వ్యక్తులు, సిద్ధాంతములు, పార్టీలు వేరువేరుగా ఉండవచ్చును. కాని, దేశానికి ఏదైనా ఆపద సంభవించినప్పుడు వ్యక్తిగత భేదాలను, పార్టీ పరమైన భేదాలను ప్రక్కకు పెట్టి, దేశసంరక్షణకై అందరూ ఏకం కావాలి. ఈ విషయంలో ధర్మరాజు చక్కని ఆదర్భాన్ని అందించాడు. ఒకానొక సమయంలో అతడు కృష్ణునితో మాట్లాడుతూ కృష్ణా! మాకు, కౌరవులకు ఏమైనా భేదాభిప్రాయములు వచ్చినప్పుడు వారు నూరుమంది, మేము ఐదుమందిమి. కానీ, భారతదేశము పైనే ఎవరైనా దండెత్త వస్తే మేమునూ టయిదుమందిమీ ఏకమైపోతాము అన్నాడు. అదేవిధంగా, దేశం యొక్క సంక్షేమానికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అన్ని పార్టీలూ ఏకమై దేశాన్ని రక్షించడానికి పాటుపడాలి. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" జనని, జన్మభూమి స్వర్గము కంటే మిన్నయైనవి అన్నాడు శ్రీ రామచంద్రుడు. మాతృభూమిని ప్రేమించనివాని జన్మ నిరర్థకం. "ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మత మంచు ఎదగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుగొకండు. వసుధన్ కలడా?" మాతృదేశాన్ని ప్రేమించాలి. ఐతే, ఇతర దేశాలను ద్వేషించకూడదు. "ఆద్వేష్టా సర్వభూతానాం", ఎవ్వరినీ ద్వేషించకూడదు. దూషించకూడదు. మన భారత దేశమునకు స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు గడిచి పోయాయి.ఈ 50 సంవత్సరాలలోమనం సాధించిన దేమిటి? హత్యలు, కిడ్నాప్లు, హైజాక్లు - ఇవేనా? ఈనాడు మనిషికి కారులో పోవాలన్నా భయమే. ట్రైనులో పోవాలన్నా భయమే. ప్లేసులో పోవాలన్నా భయమే, ఎక్కడికీ పోకుండా ఇంట్లో కూర్చున్నా భయమే ! లోకమంతా భయ భ్రాంతులతో నిండియున్నది. కారణ మేమిటి? మానవుని మనస్సు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములతో కలుషితమైపోయింది. మన ప్రాచీన ఋషులు సత్యానికి స్వాగతం పలికారు. ధర్మాన్ని ఆందల మెక్కించారు, న్యాయానికి కంకణం తొడిగారు, త్యాగానికి పట్టం కట్టారు. కానీ, ఈనాడు త్యాగము కనిపించడం లేదు, ఎక్కడ చూసినా భోగమే! భోగమువల్ల కలిగేది ఏమిటి? రోగమే. త్యాగమువల్లనే యోగము సిద్ధిస్తుంది.
(స.సా. మే 99 పు. 125)