ప్రేమనే శివం అన్నారు. అదే మంగళం. ప్రేమ ఎప్పుడూ, ఎవరినీ బాధించదు. కనుక బాధించనటువంటిది మంగళకరమైనటువంటిది. ఆదియే "శివత్వం ఆ ప్రేమ లేకపోతే వీడు శవస్వరూపుడే! ప్రేమ ఉండినప్పుడే వీడు "శివస్వరూపుడు కనుక ఈ రోజును శివరాత్రి అన్నారు. చీకటితో కూడినటువంటి దానిని రాత్రి అంటారు. చంద్రమామనసోజాత: చక్షోసూర్యో అజాయత’ అని వేదం బోధించింది. చంద్రుడనగా మనస్స్వరూపుడు కాబట్టి మనస్సు" అనేది పవిత్రమైన ప్రేమ మయంగా ఉండాలి. "గుండె యందు ప్రేమ పండించు కొనుచున్న వాడే హిందువు" ఈ విధమైన ప్రేమతత్త్వాన్ని మానవుడు ఈనాడు పూర్తిగా విశ్వసించాడు.
(శ్రీ మా.99 పు.5)
(శివం – శవం)
“ఒక వేటగాడు ఒక పక్షిని కొట్టి, దానిని పట్టుకొని, బజారులో నడచుకుంటూ పోతున్నాడు. మాంసాహారులు దానిని చూచి ఎంత వెల?...ఎంతవెల?.. అని ఎగబడి అడుగుతున్నారు. అదే రోజున ఒక మహారాజు కూడా మరణించాడు. ఆ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకొని వెళుతున్నారు. దారిలో పెద్ద వర్షం వచ్చింది. ఆ శవాన్ని ఎవరి ఇంటి ముందు వరండాలో నైనా పెట్టి, కొంతసేపు నిలుద్దామనుకున్నారు శవవాహకులు. ఎంత మహారాజైతేమి? ఆ శవాన్ని తను ఇంటి ముందు వరండాలో పెట్టడానికి ఎవరూ అంగీకరించలేదు. పరాయివారు సరే! ఇంటి వారు కూడా శవాన్ని ఇంట్లో పెట్టుకోరు గదా! చచ్చిపోయిన పక్షికి అయినా విలువ వున్నది. గాని, చనిపోయిన మనిషికి మాత్రం విలువలేదన్న మాట. శ్వాస ఉన్నంత వరకే విలువ. శ్వాస ఉన్నప్పుడు శివం శ్వాస పోగానే అది శవం! -బాబా (సాలీత పు200)