(చూ|| ఆనందము)
తులసీదళము, బిల్వపత్రము
తులసీదళము, బిల్వపత్రము. ఇవి ఒక్కొక్క దానికి చెప్పాలంటే ఒక్కొక్క దినమంతా పడుతుంది. కనుక మీకు ఎంత అవసరమో అంత చెప్పటం మంచిది. తులసి దళము, బిల్వ పత్రము త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని నిరూపించేటటువంటిది. త్రిమూర్తి స్వరూపాన్ని నిరూపించే టటువంటిది. త్రికాలములకు చిహ్నము. త్రిలోకములకు గుర్తు. కనుకనే మనలో ఉన్నటువంటి త్రిగుణములను ఏకత్వము గావించుకునే నిమిత్తమై ఈ బిల్వపత్రి. తులసీదళము భగవంతునికి అర్పితం గావిస్తుంటాము. ఈ మూడింటికి కూడను ఆధారము ఒక్కటే. ఒక దళము ఒక వైపును, రెండవవైపున ఒక దళము, నడుమ ఒకటి ఉంటుంటాది. అన్నిటికీ చేరిక ఒక్క చోటనే ఉంటుంటాది. అదే విధముగనే సాత్వికమునకు, రాజసికమునకూ, తామసికమునకు ఒకే మానసిక తత్త్యము. కనుకనే ఈ ఏకత్వమును నిరూపించడానికి ఈ మూడు గుణములు మూడు పత్రులుగా నిరూపిస్తూ వచ్చారు. కనుక పురుష సూక్తములో "త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం" అన్నారు. అనగా "నా త్రిగుణములు కూడను నీకు అర్పితం గావిస్తున్నాను" అనేటువంటిదే ఇందులో అంతరార్థం.
ఇంక తులసీ దళమునందు పతివ్రతాధర్మాలు నిరూపిస్తూ వచ్చాడు. జలంధరుని యొక్క భార్య ఈ తులసి. ఆమె పేరు బృంద. ఈ జలంధరుడు అనేక రకములైనటువంటి క్రూర కృత్యములలో పాల్గొనేటటువంటి వాడు. పరస్త్రీలను హింసించటానికి ప్రయత్నించేటటువంటివాడు. కనుకనే ఏ మహా పతివ్రత శాపానికి నా భర్త గురియైపోతాడోనని నిరంతరము కూడను పతివ్రతలను ప్రార్ధించి, నా పతికి శాపమివ్వకుండా చూడమని, నిరంతరము ప్రార్థనలో మునిగి ఉండేటటువంటిది ఈ బృంద. ఈ విధమైనటు వంటి వరప్రసాదాన్ని విష్ణువు దగ్గర కూడను పొందింది. నా యొక్క పతికి పరస్రీల వల్ల ఏ విధమైన అపకారమూ జరగకుండా ఉండాలి అని ప్రార్థించింది. అప్పుడు విష్ణువు చెప్పాడు"నీ పాతివ్రత్యమునకు భంగము కలిగినపుడు తప్పక అతని ప్రాణం పోతుంది" అని చెప్పాడు. “నా పాతివ్రత్యమునకు ఎట్టి అడ్డము జరగటానికి వీలులేదు.ఈ వరము నేను సాధిస్తాను" అని ఆమె ధృడము చేసుకుంది. ఈ వరప్రసాదము యొక్క ఆధారాన్ని - పురస్కరించుకుని జలంధరుడు నాకింక ఎట్టి పతివ్రతల వల్ల ఎట్టి ప్రమాదమూ జరుగదని స్వేచ్ఛా విహారము సలుపులూ వచ్చాడు. పార్వతి. లక్ష్మి, సరస్వతులను కూడా తరుమడానికి ప్రయత్నించాడు. ఈ విధమైనటు వంటి మితిమీరిన స్థితిని గమనించి విష్ణువు ఇక యితనిని బ్రతికించటం మంచిది కాదనుకున్నాడు. ఒకనాడు జలంధరుని వేషం వేసుకుని తులసి దగ్గరకు వచ్చాడు. మంచి మాటలాడుతూ పతిదగ్గరకు వచ్చేటప్పటికి "అయ్యో! ఈనాడు నా భాగ్యం పండింది. నాపతి నా దగ్గరకు వచ్చాడని" తట్ట, చెంబు తీసుకొని పోయి పాదములు కడిగి పతియొక్క జలము అని శిరస్సున చల్లుకుంది. ఈ సమయంలో జలంధరుడు ఎక్కడో బయట ప్రదేశంలో స్త్రీలను తరుముతూ ఉంటున్నాడు. ఇతడు నా భర్త అని ఆమె ఎప్పుడైతే భావించిందో తక్షణమే ఆతని శిరస్సు ఖండింపబడింది. తక్షణమే జలంధరుని రూపంలో వచ్చిన విష్ణువు శంఖ చక్ర గదా ధారిగా నిలిచాడు. "బ్బంధా! నీ పతియొక్క చేష్టలే మితిమీరి పోవటంచేత జలంధరునికి ప్రమాదం సంభవించే సమయం కూడను రావటంచేత నేను ఈ విధంగా వేషం ధరించవలసి వచ్చింది." అని చెప్పేటప్పటికి "విష్ణూ! నీ యొక్క పొరపాటేమీ కాదు. నా పతియొక్క దోషమే. కనుక నాకు ఈ నిమిషంలో నా పతితొ సహగమనానికి అనుమతి యిమ్మని అడిగింది. "నీవు ప్రాణం విడిచి నప్పటికిని నీవు పతివ్రతగా శాశ్వతంగా, చిరంజీవిగా నిలిచిపోదువుగాక" అని అనుగ్రహించి సహగమనానికి అనుమతి యిచ్చాడు. జలంధరుని యొక్క దేహము అగ్నిలో వేసినప్పుడు అందులో ఈమె యొక్క దేహం కూడను చేర్చినారు. ఆ చేర్చిన తరువాత రెండవ దినము ఆ భస్మములో ఒక తులసీ దళము చిక్కింది. అందువలన ఆ బృంద యొక్క పరివారమంతా ఆ తులసీదళమును తీసికొని క్రింద ఒక చిన్న కట్టగా కట్టుకుని ఈ తులసిని పూజిస్తూ వచ్చారు. క్రింద నున్నది బృంద, పైనతులసి. బృందావనము లేక తులసి ఉండదు. కనుక తులసీ బృందావనము అని పిలుస్తూ వచ్చారు. అనగా తాను నిత్య ప్రతివ్రతగా, చిరంజీవిగా అనుగ్రహించేటటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటిది కనుక స్రీలు ఇంటిలో బృందావనము కట్టుకుని, దాని పైన తులసిని పెట్టుకుని ప్రార్థిస్తూ ఉండటము ఒక సాంప్రదాయము.
(గు. శి. బృ 78 పు. 49/52)