ఈశ్వర చంద్ర విద్యాసాగర్ తల్లి కోరిన కోరికలే ఈశ్వరమ్మ కూడా కోరింది. "స్వామీ! మన పుట్టపర్తి గ్రామం చాల చిన్నది. ఈ గ్రామంలోని పిల్లలు ఎక్కడికో పోయి చదువుకోవలసి వస్తున్నది. మీరు దయాసాగరులు. చిన్న స్కూల్ కట్టించండి " అన్నది. "ఎక్కడ కట్టించ మంటావు?" అని అడిగాను. "స్వామీ! నా ఇంటి వెనుక కొంత స్థలం ఉన్నది. అక్కడ కట్టించండి" అన్నది. ఆమె కోరినట్లుగా స్కూల్ కట్టించాను. స్కూలు చిన్నది అయినా దాని ప్రారంభోత్సవం పెద్ద ఆర్భాటంగా జరిగింది. భక్తులందరూ వచ్చారు. మరునాడు ఈశ్వరమ్మ నావద్దకు వచ్చి నిన్నటి దినము కార్యక్రమం చాల బాగా జరిగింది. ఐతే, నాకు మరొక కోరిక ఉన్నది. మన పల్లె ప్రజలు సరియైన వైద్యసౌకర్యం లేక బాధ పడుతున్నారు. కనుక, ఒక చిన్న ఆసుపత్రి కట్టించు అన్నది. సరే కట్టించాను. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి బెజవాడ గోపాలరెడ్డిని పిలిపించాము. ప్రారంభోత్సవం చాల ఘనంగా జరిగింది. ఇంత గొప్పగా జరుగుతుందని ఈశ్వరమ్మ అనుకోలేదు. మరునాడు నావద్దకు వచ్చింది. "స్వామీ! ప్రజల బాధలు తగ్గించి నా మనోభీష్టమును నెరవేర్చారు. ఇంక నేను చచ్చినా ఫరవాలేదు" అన్నది. "ఇంకా ఏమైనా కోరికలుంటే ఆడుగు" అన్నాను. "స్వామీ! ఇంకొక్క చిన్న కోరిక ఉన్నది. మన చిత్రావతి వర్షాలు వచ్చినప్పుడు పొంగిపోతుందిగాని, లేనప్పుడు కనీసం త్రాగటానికైనా నీరుండదు. కాబట్టి, ఒక బావిని త్రవ్వించండి" అన్నది. ఆ అభీష్టాన్ని కూడా నెరవేర్చాను. "చిన్న బావి కాదమ్మా, ఈ రాయల సీమకే నేను నీరందిస్తాను" అని ఆ దినమే చెప్పాను. "అదేమిటో నాకు తెలియదు. ఈ ఊరికి నీరిచ్చావు. అదే నాకు సంతోషము" అన్నది.
తరువాత శివరాత్రి వచ్చింది. నేను ఉపన్యాసం ఇచ్చిన తరువాత లింగోద్భవం జరిగింది. లింగోద్భవమునకు ముందు నేను చాల బాధ పడటం చూసి ఈశ్వరమ్మ అంతమంది జనంలో నుండి లేచి వేదికపైకి వచ్చేసింది. "ఏమిటి ఇంత అవస్థ పడుతున్నారు? ఎందుకోసం ఈ అవస్థ? లోపలకు రండి" అంది. "నే నిప్పుడు రాను" అన్నాను. చాల ఏడ్చింది. ఆమె ఎంత ఏడ్చినా నేను లోపలకు పోలేదు. ఆమె లోపలకు వెళ్ళిపోయింది. అప్పుడు లింగాలు ఉద్భవించాయి. హిరణ్య గర్భ లింగము కూడా వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు విని ఆమె బయటికి వచ్చింది. అప్పుడు నేను లింగమును అందరికీ చూపుతూ ఉన్నాను. భక్తులందరూ లేచారు. ఆందు చేత ఆమెకు కనిపించలేదు. మరునాడు నావద్దకు వచ్చి, "స్వామీ! మీరు లింగము తీసినారట. నేను చూడనే లేదే. నాకు చూడాలని ఉంది" అన్నది "అప్పుడు తీసి ఎవరికో ఇచ్చాను. మున్ముందు చూస్తావులే" అన్నాను. సరే, మిమ్మల్ని తొందర పెట్టనని వెళ్ళిపోయింది. ఈ విధంగా, ఆమె ఏ విషయంలో నైనా స్వామిని కించిత్తు కూడా బాధ పెట్టేది కాదు. "స్వామీ! మిమ్మల్ని కష్టపెట్టడం నాకిష్టం లేదు. మీరు కష్టపడితే జగత్తే కష్టపడుతుంది. మీరు ఆనందిస్తే జగత్తంతా ఆనందిస్తుంది". అనేది ఒక్కొక్క పర్యాయం ఏదైనా అడిగి, తిరిగి వెళ్ళి పోయేటప్పుడు రెండు మెట్లు దిగి మరల వెనక్కి వచ్చి, "స్వామీ! మీకేమైనా కష్టం కలిగిస్తున్నానా?" అని అడిగేది. నాకేమీ కష్టం లేదంటే సంతోషంగా వెళ్ళిపోయేది. వచ్చిన ప్రతి ఒక్కరికి, "స్వామిని కష్టపెట్టకుండా మీరు సంతోషపడండి" అని చెప్పేది. ఎవరైనా మినిష్టర్లు వస్తున్నారంటే, ఎఱ్ఱ టోపి పెట్టుకొని పోలీసు వస్తున్నాడంటే చాల భయపడేది. "స్వామీ! మినిష్టరు వస్తున్నాడట. ఎక్కడ ఉంటాడో ఏమో. ఏమి అడుగుతాడో, ఏమో" అనేది. నీవేమీ భయపడవద్దు, నేను చూసుకుంటాను అనే వాడను. తల్లి ప్రేమ ఆవిధంగా ఉంటుంది. ఆమెకు ఏవిధమైన కొరతలూ లేకుండా ఆమె ఉన్నంత వరకు సంపూర్ణ శాంతిని అందించాను. తల్లి ప్రేమను పదిమంది దృష్టికి తెప్పించే నిమిత్తమై ప్రతి సంవవత్సరం “ఈశ్వరమ్మ డే జరుపుకున్నాము. ప్రతి ఒక్కరూ తల్లిని సంతోష పెట్టాలి. తల్లిని సంతోష పెడితే స్వామిని సంతోష పెట్టినట్లే.
(స.సా.జూన్ 99. పు.147/148 మరియు
సా.శ్రు. పు.127/128)
"తెలుగులో ఒక సామెత ఉంది. నిజమైన భక్తి చివరి క్షణంలోనే కనపడుతుందని. ఈశ్వరమ్మ మంచితనం గురించి ఒక చిన్న సంఘటన చెపుతాను. ఎండా కాలపు క్లాసులు బెంగుళూరులో జరుగుతున్నది. ఉదయం ఏడు గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు చుట్టూ వెళ్ళి తిరిగి వచ్చారు. ఈశ్వరమ్మ స్నానం ముగించింది. సంతోషంగా కాఫీ తీసుకుంది. బాత్ రూం వేపుకు పోతూ "స్వామీ! స్వామీ!" అని కేక వేసింది. “వస్తున్నా! వస్తున్నా!" అని నేను పలికాను. ఆ సమయంలోనే ఆమె తుది శ్వాసను విడిచింది. ఇంతకంటె ఆమె మంచి తనానికి ఏమి నిదర్శనం కావాలి? ఆమెకు ఒకరు ఉపచారం చేయవలసిన అవసరం కలుగలేదు. ఆ సమయంలో స్వామి జ్ఞాపకం రావడమనేది ఏ కొద్దిమందితో జరుగుతుంది. అది గజేంద్రుని పిలుపు, ప్రభువు రాకవలె జరిగిపోయింది. ఇట్టి ప్రామాణికమైన సమాప్తి కొరకే అందరూ ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో ఆమె ప్రక్కన కుమార్తె వెంకమ్మ, మనుమరాలు శైలజ ఉన్నారు, కాని స్వామినే పిల్చింది. అలాంటి ఆర్తితో జీవితం సమాస్తం కావడం పవిత్రతకు, నిర్మలత్వానికి నిదర్శనం. బలవంతం మీద కాకుండా ఆ దృష్టి దానంతట అదే రావాలి".
(సపా. మే 2000 పు.139/140)
పేరు ప్రతిష్ఠలకోసం నేను చెప్పటం లేదు. ఈ శరీరానికి తల్లియైన ఈశ్వరాంబ, చిన్నప్పటి నుంచి ఎంతో వినయంతో, ధర్మంతో, విశాలమైన భావంతో అందరిని చూస్తుండేది. చిన్న పిల్లలను చూస్తేచాలు, ప్రేమలో ఎత్తుకొని లాలించేది. ఒకానొక సమయంలో కరణం సుబ్బమ్మకు బిడ్డలు లేక చాలా విచారిస్తూ ఉండేది. అప్పుడప్పుడూ నీపిల్లవాడినెవరినైనా మా ఇంటికి పంపమనిఈశ్వరాంబను అడుగుతుండేది. ఆ విధంగా అడిగి స్వామిని తీసుకొని వెళ్ళి ఎంతో లాలించేది. ఈనాడు ఇలాంటి తల్లులు ఎందరో ఉంటున్నారు.
ఒకనాడు తాము కరణం సుబ్బమ్మ ఇంటిలో వుండగా పరుగెత్తుకుంటూ ఈశ్వరమ్మ వచ్చింది. కారణం అడిగాను. “స్వామీ! పక్కింటి అమ్మాయికి చాలా జబ్బు చేసింది. తల్లి చాలా బాధపడుతున్నది. ఆ బాధన చూడలేకపోయాను. అందులో ఈ కుగ్రామంలో కనీసం చిన్న ఆసుపత్రి కూడా లేదు. మందులిచ్చే దిక్కులేదు. ఎందరో బాధపడుతున్నారు. మీవద్దకు ఎందరో భక్తులు నిత్యమూ వస్తున్నారు గదా! వారి వారి బాధలను చెప్పుకుంటున్నారు. ఎదుటి వారి బాధలను ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆ పని మీరు ఒక్కరు మాత్రమే చేయగలరని నా విశ్వాసం. పేద ప్రజల బాధలను నివృత్తిచేసే నిమిత్తమై ఒక చిన్న ఆసుపత్రిని ఈ కుగ్రామంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నదిఈశ్వరమ్మ, అప్పుడు నేను చెప్పాను...
ఈ చిన్నదానికోసం ఎందుకు ఇంత గాబరా పడుతున్నావు. ప్రతిదానికి సమయం రావాలి. తొందరపడవద్దు అని చెప్పి బయటకు వెళ్ళాను. అయితే ఆనాటి నుంచి దీనిని గురించి ఆలోచిస్తునే ఉన్నాను. పరోపకార సంబంధమైన ఆమె కోరికను నెరవేర్చాలని సంకల్పించుకున్నాను. రెండవ నాటి నుంచే పని ప్రారంభింపజేయించాను. నెలరోజులు తిరగకమునుపే ఆసుపత్రిని ఏర్పాటు చేయించాను. ‘బ్రహ్మము అనే డాక్టర్ను నియమించాను. కొంత కాలానికిమిక్కిలి సీతారామయ్య వచ్చి ఆ ఆసుపత్రి బాధ్యత తనకు ఎప్పజెప్పమన్నాడు. ఆయన స్వామి భక్తుడు. ఆనాటి నుంచి కట్టకడపటి శ్వాస వదిలేంతవరకు ఆసుపత్రిలోనే వుండి సేవలు అందించిన సేవాతత్పరుడు. కాని ఈనాడు అటువంటి డాక్టర్లు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. డబ్బే ప్రధానంగా భావిస్తున్నారు. పల్లెలకు వెళ్ళి సేవలు చేయడానికి ముందుకు రావటం లేదు. నగరాలలోనే ఉండాలి. సౌకర్యాలు అనుభవించాలి. డబ్బు సంపాదించాలి. ఇదే భావం ఈనాడు చాలామంది డాక్టర్లలో కనిపిస్తున్నది. ధనం శాశ్వతం కాదు. సేవలు చేయాలి. "రూపాయి కోసమే లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయా" గడ్డి అయినా తింటారు గాని, రూపాయి సంపాదించాలి. కాని వీరికి భగవంతుని ... (అను గ్రహం) కావాలి. ఎక్కడనుంచి వస్తుంది? వీరికి ...(గడ్డి) చిక్కుతుందిగాని భగవంతుని అనుగ్రహం) మాత్రం చిక్కదు.
ఈనాడు త్యాగమూర్తులు తయారు కావాలి. ఈనాడు భక్తి శ్రద్ధలు కాదు ముఖ్యం. ప్రజల బాధలను గుర్తించి, నివారణోపాయాన్ని వెదికేవారు కావాలి. సమాజ సంక్షేమాన్ని ఆశించేవారు కావాలి. సమాజ సంక్షేమాన్ని కోరే డాక్టర్ల అవసరం ఈనాడు ఎంతైనా ఉన్నది. ఈనాడు సేవకులు కావాలిగాని నాయకులు కాదు. సేవకుడుకాని వాడు నాయకుడైనా ప్రయోజనం లేదు. నాయకుడైనవాడు సేవకుడుగా వున్నప్పుడే దేశానికి ఎంతైనా సేవ చేయగలడు.
(శ్రీ,.వా. 2002 పు. 7/8)
(చూ ఉపకారము,కొండమరాజుతల్లితండ్రులు, ప్రవేశము)