భక్తుల అభీష్టములు మంచివైతే భగవంతుడు వాటిని తప్పక నెరవేరుస్తుంటాడు. ఈశ్వరత్వాన్ని నమ్ముకున్న వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తాడు. ఈశ్వరుడు మార్కండేయునికి 16 సంవత్సరాల ఆయుర్దాయమును ప్రసాదించాడు. కాని, ఈ విషయం మార్కండేయునికి తెలియదు. ఒకనాడు ఇంట్లో అతని తల్లి ఒక ప్రక్క, తండ్రి ఒక ప్రక్క ఏడుస్తూ కూర్చున్నారు. మార్కండేయుడు కారణమడుగగా, "నాయనా! మా దురదృష్ట మేమని చెప్పాలి? ఈనాటితో నీ ఆయువు తీరిపోతున్నది." అన్నారు. వారిద్వారా తన జన్మరహస్యాన్ని తెలుసుకుని మార్కండేయుడు "నేనీ పదహారు సంవత్సరాలను వ్యర్థం చేశాను. ఇంక ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయను." అని తక్షణమే శివాలయమునకు వెళ్ళాడు.
ఈశ గిరీశ నరేశ పరేశ పన్నగభూష విభో!
సాంబసదాశివ శంభో శంకర
శరణం మే తవ చరణయుగళం
అని ప్రార్థిస్తూ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. అతనికి కాలం తీరిపోయింది. యముడు వచ్చాడు. ఇతనికి పాశం ఎట్లా వేసేది? అని ఆలోచించాడు. ఆలోచించకుండా యముడు ఏ పని చేయడు. మార్కండేయుని శిరస్సు ఈశ్వరుని శిరస్సుతో చేరియుండటంచేత మార్కండేయునికి మాత్రమే పాశం వేయటానికి వీల్లేదు. కాని, గడువు తీరిపోయేలోపలప్రాణం తీసుకొని పోవలసిందే! గత్యంతరం లేక యముడు పాశం విసిరాడు. అది ఈశ్వరునికి కూడా తగిలింది. తక్షణమే ఈశ్వరుడు ప్రత్యక్షమై "ఒరేయ్ యమా!నాకు కూడా పాశం వేసే స్థితికి వచ్చావా నీవు!" అని ఆతనిని భస్మం చేసి, మార్కండేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు. మార్కండేయుడు అచంచలమైన విశ్వాసంతో, దృఢదీక్షతో ఈశ్వర ప్రార్థనలో లీనమైపోవడం చేతనే ఈశ్వరానుగ్రహపాత్రుడైనాడు. "యద్భావం తద్భవతి". ఎలాంటి తిండియో అలాంటి త్రేపు, ఎలాంటి పూజనో అలాంటి ఫలితం. ఈ సత్యాన్ని మీరు గుర్తించి హృదయాన్ని పరిశుద్ధపర్చుకోండి. "నా హృదయమే ఈశ్వరుడు, నా మనప్పే విష్ణువు, నా వాక్కే బ్రహ్మ" అని పూర్తిగా విశ్వసించి వాటిని సద్వినియోగపర్చుకుంటే మీకు తప్పక సద్గతి కల్గుతుంది; మీరు తప్పక దైవంలో లీనమౌతారు.
ఈనాడు దీపక్ ఆనంద్ మీకు చక్కని అవకాశము నందించాడు. అతడు ప్రార్థించడం చేతనే నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించి చెప్పవలసి వచ్చింది. లేకపోతే చెప్పేది లేదు. మీకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. దైవతత్వంలోని రహస్యాలను తెలుసు కొనక మీరు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
ప్రేమస్వరూపులారా! కాలం భగవత్స్వరూపం. కనుకనే, భగవంతుణ్ణి "కాలాయనమః కాల కాలాయనమః కాలదర్పదమనాయనమః కాల స్వరూపాయ నమః కాలనియమితాయ నమ:.." అని వర్ణిస్తున్నారు. కనుక, మంచి మాటలతో, మంచి మనస్సుతో, మంచిహృదయంతో కాలాన్ని సద్వినియోగపర్చుకోండి. అన్నింటికీ ప్రేమను ఆధారంగా తీసుకోండి.
(స. సా.జూలై.2000 పు 204/205)
(చూ|| కర్మదాటవశమా)