జ్యోతినే ఎందుకు తీసికోవాలి? ఇసుకనుండి కొంత తీసికుంటే ఇసుక తరిగి పోవును. ఒక తొట్టి నుండి తలా కొంత నీరు తీసికుంటే తొట్టి ఖాళీ యగును. కాని ఒక కొవ్వొత్తి మంట నుండి వేయి మంది వేయి కొవ్వొత్తులను వెలిగించుకున్నా ఆ మంట తరగదు. దీపమును కాని,కోవ్వోత్తని కాని వెలిగించు. ఆ జ్యోతి వైపు తదేక దృష్టితో చూడు. ఆ జ్యోతిని నీ హృదయములోకి గొనిపోయి హృదయ కమలములో దళముల మధ్య దర్శించు. ఆ దళములు విప్పారుటను, ఆ జ్యోతి హృదయమును ప్రకాశమానము చేయుటను గమనించు, అప్పుడు దురాలోచనలు తొలగిపోవును. తరువాత జ్యోతిని హస్తముల లోకి ప్రవేశపెట్టుము. ఇక ఆ హస్తములు దుష్టకార్యములలో నిమగ్నము కావు. క్రమముగా జ్యోతిని నేత్రములలో, శ్రవణేంద్రియములలో ప్రవేశ పెట్టు. ఇక అవి ఉల్లాసకరమైన, విశుద్ధమైన స్పందనలను మాత్రమే గ్రహించును. జ్యోతిని శరీరములోని ఇతర భాగములలో ప్రవేశ పెట్టు. తదుపరి జ్యోతిని బయటకు తీసికొని వచ్చి నీ స్నేహితులయందు, బంధువులయందు, శత్రువులయందు, జంతువులయందు, పక్షుల యందు, వృక్షములయందు, ఇంకా ఇతర వస్తువులయందు, ప్రవేశ పెట్టుము. సర్వమూ ఆజ్యోతి ద్వారా ప్రకాశవంతమగును. క్రీస్తు "అందరూ ఒకటే. అందరి పట్లా సమరసభావముతో వ్యవహరించు", అని నుడివెను. ఆ విధముగా, నీవు నీ దేహమునకు మాత్రమే పరిమితుడవు కాక విశ్వమంతా వ్యాప్తి చెందెదవు. ఇప్పుడు విశాలముగా నున్న ప్రపంచము అప్పుడు ఎంతో చిన్నది యగును. ఆత్మ స్థాయినుండి ఎదిగి నీ లోని జ్యోతిని పరమాత్మగా నెరుగటయే మోక్షము. మోక్షము ఈ స్థితికి భిన్నమైనది కాదు.
నిటారుగా కూర్చొ ను ట ముఖ్యము. వెన్నెముకలో ప్రాణ శక్తి తొమ్మిది, పన్నెండు పూసల మధ్య కలదు. ఆ భాగములో దెబ్బ తగిలిన అది పక్షవాతమునకు దారితీయును. దేహము నిటారుగా నున్న జాగృతమైన ప్రాణ శక్తి పైకిలేచి ఏకాగ్రత లక్షణమును మనస్సున కందించును. పిడుగుపాటునకు వాహకముగా నుపయోగించు లోహపు కడ్డి (lightning conductor) పిడుగు నెట్లు ఆకర్షించునో ఆ విధముగనే నిటారుగా నున్న దేహము, దివ్య శక్తి ప్రవేశించుటకు వాహకముగా పనిచేయును. ఆ దివ్యశక్తి నీ కార్యము సఫలీకృతమగుటకు, నీవు గమ్యస్థానమును చేరుటకు వలసిన శక్తిని నీకు ప్రసాదించును. ఇంకొక ఉదాహరణ - రేడియో సంకేతముల వలె దివ్యశక్తి ఎల్లవేళలా ఉండును. రేడియో సంగీతమును వినవలెనంటే సంకేతములను గ్రహించుటకు యాంటెన్నా ఉండవలెను. అంతే కాదు సరిగా ట్యూన్ (tune) చేయకపోయిన యెడల శబ్దము వచ్చును కాని సంగీతము రాదు. ఆ విధముగానే అన్ని వేళలా ఉండు దివ్య శక్తిని దేహము నిటారుగా నున్న, నీ ధ్యానము సక్రమముగా నున్న నీ యందు ప్రవేశించును. బ్రహ్మ ముహుర్తమనగా తెల్లవారు ఝామున, మూడు నుండి ఆరు గంటల మధ్య కాలము. ఆ సమయములో ఇంద్రియములు నిశ్చలముగానుండును. పగటిపూటలో వలె చంచలముగా నుండవు. నిద్రించుటచే, మనస్సు కూడా ప్రశాంతముగా నుండును. సమయమున మార్చక, ప్రతిదినమూ అదే సమయములో ధ్యానము చేయవలెను. తెల్లవారు ఝామున అరగంట, సాయంకాలము అరగంట కాలము ధ్యానము చేసిన చాలును. దినమంతా ధ్యానము చేసిన యడల రెండు సంవత్సరములలో దానిపై శ్రద్ధాసక్తులు సన్నగిల్లును. ఉత్సాహమును కలిగించుటకై ఆధ్యాత్మిక సాధన పలుతీరులుగా నుండవలెను. కొంత భజన, కొంత నామస్మరణ కొంత సత్సంగము – ఆ విథముగా మార్పు ఉండవలెను. నిత్య జీవితములో మార్పు ఏ విధముగా ఉత్సాహమును రేకెత్తించునో అట్లు, మొదట నీవు జ్యోతి యందున్నావు. తరువాత నీలో జ్యోతి యున్నది. చివరగా నీవేజ్యోతివి. ఆ జ్యోతి సర్వత్రా కలదు .ఆ ఆనందమును కొంత సేపు అనుభవించి ఆ జ్యోతిని తిరిగి నీ హృదయకమలములో నిడుకొని దినమంతా ఆ విధముగానే ఉంచుకొనుము. భగవద్రూపమును కూడా జ్యోతిలో కలుపవచ్చును. కృష్ణ రామ, జీసస్, సాయి - నీ అభీష్టమునకు అనుగుణముగా ఇష్టదేవతా రూపమును జ్యోతి మధ్య భాగములో దర్శించవలెను. అప్పుడు నీవు భగవంతునితో పాటే ఉంటావు.
ఈ యోగమా, ఆ యోగమా అనునది దీనికి సమాధానము కాదు. ఇతర ధ్యాన పద్ధతులను అవలంబించు వారు కూడా సాయి కేంద్రములో చేరవచ్చును. అందరూ ఒకే గమ్యస్థానము నాశించి కలసి ప్రయత్నము చేయవచ్చును. ప్రేమ ద్వారానే భగవంతుని చేరవచ్చును. ప్రాణాయామము, హృదయమును, ఊపిరితిత్తులను ప్రయాసకు, వత్తిడికి గురిచేయును. ప్రాణాయామము చేయవలెనంటే మంచి ఆరోగ్యముండవలెను. భక్తియోగము అత్యుత్తమమైనది. అతి సంకీర్ణత గందరగోళమునకు దారితీయును. జ్యోతి ధ్యానము నిరపాయకరమైనది, నిస్సందేహముగా నిన్ను గమ్య స్థానమునకు చేర్చుము.
(ప.ప్రపు 266/269)