నామస్మరణ గొప్ప ఉపకరణము. అది నిజంగా మిమ్మల్ని రక్షిస్తుందని, మీకు ఆరోగ్యం చేకూరుస్తుందని మీరు నమ్మలేరు. అదే విచారకరమైన విషయము. మానవులు ఖరీదైన తళతళలాడే పాకెట్లలో ఉన్న మందులనే నమ్ముతున్నారు. అంతేగాని సులభంగా లభించే, అందరి దగ్గర ఉన్న చక్కని ఔషదాన్ని పనికిరానిదిగా భావిస్తున్నారు. నిజంగా మీకు నామం మీద నమ్మకం ఉన్నట్లయితే మీ కోరికలు నాకు చెప్పుకొనే అవకాశం కోసం సతమతం కానక్కరలేదు. వాటిని మీరు నాకు చెప్పకుండానే నేను తీరుస్తాను. రామదాసు మీవలె వరండాలో సీటు కోసం, ఇంటర్వ్యూ అవకాశం కోసం ఎదురుచూశాడా? భగవంతుడే అతనికి కావలసినవాటిని అతని తలుపు దగ్గరకు తీసికొని వెళ్ళాడు. నెరవేరినంత మాత్రంలో కోరిక నశించిపోదు. విత్తనం వలె అది
అనేకరెట్లు అవుతుంది. ఒక గింజ నాటితే వృక్షం అవుతుంది. దానికి కొన్ని వేల గింజలు పుట్టటంవల్ల అవి మరల వృక్షాలై అడవి ఏర్పడుతుంది. వాటన్నిటికి లక్షల గింజలు పుట్టి దట్టమైన కీకారణ్యం తయారవుతుంది. కోరికలు కూడా అంతే.
(స.వ. 61-62 పు. 164/165)