మొన్న కొయంబత్తూర్ ప్రసిడెంట్ చెప్పాడు యుక్తి చాలా అవసరమన్నాడు. దీనికొక ఉదాహరణము: ఒక దనవంతుడుండేవాడు. అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై శ్రీలక్ష్మి, దరిద్రలక్ష్మి ఇద్దరూ వచ్చారు. "మా ఇద్దరి లోపల ఎవరు అందంగా ఉన్నారు?" అని నిర్ణయించమన్నారు. అతను ఆలోచించారు. శ్రీలక్ష్మి అందంగా ఉన్నదంటే దరిద్రదేవత తనను వచ్చి పీడుస్తుందో ఏమిటో? దరిద్రలక్ష్మి బాగుందంటే శ్రీలక్ష్మి వెళ్లిపోతుందో ఏమో? ఏమి చేసేది అని ఆలోచిస్తే అప్పుడతనికి ఒక యుక్తి వచ్చింది. "మీరు అటూ, ఇటూ నడవండమ్మా, మీలో ఎవరు అందంగా ఉంటారో చెప్పుతా"నన్నాడు. వారట్లే చేశారు. "ఒకరు రండి మరొకరు పాండి" అన్నాడు. అప్పుడు చెప్పాడు "అమ్మా! లక్ష్మీదేవి నీవు వస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటావు అమ్మా! దరిద్ర లక్ష్మీ నీవు పోతున్నప్పుడు చాలా అందంగా ఉంటా" వన్నాడు. ఆ విధముగా యుక్తితో ఇద్దరిని తృప్తి పరచాడు. ఈ విధముగా యుక్తితో శక్తిని సంపాదించాలి. అందువలననే “నొప్పించక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు" అన్నాడు. ఆ యుక్తే యోగంగా మారి పోతుంది.
ఆ యుక్తివలన నీకుగాని, ఇతరులకు గాని బాధలు కలుగూడడు.
(స.సా జూ..1988 పు.147/148)
ప్రేమను పెంచుకోండి. ఆ ప్రేమనే విస్మరిస్తే మీరు మరణించిన వారితో సమానమే అవుతారు. సత్యం నాలుకు ప్రాణం. ధర్మం చేతికి ప్రాణం, అహింస హృదయానికే ప్రాణం. కనుక వీటిని రక్షించుకోవాలి. శివ అంటే అణుకువ, వినయము. అహంకార మనేటటువంటి శవం ను ఆశ్రయిస్తున్నామే గాని, వినయ, విధేయతయైన శివం ను మనం ఆశ్రయించడం లేదు. సత్యంజన విరోధాయ అని భావించి సత్యమును చెప్పటం లేదు. అసత్యం జనరంజనం అని భావించి అసత్యమును చెబుతున్నారు. జనాన్ని రంజింప జేస్తున్నారు. గాని, హృదయాన్ని రంజింపజేస్తున్నారా? హృదయాన్ని రంజింపజేయకుండా, ప్రజలను రంజింపచేసి ప్రయోజనం ఏమిటి? ప్రజలను సంతృప్తి పరచడాని కోసం ప్రయత్నిస్తున్నారు గాని, ఆత్మను సంతృప్తి పరచడానికి కోసం ప్రయత్నం చేయటం లేదు. సత్యం చెప్పకపోయినా ఫరవాలేదు గాని, అసత్యం మాత్రం చెప్పరాదు. సత్యం చెప్పలేకపోతే మెదలకుండా ఉండండి. ఆసత్యం మాత్రం చెప్పకండి.
ఒకానొక సమయంలో ఒక సాధకుడు సత్యాన్నే చెప్పాలి. అసత్యాన్ని చెప్పరాదు అని భావించి అరణ్యానికి వెళ్ళి నమః శివాయ అనే నామాన్ని ఉచ్చరిస్తూ జపం చేస్తూ కూర్చున్నాడు. అతనిచేత ఎట్లాగైనాసరే ఆసత్యం చెప్పించాలని ఈశ్వరుడు పట్టుపట్టాడు. ఒక జింకను తరుముకుంటూ వచ్చాడు మారువేషంలో ఆ ఈశ్వరుడు. ఆ జింక పరుగెత్తుకొని వచ్చి, ఆ తపస్వికి ఎదురుగానున్న పాదలో దాక్కున్నది. దీనిని ఆ తపస్వి చూచాడు. ఇంతలో మారువేషంలో జింకను ఈశ్వరుడు తరుముకుని వచ్చాడు. జింక విషయం ఆ తపస్విని అడిగాడు. ఆ తపస్వికి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. అయితే జింకను చూచాడు. చూడలేదని చెబితే అసత్యమాడినవాడవుతాడు. చూచాను అంటే ఆ జింక ప్రాణాలు పోతాయి. అసత్యం ఆడినవాడవుతాడు. అపకారం చేసినవాడవుతాడు. అతనికి మనస్కరించలేదు. ఆ సందిగ్ధము నుండి బయటపడేయమని భగవంతుని ప్రార్థిస్తాడు. చక్కని యుక్తిని ప్రాసదించమని వేడుకుంటాడు. తక్షణమే భగవంతుడు ఆ తపస్వికి చక్కటి ఉపాయాన్ని కలుగజేస్తాడు. అప్పుడు ఆ తపస్వి చెబుతాడు. “నాయనా! ఏది చూచెనో అది పలుకదు. ఏది పలుకునో అది చూడలేదు" అని అంటాడు. (కన్నులు చూచినాయిగాని, వాటికి చెప్పడానికి నోరు లేదు. నోరు చెప్పగలుగుతుంది గాని అది చూడలేదు గదా!) అని చెప్పి తప్పించుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడుప్రత్యక్షమై, ‘ఈ యుక్తియే యోగము అన్నాడు. పరులకు అపకారం గావించకుండా, ఉపకారం గావించి, ఉత్తమ మార్గంలో దానిని సంరక్షించేటటువంటి భావమే సరియైనటువంటి మానవత్వం .అసత్యమాడలేదు. అపకారం చేయలేదు. దానిని (జింక) రక్షించాడు. ఆ తపస్వి. ఇట్టి యుక్తిచేత సత్యాన్ని సాధించాలి. దైవ ప్రార్ధనలచేత మనం కష్టములను దాటాలి. సర్వులకు ఉపకారం చేసేటటువంటి సద్భావములు, ఉన్నత, ఉత్తమభావములను పెంచుకుంటూ రావాలి. ఎవ్వరికీ మనం అపకారం చేయకూడదు. మనం పరులకు అపకారం చేస్తే, ఏదో ఒక రోజున ఆ అపకారం వచ్చి మనకే తగులుతుంది. కనుక అపకారం చేయకండి. ఎవరికీ, ఏ విధమైన ద్రోహం తలపెట్టకండి. ఎవరిని దూషించకండి. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలేగాని, నివృత్తి లక్షణాలు కావు. "పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనం". Help Ever, Hurt Never. దీనిని నేర్చుకోవాలి. సాధ్య మైనంత వరకూ ఇతరులను బాధించకుండా చూచుకోండి. ఒకవేళ నీకు బాధ కలిగినా ఫరవాలేదు. నీబాధన భగవంతుడు వైదొలగించుతాడు. మనకై మనం మాత్రం ఇతరులకు బాధ కలిగించకూడదు. పరుల మంచిని చూచి ఆనందించండి. పరుల సుఖాన్ని చూచి సంతోషించండి. అప్పుడే మీరు ఆనందాన్ని పొందుతారు. సుఖాన్ని అనుభవిస్తారు.
ప్రేమస్వరూపులారా ! ఈనాడు శివరాత్రి శంకర రాత్రి. చిదానందమును, ఆత్మానందమును అందించేవాడుశంకరుడు. అలాంటి శంకరుని మన హృదయము - నందుంచుకొని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని, నిత్యానందాన్ని, పరమానందాన్ని మనం అభివృద్ధి పరచుకొనిన వారమవుతాము.
(శ్రీ ఏ. 2002 పు. 23/24)