మృకండ మహర్షి కుమారుడైన మార్కండేయునికి ఈశ్వరుడు 16 సంవత్సరాల ఆయుస్సును ప్రసాదించాడు. ఈ రహస్యం మార్కండేయునికి తెలియదు. ఒకనాటి రాత్రి మృకండుడు, అతని భార్య ఇంట్లో కూర్చుని విలపిస్తున్నారు. మార్కండేయుడు "అమ్మా! నాన్నా! మీ విచారమునకు కారణమేమిటి?" అని ప్రశ్నించాడు. "నాయనా! ఈశ్వరుడు నీకు 16 సంవత్సరముల ఆయుస్సును మాత్రమే అనుగ్రహించాడు. ఈనాటితో నీకు 16 సంవత్సరములు నిండుతున్నాయి. ఇంక నీకు, మాకు ఎట్టి సంబంధమూ ఉండదు" అని చెప్పారు. "ఈ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈశ్వరానుగ్రహంచేత ఎలాగైనా నా ఆయుస్సును పొడిగించుకుంటాను" అని పలికి ఆతడు తక్షణమే ఈశ్వరాలయానికి వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని, "ఓం నమశ్శివాయ, ఓం సమశ్శివాయ... " అని నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయంలో యముడు వచ్చి మార్కండేయునిపై తన పాశం విసిరాడు. ఆ సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ఉండడం చేత యమపాశం ఈశ్వరునిపై కూడా పడింది. తక్షణమే ఈశ్వరుడు ప్రత్యక్షమై "ఓ యముడా! నా పై కూడా పాశం వేసేటంత ధైర్యం ఉందా నీకు!" అని అతనిని భస్మం చేశాడు. ఈ విధంగా, మార్కండేయునికి రావలసిన చావు యమునికి పోయింది. యముని యొక్క చిరంజీవత్వం మార్కండేయునికి వచ్చింది. కనుక దైవస్పర్శచేత, దైవాను గ్రహించేత, దైవ ప్రార్థన చేత మీరు ఎటువంటి కర్మలనైనా మార్చుకోవచ్చును. అందుచేత, దైవాన్ని నిరంతరం ప్రార్థించడం, స్మరించడం పూజించడం అత్యవసరం. దైవం ఎక్కడో ప్రత్యేకమైన స్థానంలో లేడు; మీయందే ఉన్నాడు. దేహమే దేవాలయం. అట్టి అంతర్ముఖమైన దైవాన్ని మీరు నిరంతరం స్మరిస్తూ రావాలి.
(స.. సా.వ.99 పు.287/288)
శ్లో॥ చేతసా సర్వకర్మాణి మయిసన్న్యస్య మ త్ప రః
బుద్ధి యోగము పాశ్రిత్య మచ్చిత్త స్పతతం భవ
అర్జునా! జరామరణములనే దుఃఖము నుండి విముక్తి పొందు నిమిత్తము, నన్నాశ్రయించి ఎవడు సాధన చేయునో వాడు బ్రహ్మను, సంపూర్ణమైన ఆధ్యాత్మికాన్ని, కర్మనుతెలుసు కొన్నవాడగును. అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో గూడిన నన్ను ఎవడు ఆరాధన చేయునో, అట్టివాడు సమాహితచిత్త వృత్తి గలవాడై దేహము వీడు సమయమునందు గూడా నన్ను మరువక చింతించును. అంత్యకాలమనగా ఎప్పుడో కాదు. ఎప్పటికప్పుడే! నశ్వర శరీరములకు, ప్రతిక్షణము అంత్యమే! అట్టి అంత్య సమయమున ఏమి స్మరింతురో, అదియే తదుపరి పరిస్థితులకు అనుకూలమగును. అనగా పునర్జన్మకు పునాది. అట్టి సమయమున నన్ను స్మరించినవాడు నా భావాన్ని పొందును. అనగా నన్నే చేరును.
నాస్తి నాస్తి మహాభాగ
కలికాల సమయుగం
స్మరణాత్ ఉచ్చరణాత్తేవ
ప్రాప్నోతి పరమాం గతి:
అన్నట్లు ఇప్పుడు నామ సంకీర్తన చెయ్యకపోతే ఇంకెప్పుడు మనము చేసేది. నీ యొక్క హృదయాన్ని అనుసరించు. నీ ఆత్మతో సంబంధము పెట్టుకో..
(శ్రీ .భ. ఉ.పు.33)