(దుర్వాస మహర్షి- రుక్మిణి)
ఒకసారి దుర్వాస మహర్షి శ్రీకృష్ణుని సందర్శించేందుకు మధురకు వెళ్ళాడు. యమునా నదికి ఆవలి ఒడ్డున బసచేశాడు. మహర్షికి ఆహారం ఇచ్చిరమ్మని శ్రీకృష్ణుడు రుక్మిణితో చెప్పాడు. యమునానది పొంగి పారుతున్నది కదా ఎలాదాటి వెళ్ళాలో చెప్పండని ఆమె అడిగింది. నిత్య బ్రహ్మచారి (అస్ఖలిత బ్రహ్మచారి) త్రోవ ఇమ్మన్నాడని చెప్తే నది త్రోవ ఇస్తుందని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆమె అట్లే చేసింది. నది దారి ఇచ్చింది. ఆమె అటువైపుకు చేరగానే యమున యథాపూర్వంగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించసాగింది. రుక్మిణి దుర్వాసునికి భోజనం పెట్టింది. ఆయన సంతృప్తిగా భుజించాడు. అప్పుడు రుక్మిణి నదిని దాటిపోయే మార్గమేమిటని దుర్వాస మహర్షిని అడిగింది. నిత్య ఉపవాసి త్రోవ ఇమ్మన్నాడని చెప్తే యమునానది త్రోవ ఇస్తుందని చెప్పాడు దుర్వాసుడు. రుక్మిణి అట్లేచేసి శ్రీకృష్ణుని వద్దకు వచ్చింది. వివాహితుడవైన నీవు నిత్య బ్రహ్మచారివి ఎట్లయ్యావు? సంతృప్తిగా భుజించిన ఆ మహర్షి నిత్య ఉపవాసి ఎట్లయ్యాడు?” అని శ్రీకృష్ణుని ప్రశ్నించింది.
నీవాపదాల బాహ్యార్థమే ఎందుకు తీసుకుంటున్నావు? అంతరార్థాన్ని గ్రహించాలి. నిత్య బ్రహ్మచారి అంటే నిరంతరం దివ్యత్వస్థితిలో ఉండేవాడని అర్థం! నిత్య ఉపవాసి! అంటే, నిరంతరం దైవానికి సమీపంలో ఉండేవాడని అర్థం! అందుచేతనే నేను నిత్య బ్రహ్మచారి ని, దుర్వాసమహర్షి నిత్య ఉపవాసి!" అని చెప్పి రుక్మిణీదేవి సందేహాన్ని తీర్చాడు శ్రీకృష్ణుడు. అట్లే మీరు నామాటలకు అంతరార్థం తీసుకోవడం నేర్చుకోవాలి! అని ఉద్బోధించారు స్వామి. ((శ్రీ సత్య సాయి ఆనందసాయి పు489-490)