప్పుకుంటారు కానీ నమస్కారం చేసినప్పుడు గాలికి ముసుగు లేచిపోయింది. ఆమెను చూచాడు నానా, కళ్లార్పకుండా. ఊరకే చేస్తున్నాడు ఆమెవైపు బాబా కనిపెట్టాడు. "కన్నులను చూడటానికి యిచ్చినది నిజమేగాని కన్నులు చూచినాయని బుద్ధిని పెడమార్గం పట్టించటం తప్పు.చూచేది కన్నులు. బుద్ధిని ఎందుకు మారుస్తావు? భగవంతుడు కన్నులు చూచేందుకిచ్చాడు. తప్పులేదు. కాని బుద్ధిని పెడమార్గం పట్టించటం తప్పు!" అన్నాడు. ఇంతమందిలో ఈ రకంగా అవమానం చేశారని నానా చాలా బాధపడ్డాడు. బాబా! ఇంతమందిలో నన్ను అవమానం చేయవచ్చునా? అని అడిగాడు. యువకులకు గుంపులో అవమానము చేస్తేనే బుద్ధి వస్తుంది. ఒంటరిగా ఏమి చెప్పినా వినరు. చిన్న ఉదాహరణ:నీ రూములో నీవు కూర్చుని పాత పంచ, బనీను వేసుకొని ఇల్లు శుభ్రం చేసుకుంటుంటే సిగ్గుపడవు. కాని ఎవరైనా వచ్చి చూస్తే మంచి బట్టలు వేసుకొని వస్తావు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ డ్రస్సులో నైనా ఉంటావు. అక్కడ అభిమానం లేదు. పదిమందిని చూచేటప్పటికి అభిమానపడుతున్నావు. అభిమానపడినప్పుడు చెడ్డను దూరం చేసుకుంటావు. మంచిని దగ్గర చేర్చుకుంటావు. పదిమందిలో చెబితే మంచి భావములు అలవర్చుకుంటావు. లేకపోతే యింకొకసారి బయటపెడతానేమో ననే భయం ఉంటుంది. అదే పాపభీతి. పాపభీతి ఉన్నప్పుడే దైవ ప్రీతి అభివృద్ధి చేసుకుంటావు. దైవప్రీతి ఉంటే సంఘనీతి పెరుగుతుంది అన్నాడు బాబా.
మరల తరువాత వారం కూడా వచ్చాడు నానా, బేటా బైఠో" అన్నాడు బాబా. "నానా కూర్చున్న తరువాత బాబా అతనిలో నానా! ప్రస్తుత జన్మలో నీకు, నాకు సంబంధము లేదు. కానీ పోయిన జన్మలో మనిద్దరికి చాలా సన్నిహితసంబంధముంది. అందుచేత నిన్ను చూడాలని ఆశించాను" అని బాబా లేచి తన హస్తమును నానా కన్నులపై పెట్టాడు. అప్పుడు నానాకు పూర్వం తానెవరో, బాబా ఎవరో స్పష్టంగా కనిపించింది. తక్షణమే బాబాకు సాష్టాంగనమస్కారము చేశాడు. బాబా! నన్ను క్షమించండి. మీకు తెలిసినా తెలియని వారిలా ఉంటారు. మాకు తెలియకపోయినా తెలిపినట్లు నటిస్తాము" అన్నాడు.
అప్పటినుండి నానా బాబాకు అత్యంత సన్నిహితుడుగా మారి పోయాడు. బాబాకు హుక్కా నానాయే అందించేవాడు. ఛీ! ఈ పిచ్చివాని దగ్గరకు రావలసిన అవసరమేమిటి నాకు" అని బాబాను నిందించిన నానా, చివరకు బాబాయే తన ఆరవప్రాణంగా విశ్వసించాడు. బాబా లేక నానాగాని, నానా లేక బాబాగాని భోజనం చేసేవారు కారు. ఆయన లేకుండా ఈయన భోజనం ఎందుకు చేయకూడదు." అని కొందరు విమర్శించేవారు. ఆది నా ఇష్టం మీరెవరు చెప్పేందుకు నానా ఉంటేనేభోజనం చేస్తాను అనేవాడు బాబా. ఎవరే జన్మలో ఏవిధంగా ఉండేవారో, ఈనాడు ఈ జన్మ ఏరీతిగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కొందరికి ఎట్టి కారణములూ లేకుండానే కార్యములు జరుగుతుంటాయి. వారు ఆశించకపోయినా భగవంతుడే వారిని తన దగ్గరకు లాక్కుంటాడు. దీనికి కారణం పూర్వజన్మ కర్మ ఫలితమే. నిన్న విత్తనము లేక ఈనాడు మొక్క రావటానికి వీలులేదు కదా! అనేక జన్మల సంస్కారము ఒక్క జన్మలో ఫలించవచ్చు. మీరు ఏ జన్మలో ఏవిధమైన రూప నామములు ధరించారో చెప్పలేరు. కారణం ఏమిటి? ఈ జన్మలోని రూపనామములపై మీకు గల అభిమాన మమకారముల చేత పూర్వజన్మలోని రూప నామములను మీరు పూర్తిగా మరచిపోతుంటారు.
ఒకానొక సమయంలో భక్తుడైనానానా కుమార్తె మీనా ప్రసవవేదనతో బాధపడుతోంది. జామ్నేరులో, మూడు నాలుగు దినములైపోయింది. చాలా నీరసించింది. ఆమె ప్రాణము ఉంటుందో లేదో అనే సందేహస్థితి వచ్చింది.సూరు సంవత్సరముల క్రితము ఎట్టి వైద్యమూ ఎట్టి ఆసుపత్రులు, నర్పులూ ఉండేవారు కాదు. నానా నిరంతరము బాబా పటము దగ్గర బాబా, బాబా, బాబా నా కుమార్తెను రక్షించు . అని ప్రార్థించాడు. భక్తుడు ఎక్కడ ఏ విధముగా ప్రార్థించినా భగవంతునికి ఒక కనెక్షను ఉంటున్నది. వైర్ లెస్ కంటే ఎక్కువ వేగముతో చేరుతుంది. భక్తునికి, భగవంతునికి హృదయం నుండి హృదయానికి సంబంధము. తక్షణమే బాబాకు తెలిసింది. అక్కడ రాంగిర్ బాపూ అని ఉండేవాడు. అతనిని బాబా బాపూ అనిపిలిచే వాడు. బాపూ! రా. ఈ విభూతి తీసుకొని జామ్నేరు గ్రామములో నున్న నానాకు అందించు అన్నాడు. ఆజ్ఞ అన్నాడు బాపూ. జేబులో చూచుకున్నాడు. రెండు రూపాయలున్నాయి. జలగాం వరకు రైలులో పోవచ్చు. జామ్నేరు పోవటానికి అతని దగ్గర డబ్బులు లేవు. బాబా! నాదగ్గర కాసులు లేవు. నన్ను ఎలా వెళ్ళమంటారు? అని అడిగాడు. ఒరే! పిచ్చివాడా! నేను చూచుకుంటాను పొమ్మన్నాడు. నీకు పని ఎప్పుడు చెప్పానో దానికి తగిన సదుపాయములు నేను చూసుకుంటాము. సందేహములకు చోటివ్యకు అన్నాడు. అట్లే రామావతారమందు రాముడు హనుమంతుని ఆజ్ఞాపించాడు. హనుమా! నీవు సీతాన్వేషణ చేయాలి అని. సీతాన్వేషణా సమయంలో తాను అంత పెద్ద సముద్రమును దాటగలనా? అని హనుమంతుడుమొదట కొంత సందేహించాడు. కానీ ఆజ్ఞాపించిన భగవంతుడే ఈ కార్యములో అన్ని చూచుకుంటాడనే ధైర్యముతో వెళ్లాడు. అతనది పరిశుద్ధమైన విశ్వాసము. అచంచలమైన విశ్వాసము. బాపూ కూడా మొదట సందేహముతో ప్రశ్నించాడు. బాబాను, నాదగ్గర రెండు రూపాయలున్నాయి. నేను అంత దూరము ఎట్లా పోవాలి? జలగాం నుండి ముఫ్పైమైళ్ళు పోవాలి. ఆరోజులలో టాంగాలు మాత్రమే ఉండేవి. ముఫ్పై మైళ్ళు టాంగాలో వెళ్ళాలి లేక నడిచి వెళ్ళాలి. ముఫ్ఫైమైళ్ళు నడవగలనా? అని సందేహిస్తుండగా బాబా ధైర్యము నిచ్చాడు. నామాటలు విశ్వసించు. నా ఆజ్ఞ శిరసావహించు. నీవువెళ్లు అన్నాడు. జవాబు చెప్పకుండా జలగాం వరకు రైల్లో వెళ్ళాడు.రాత్రి ఒకటిన్నర గంటలకు జలగాం చేరాడు. నేను ఎక్కడికి పోయేది ఈ చీకటిలో? ఏవిధముగా కాలము గడపాలి? అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబాను ప్రార్థించాడు. ఒక బిళ్ల జవాను వచ్చాడు. పాత కాలములో తహసీల్దారు వెంట బిళ్ల వేసుకొని జవాను ఉండేవాడు. ఆ జవాను ఆజానుబాహుడు. ఎవరండీ బాపూ, ట్రైనులో దిగారు. షిరిడీ నుండి అని కేకలు వేసుకుంటూ వచ్చాడు. బాబా పంపితే వచ్చాను. నా పేరు బాపూ అన్నాడు రండి రండి. మీకోసం టాంగా కాచుకొని ఉంటున్నది అన్నాడు. ఎక్కడ నుండి వచ్చినది? అడిగాడు. నానా సాహెబు పంపించారు" అన్నాడు. టాంగాలో కూర్చున్నాడు. తాను కూర్చుంటే టాంగా నడచినట్లేలేదు. అంత స్పీడుగా పోతున్నది.తనలో అనుకుంటున్నాడు ఎంత స్పీడుగా పోతున్నదని. ఈ విధంగా తలచు కుంటుంటే గ్రామము వచ్చింది. “అదే నానా ఇల్లు అని చూపించాడు. ఆయన దిగాడు. ముందుకు నడచి తిరిగి టాంగావానితో చెబుదామని వెనుకకు తిరిగాడు. టాంగా లేదు. టాంగా నడిపేవాడూ లేడు! సరే ఇంటికి వచ్చి చేరాడు. నానా సాహెబ్ గారూ! ఇదిగో బాబా విభూతి పంపించారు. ఎప్పుడు పంపారు? నిన్న సాయంకాలమే పంపారు.
రాత్రి ఒకటిన్నర గంటలకు స్టేషను చేరాను. మీకు ఎట్టా తెలిసిందో ఏమిటో! మీరు టాంగా పంపటం చేత శీఘ్రంగా మీయిల్లు చేరగలిగాను" అన్నాడు. నానాకు ఆశ్చర్యం వేసింది. నా దగ్గర టాంగా లేదే? నేను ఎవరిని పంపలేదే!! మీరు వచ్చే విషయం నాకు అసలు తెలియదే!! ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు? ఆ టాంగా ఎక్కడుంది చెప్పమన్నాడు. అయ్యా! దిగిన వెంటనే టాంగా కనిపించలేదు. అతను మీరు పంపినట్లు చెప్పాడు. అన్నాడు. మాటలకు సమయము కాదు మొట్టమొదట పేషెంటు ఊది ఇవ్వాలని లోపలకు వెళ్లి ప్రసాదము ఇచ్చాడు. బాబా పటము దగ్గరకు వెళ్లి ప్రార్ధన చేశాడు. బాబా! బాబా!! బాబా!!! అని అరిచాడు. ఆ అరుపులోపలనేబిడ్డ అరుపులు వినిపించాయి. కుమారుడు పుట్టాడు. ఆనందములో బాపూ దగ్గరకు వచ్చి బాపూ! ఏమి జరిగిందో చెప్పు. బాబా ఏమి చెప్పారు? ఏవిధంగా వచ్చావు?" అని అడిగేటప్పటికి రెండు రూపాయలతో నేను బయలుదేరాను. అన్ని సదుపాయములు బాబాయే చేశారు. నమ్మిన వారిని బాబా వదలరు. నమ్మకమే ప్రధానమైనది. నమ్మకమనే నయనములను మనము కోల్పోయినాము. ఈనాడు నమ్మిపని చేస్తే దేనిలోనైనా విజయము చేకూర్చుకోవచ్చు. ఈ నమ్మకము చేతనే నేను ఇంత ఆనందము పొందగలిగాను. మూడవ దినము బాపూ, నానా షేరడీ వెళ్లారు. బాబా! ఏమి నీ సందేశము! ఏమి నీ లీలలు! ఇవి వర్ణనాతీతమైనవి" అని కొనియాడారు.
(షిపు 41/46)
ఒకసారి షిరిడీలో శ్రీరామనవమి, ముస్లింల బక్రీద్ పండుగ రెండూ జరిగాయి ఒకేరోజు.
(పి.పు.47)
మీ చరిత్ర హరికథగా వ్రాయాలి. ఎక్కడ పుట్టారు? తల్లిదండ్రలెవరు? ఎక్కడ పెరిగారు? అని అడుగుతూ వచ్చాడు. దాస్ గణునాకు పుట్టుక లేదురా దాస్ గణు. నా పేరు బాబాయే. నేను దేవుని నుండి వచ్చానేగానీ పుట్టలేదన్నాడు బాబా. ఈ విధంగా జవాబు చెబితే ఎవరికీ అర్థం కాదు. ఒకసారి మాత్రం దాస్ గణున పిల్చి చెవిలో చెప్పాడు పత్రి గ్రామ సముద్భూతం - ద్వారకామాయి వాసినం. అప్పుడు అతనికి. అందరికి బాబా పత్రిలో పుట్టారని తెలిసింది.
(షి, పు. 50)