ఒక జ్యోతి ఉంది. జ్యోతి పైన పది చిల్లులున్న కడవను బోర్లించాము. ఉన్నది ఒక జ్యోతి. పది రంధ్రాల నుండి పది జ్యోతులు కన్పిస్తాయి. కుండను బద్దలు కొడితే లోపల ఉండేది ఒకే జ్యోతి. దేహం పది చిల్లుల కుండ, పది చిల్లులే పది ఇంద్రియములు, ఐదు కర్మేంద్రియములు. ఐదు జ్ఞానేంద్రియములు, పది ఇంద్రియములున్న దేహములో జ్యోతి కప్పివేసి ఉన్నది. దీనిపై మాయ అనే దట్టమైన వస్త్రమున్నది. కనుక ఆత్మజ్యోతి మొదట మాయను తొలగించాలి. అదే దట్టమైన వస్త్రము. దానిని తీసివేయగానే పది ఇంద్రియాలనే జ్యోతులు కన్పిస్తుంటాయి. అప్పుడు దేహ భ్రాంతిని బ్రద్దలు కొట్టాలి. వెంటనే జ్యోతి దర్శనమవుతుంది.
(త్వశపు. 47)
దృష్టి నొక జ్యోతి లేక దీపిక మీద కేంద్రీకరించుము, ఆ జ్యోతి భ్రూమధ్యము ద్వారా నీ హృదయ కుహరము ప్రవేశించుచున్నట్లూహింపుము. నీ యందున్న ఈర్ష్య, ద్వేష. అసూయ, అహంకారములు ఈ జ్యోతిచే భస్మీపటలమైనవని ఊహింపుము. ఈ జ్యోతి అంగ అంగమునందు నీ శరీరమంతటా వ్యాపించనిమ్ము, తదుపరి ఆ జ్యోతిని కపాలము ద్వారా బహిర్గతము చేసి దానిని సమస్త మానవాళికి, మిత్రులూ, శత్రువులు అను భేదము చూపక అందరికీ ప్రసరింపచేయుము.
(శ్రీ సూ. పు.44/45)
(చూః జ్యోతిశ్చరణాభిధానాత్, ప్రకాశము, భగవన్నామము, భారతదేశము)