"ఉన్నాడయా దేవు డున్నాడయా
కనులకు కనిపించకున్నాడయా
లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయా
లక్షలాదిగ నున్న నక్షత్రముల నెల్ల
నేలరాల్పక మింట నిల్పు చున్నాడయా
జీతబత్తెము లేక ప్రీతితో నరులకు
గాలికోసం తానే విసరేనయా
ఆధారమే లేక అల్లాడుచున్నట్టి
ఆకాశమును ఆపుచున్నాడయా
పొంగిపొరలుచు వచ్చి భూమిపై
పడకుండా కడలి కాళ్ళు విరిచాడయా
ఉన్నాడయా దేవుడున్నాడయా
కన్నులకు కనిపించకున్నాడయా
కనిపించక ఏమి చేస్తున్నాడయా?
తెరచాటు తా నుండి, తెరముందు ప్రజలనుంచి
తైతక్కలాడించుచున్నాడయా
కన్నులకు కనిపించకున్నాడయా."
(దై. ది. పు.26)
ప్రేమస్వరూపులారా! అర్పితమనేది చాల కష్టమని భావిస్తున్నారు మీరు. కానీ నా దృష్టిలో భగవదర్పితం కంటే సులభమైనది మరొకటి లేదు. పుష్పము యొక్క రేకులను నలపడం చాల సులభం. కాని అంతకంటే సులభమైనది భగవంతునికి అర్పితం చేయడం. ఇంత సులభమైన దానిని వదలి పెట్టి ఎందుకు కష్టాలకు గురి అవుతున్నారు?
మీకు భగవంతునిపై విశ్వాసం ధృడంగా లేకపోవడంచేతనే ఇది కష్టంగా తోస్తున్నది. భగవంతుడున్నాడు. “ఉన్నాడు దేవుడున్నాడయా", దేవుడు లేని స్థానం లేదు. దేవుడు కాని జీవుడే లేడు, దేవుడు లేని పదార్థమే లేదు. ఈ సత్యాన్ని మీరు హృదయ పూర్వకంగా విశ్వసించినప్పుడు అర్పితము చాల సులభమవుతుంది. అట్టి విశ్వాసం మీలో లేకపోవడంచేతనే ఇది మీకు కష్టంగా కనిపిస్తున్నది.
ప్రేమస్వరూపులారా! ప్రేమయే భగవంతుడని విశ్వసించండి. భగవద్విశ్వాసంతో ఎంతటి కఠినమైన కార్యమునైనా సులభంగా సాధించవచ్చు.
(ససా.మా.99 పు70/71)