ఇది భౌతిక జ్యోతిని నిర్దేశించుటలేదు. జ్యోతికి భౌతికమగు హద్దు చెప్పబడిన సర్వాత్మకము కాదు కదా! కాన అది ఉపాసనా విషయము కాజాలదు. ఈ జ్యోతి శరీరమందున్న ప్రాకృత లక్షణమగు జ్యోతియే అన్న బ్రహ్మ ప్రత్యభిమానము సాధ్యము కాదు. "పాదోస్య విశ్వ భూతాని" అని పురుషసూక్తములో చెప్పబడుటచేత దీనికి ఒక ప్రమాణము, కొలత అంటూ లేదు. కావున ఇక్కడ పరబ్రహ్మము కాదు. ఇది స్వర్గము లోకముకంటే పరమై, దీప్తమవుతుంది. ఏదైతే సర్వప్రాణుల సృష్టి భాగములకంటే పూర్వమున వెలుగుచున్నదో, దేనికంటే మించిన లోకము లేదో అట్టి ఉత్తమోత్తమ లోకములో ప్రకాశించు జ్యోతి యిది. ఈ జ్యోతి సర్వప్రాణులయందూ, సర్వత్రా, సర్వదా ప్రకాశించు చున్నది. అస్తి, భాతి, ప్రియ, రూపమైనది ఈ జ్యోతి.
ఈ పరబ్రహ్మమే ప్రపంచమును ప్రకాశింపజేయు చున్నాడు. జ్యోతి శబ్దములో చెప్పబడిన పరమాత్మ యిట్టిది కాని, లౌకిక జ్యోతులు కావు. ఇదే పరంజ్యోతి అద్వైతజ్యోతి. అదే పరబ్రహ్మము. అతని వలననే ఈ సమస్తమును ప్రకటితమగుచున్నది. అయితే ఈ జ్యోతి పరబ్రహ్మమును గురించి చెప్పినది కాదని వాదించుట తగనిది. సరికానిది.
ఉపనిషత్తులు బ్రహ్మమునకు నాలుగు పాదము లున్నవని చెప్పుచున్నవి. జ్యోతి శబ్దము బ్రహ్మమునకు అన్వయించునని కూడా చెప్పబడినది. అందులో ఒక పాదము సర్వ భూతముల ఆంతర్గత మొనరించుకొనుచున్నది. మిగిలిన మూడు పాదములు దివియందు అమృతము. ఈ అమృతము సాధారణ జ్యోతి కాజాలదు. మరొక పక్షము వారు ఉపనిషత్తునందు గల జ్యోతి: దీప్యతే అను పదములు బ్రహ్మమునకు అన్వయింపక ప్రాకృత జ్యోతికి మాత్రము అన్వయించునని వాదించు చున్నారు. ఇది అర్థము లేనిది. దీప్యమానమగు తన కార్యజ్యోతి ఉపాధిగా గల బ్రహ్మమునందే ఆ పదములన్వయించుచున్నవి. ఒక దానిని ప్రకాశిపచేయునది "దీప్యతే” అని తెలుపుచున్నది. అయితే సమస్త జగత్తునకు ప్రకాశము నొసగు బ్రహ్మమును జ్యోతి అని తెలుపుట శ్రుతి వాక్యము.
కదిలే జగత్తుకు ఆధారమై, మూలమై, కీలకమై స్థిరముగా కదలక సత్యమై యుండునది. అదే బ్రహ్మ, అదే జ్యోతి. కదిలే జగత్తుకు ఆధారమైన బ్రహ్మకూడా కదిలిన అదే ప్రళయము. చిన్న ఉదాహరణము రైలు కదలిపోతూ వుంటుంది. దానితో పాటు పట్టాలు కూడా కదిలిన ప్రయాణీకుల గతి యేమవుతుంది? అటులనే మనము కదలుచుండినను. మనము నడచేదారులు కదలవు. అందువలననే మనము క్షేమంగా ఉండగలుగుతున్నాము. సమస్తజ్యోతులను అనగా ఒక్కొక్క దానిని వెలిగించే జ్యోతిని దీపమని యందురు. సమస్తమునూ వెలిగించి, నిరూపించే దానిని జ్యోతి యందురు. లోకములోని అగ్నిని, జఠరములోని అగ్నిని, కన్నులలోని చూపును, చంద్రునిలోని కాంతిని వెలిగించేది సూర్యుడు. ఆసూర్యుని వెలిగించేది బ్రహ్మ. అట్టి బ్రహ్మనే జ్యోతి అని చెప్పబడినది కాని, పదార్థములను వెలిగించే దానిని కాదు. జగత్తునే వెలిగించే దానిని జ్యోతి అని చెప్పనగును.
(సూ.వాపు 49/51)