వేదాంతమునందు మానవశరీరమునకు తుంగభద్ర అని ఒక పేరు. తుంగభద్ర అని ఒక నది కూడా ఉంటున్నది. తుంగ, భద్ర రెండూ చేరటంచేతనే తుంగభద్ర అని పేరు వచ్చింది. భద్ర అనగా మంచి, పవిత్రము, కళ్యాణము, శోభ అనే అర్థాలుంటున్నాయి. తుంగ అనగా చాల బలమైన, గొప్ప, విశాలమైన యీ విధమైన అర్థములు తీసుకోవచ్చు. మంచి కార్యములు చేసేది, గొప్ప కార్యము ఆచరించేది కళ్యాణ కార్యములలో ప్రవేశించేది, దివ్యమైన ఆదర్శమునందించేది యీ దేహము. కనుకనే పనికి తుంగభద్ర అని పేరు వచ్చింది.
(బృత్ర.పు౧౩౯)
మానవుని యొక్క శరీరము ఒక వెదురు కర్ర వంటిది. ఈ వెదురు కర్రకు అనేక గణుపులు ఉంటాయి. ఆ గణుపులే కామ, క్రోధ,లోభ,మోహ మద మాత్సర్యములు. మానవుని యొక్క దేహమును తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు. అది నది కాదు. ఈ తుంగభద్రకును, మానవుని యొక్క శరీరమునకు వుండినటువంటి సంబంధ బాంధవ్యమేమిటి? భద్రము" అనగా కళ్యాణము, మంగళకరము. తుంగ అనగా అమితమైన, తుంగభద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, మంగళమును, కళ్యాణమున చేకూర్చేటటువంటిది. అదే ఈ మానవశరీరము. అట్టి దివ్యమైన, భవ్యమైన పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైన మార్గంలో వినియోగిస్తున్నామో, ఎవరికి వారు ఆలోచించాలి. మంగళకరమైన, పవిత్రమైన, కళ్యాణ కరమైన ఈ దేహమును ఎట్టి తుచ్ఛమైన మార్గంలో మనం వినియోగపరుస్తున్నామో. ఎవరికి వారు యోచించాలి. అనేక విధముల పరిశీలించి, పరిశోధించి, ఈ దేహమునకు తుంగభద్ర’ అని నారదుడు పేరు పెట్టాడు.
నారదుడు అనగా కేవలం కలహ ప్రియుడని భావిస్తుంటారు. లోకులు, కాదు.. కాదు..ఇది కేవలం లోకుల భ్రాంతి, సమస్త దుంఖములను పరిహారం గావించి,జ్ఞానమును ఆందించేటటువంటి మహానుభావుడే నారదుడు.జ్ఞానభాస్కరుడే నారదుడు. అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి నారదుడు, విష్ణు ప్రియుడైనటువంటి నారదుడు, ఈ నూతనమైన పేరును కలిపించాడు. ఆదియే ‘తుంగభద్ర’ ఇట్టి పవిత్రమైన నామమును సరియైన ఆర్థమును గుర్తించి, సక్రమమైన మార్గంలో వినియోగించి, ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
(శ్రీ సె. 2000 పు. 7)